“విక్షిత్ భారత్” దార్శనికతను సాకారం చేసుకోవడానికి ప్రటిష్టమైన, అధిక నాణ్యత గల పాఠశాల విద్యా వ్యవస్థను తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.

మంగళవారం జిల్లా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరం నందు “విక్షిత్ భారత్ లక్ష్యంగా పాఠశాల విద్య – నిర్మాణ విభాగాలు” అనే అంశంపై జిల్లాలోని విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన ఒక్కరోజు వర్క్ షాప్ లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొని పలు సూచనలు, ఆదేశాలను జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ మన ప్రధానమంత్రి వ్యక్తీకరించబడిన “విక్షిత్ భారత్” దార్శనికత, భారతదేశాన్ని 100వ స్వాతంత్ర్య దినోత్సవంతో సమానంగా 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చడం లక్ష్యంగా అన్ని రంగాలలో నిరంతర లక్ష్య నిర్దేశం మరియు సాధన అవసరం అన్నారు. మానవ అభివృద్ధి శిశువులు, పిల్లలు, యువత, వయోజనలు, మహిళలుపై నిర్మించబడి ఉందన్నారు. విక్షిత్ భారత్‌ను సాధించడానికి ఆర్థిక వృద్ధిని, సామాజిక సమానత్వం, ప్రపంచ పోటీతత్వం, పర్యావరణ స్థిరత్వం, పారిశ్రామిక ఆధునీకరణ, సుపరిపాలన, భారతదేశం ప్రపంచ జ్ఞాన సూపర్ పవర్‌గా ఆవిర్భవించడానికి సమగ్రమైన విధానం అవసరం అన్నారు. దీని నిర్మాణంలో అత్యంత కీలకమైనది నాణ్యమైన పాఠశాల విద్య అన్నారు. 3-18 సంవత్సరాల వయస్సు గల ప్రతి బిడ్డకు అందుబాటులో ఉండే, నాణ్యమైన విద్య మరియు నైపుణ్య అవకాశాలను పటిష్ట పరచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. శ్రామిక శక్తి, సామాజిక, భావోద్వేగ సామర్థ్యాలను పెంపొందించడంలో పాఠశాల విద్య ప్రారంభ, అత్యంత కీలకమైన దశ అన్నారు. ఈ లక్ష్యంతో జాతీయ విద్యా విధానం ద్వారా పాఠశాల విద్యలో ఒక సమూల పరివర్తనను తీసుకువచ్చేందుకు విద్యా వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని, అందరికీ అధిక నాణ్యత గల విద్యను అందించడం ద్వారా భారతదేశాన్ని ప్రపంచ జ్ఞాన సూపర్ పవర్‌గా మార్చేందుకు లక్ష్యంగా పెట్టుకుందన్నారు. పాఠశాల విద్య యొక్క అన్ని దశలలో నాణ్యమైన విద్య యొక్క అత్యంత ప్రాముఖ్యతను గుర్తించి ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. ప్రతి విద్యార్థికి ప్రాథమిక విద్యా స్థాయి నుండే 70 శాతం మెదడు పరిపక్వత చెందుతుందన్నారు. దీనిలో అంగన్వాడీలు, ప్రాథమిక పాఠశాలలు, పాఠశాలలు ప్రధాన భూమికను పోషిస్తాయి అన్నారు. అంగన్వాడీలు, పాఠశాలల్లో డ్రాప్ ఔట్స్ లేకుండా నూరు శాతం హాజరు సాధించాలన్నారు. విక్షిత్ భారత్ లక్ష్యంగా చేసుకొని మంచి ఫలితాలను సాధించవచ్చు అన్నారు. పిల్లవాని మానసిక వికాసానికి తల్లి పాత్ర ఎంతో కీలకమైనదని, కొంత సమయాన్ని తల్లి పిల్లలతో తప్పక గడపాలన్నారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశలో ఆరోగ్యంగా ఉండడం ఎంతో కీలకమైనదన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలపై పట్టు సాధించేలా బోధించాలన్నారు. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ మీద దృష్టి సారించేలా చూడాలన్నారు. ప్రతి పాఠశాలలో డిజిటల్ టెక్నాలజీ అందుబాటులో ఉందని విజువలైజేషన్ ద్వారా విద్యను అందిస్తే ఎక్కువగా గ్రహించగలుగుతారని సూచించారు.
వర్క్ షాప్ లో జిల్లా విద్యాశాఖ అధికారి ఇ.నారాయణ, సమగ్ర విద్య ఏపీసి పి.శ్యాంసుందర్, డిప్యూటీ విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.