జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం విజయవంతనికి అధికారులందరూ కలిసికట్టుగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆగస్టు 12వ తేదీన జిల్లా అంతటా నిర్వహించనున్న జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం గోడ పత్రికలను సోమవారం పిజిఆర్ఎస్ సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పిల్లలు, కిషోర్ బాలల కడుపులో నులిపురుగులు ఉన్నట్లయితే పౌష్టికాహార లోపం, రక్తహీనత వల్ల నీరసంగా ఉంటారన్నారు. అదేవిధంగా శారీరక, మానసిక ఎదుగుదల లోపాలను కలిగి ఉంటారన్నారు. ఆల్బెండజోల్ 400 మిల్లీగ్రాముల మాత్ర. ద్వారా నులుపురుగుల సంక్రమణను సులభంగా నిర్మూలించవచ్చున్నారు. జిల్లాలోని అన్ని అంగన్వాడీలు, పాఠశాలలు, కళాశాలలో ఆల్బెండజోల్ మాత్రలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ శాఖలు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. 0 – 2 సంవత్సరాల వయసులోపు గల పిల్లలకు పొడి చేసి ఇవ్వాలని, 3 – 5 సంవత్సరాల లోపు పిల్లలకు చప్పరించి నమిలి మింగే విధంగానూ, 5 సంవత్సరాల పైబడిన పిల్లలకు టాబ్లెట్ లను మంచినీటితో వేయించాలని, పిల్లలు మాత్రల వినియోగ సమయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అలాగే పాఠశాల ఉపాధ్యాయులు, వంట చేసేవారు కూడా మాత్రలను వేసుకోవాలన్నారు. ఆగస్టు 12వ తేదీన ఆల్బెండజోల్ నూరు శాతం పిల్లలకు అందించాలని, ఒకవేళ ఎవరైనా ఆరోజు తీసుకోకపోతే ఆగస్టు 20వ తేదీన మ్యాప్ అప్ రోజున ఆల్బెండజోల్ మాత్ర వేసుకునే విధంగా సంబంధించిన సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, డి.ఏం అండ్ హెచ్ ఓ డాక్టర్ జి. గీతా బాయి, ఆర్ బి ఎస్ కే పిఓ డాక్టర్ సిహెచ్ భావన, కె ఆర్ ఆర్ సి డిప్యూటీ కలెక్టర్ బి శ్రీమన్నారాయణ రెడ్డి, డ్వామా పిడి డాక్టర్ కేసిహెచ్ అప్పారావు, పి జి ఆర్ ఎస్ నోడల్ అధికారి వై.దోసి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.