గణపవరం మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించిన జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి.
జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సోమవారం గణపవరం మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా జల్లి కొమ్మర గ్రామానికి చెందిన ఆన్లైన్ మ్యుటేషన్ ఫైల్స్ ను పరిశీలించి డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్న వాటిని మాత్రమే ఆన్లైన్ చేయాలని ఆదేశించారు. అదేవిధంగా క్యాస్ట్ సర్వే ఏవిధంగా జరుగుతున్నది అడిగి తెలుసుకున్నారు. అనంతరం గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కొమ్మర గ్రామంలో నీట మునిగిన వరి పొలాలను ఆయన పరిశీలించారు. పంట పొలాల నుండి వర్షపు నీరు తొలగిన తరువాత వరినాట్లు ఏ విధంగా ఉన్నది పరిశీలించి, ఒకవేళ వరి నాట్లు పనికి రాకుండా పోతే వాటి స్థానంలో తక్కువ సమయంలో పంట చేతికి వచ్చే కొత్త వరి నారును నాటుకునే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారిని ఆదేశించారు. అనంతరం వల్లూరు గ్రామంలో ప్రభుత్వ భూముల రీ సర్వే ఏవిధంగా జరుగుతున్నది పరిశీలించారు. ప్రభుత్వ భూముల రీ సర్వేలో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా సంబంధిత శాఖల సమన్వయంతో సత్వరమే పూర్తి చేయాలన్నారు.
ఈ సందర్భంలో వెంకయ్య వయ్యేరు కాలువ నీటి ప్రవాహ ఉధృతిని జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ వెంట తహసిల్దార్ వై.కె.వి అప్పారావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, మండల సర్వేయర్ ఎం.వంశీ తదితరులు ఉన్నారు.