ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పటిష్టమైన విద్యను అందించేందుకు ఉచిత ప్రైవేటు తరగతులను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

సోమవారం భీమవరం దుర్గాపురం మున్సిపల్ ప్రాథమిక పాఠశాల నందు వసుధ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన “విద్యా సౌజన్యం లెర్నింగ్ సెంటర్” (ఉచిత ప్రైవేట్ తరగతులను) ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్య నుండే మెరుగైన విద్యను అందించడం ద్వారా చక్కటి విద్యకు పునాది పడుతుందన్నారు. అక్షరాస్యత తక్కువగా ఉన్న తల్లిదండ్రులు వారి పిల్లలకు ఇంటి వద్ద పాఠాలను చదివించడం, నేర్పించడం కష్టంగా ఉంటుందని, ఇటువంటివారికి ప్రైవేట్ తరగతులు ఎంతో ఉపయోగంగా ఉంటాయన్నారు. చిన్నారులకు ప్రాథమిక విద్య నుండి ఎంత విద్యను అందిస్తే అంత సులభంగా, నేర్చుకోగలిగేలా ఉంటుందని, ఇటువంటి విద్య పై తరగతులలో బాగా ఉపయోగపడుతుందన్నారు. మధ్యాహ్నం మూడున్నర గంటలకు పాఠశాల ముగిసిన అనంతరం ఒక గంట పాటు ప్రత్యేక టీచర్ల ద్వారా ఆరోజు టీచర్లు చెప్పిన పాఠాలను చదివించడం, హోమ్ వర్క్ చేయించడం, కొత్త కొత్త విషయాలను నేర్పించడం ఈ అదనపు తరగతుల ద్వారా నేర్పించడం జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో మిగతా ప్రభుత్వ పాఠశాలలో కూడా అదనపు ప్రైవేటు తరగతులను నిర్వహించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. చిన్నారులతో కొంత సమయం జిల్లా కలెక్టర్ ముచ్చటించి ప్రైవేటు తరగతుల వలన లాభాన్ని పిల్లలకు వివరించారు. వసుధ ఫౌండేషన్ అందించిన నోటు పుస్తకాలను విద్యార్థులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వసుధ ఫౌండేషన్ నిర్వాహకులను జిల్లా కలెక్టర్ అభినందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఇ.నారాయణ, సమగ్ర విద్య ఏపీసి పి.శ్యాంసుందర్, పాఠశాల హెడ్మాస్టర్ ఆర్.రాంబద్రరావు, ఏ ఎమ్ ఓ సిహెచ్ఎస్ వి సుబ్రహ్మణ్యం, వసుధ ఫౌండేషన్ నిర్వాహకులు ఇందుకూరి ప్రసాదరాజు, మానవతా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి వెంకటపతిరాజు, మానవతా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.