యువత దేశ సమగ్రతను సమైక్యతను కాపాడే విధంగా కలిసికట్టుగా తమ వంతు సహాయ సహకారాలను అందిస్తూ దేశాన్ని ఉన్నత స్థితిలో ఉంచాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

అజాదీ కా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా “హర్ ఘర్ తిరాంగా” కార్యక్రమంలో పౌరులలో జాతీయ జెండా పట్ల గౌరవ భావాన్ని పెంపొందించడం లక్ష్యంగా సుమారు 2 వేల మంది కళాశాల విద్యార్థినీ విద్యార్థులతో 200 మీటర్ల భారత త్రివర్ణ పతాకాన్ని చేతబూని భీమవరం ఎస్ ఆర్ కె ఆర్ కళాశాల నుండి సాగిన భారీ ర్యాలీలో సోమవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఇంటింటా జాతీయ జెండా పేరున కొనసాగుతున్న ఈ కార్యక్రమం మన ప్రధానమంత్రి మానస పుత్రిక అని, మనమందరం దేశభక్తితో కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జాతీయ జెండాను రూపకర్త పింగళి వెంకయ్య మన రాష్ట్రం వాడే కావడం మనకు ఎంతో గర్వకారణం అన్నారు. జెండా ఎగురవేసి ఐక్యతను ప్రదర్శించేందుకు ఆగస్టు 13 నుండి 15 వరకు ఇళ్ళు, కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాలలో జెండాలను ఎగురవేయాలన్నారు. జిల్లాలోని పౌరులు అందరూ వారి ఇళ్లలో జాతీయ జెండాను ఎగురవేయాలని, మన ఐక్యతను కాపాడుకునేందుకు స్వాతంత్ర్య. దినోత్సవాన్ని జరుపుకోవడానికి హర్ ఘర్ తిరంగ ఉద్యమంలో పాల్గొనాలన్నారు. ఎందరో మహానుభావుల ప్రాణలు, జీవితాలు, ఆస్తులు త్యాగాల ఫలితంగా మనం నేడు స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్నామన్నారు. యువత దేశ సమగ్రతను, సమైక్యతను కాపాడే విధంగా కలిసికట్టుగా ఉండి తమవంతుగా దేశానికి ఎంతో కొంత సేవ చేసి దేశభక్తిని చాటుకోవాలని, భారతదేశాన్ని అన్నింటా ముందంజలో ఉంచాలని ఈ సందర్భంగా కోరారు.
ర్యాలీకి ముందు ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రధాన ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో దేశభక్తిపై వివిధ పాఠశాలల విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మొగిలి వెంకటేశ్వర్లు, భీమవరం ఆర్టీవో కే.ప్రవీణ్ కుమార్ రెడ్డి, డిఇఓ ఇ.నారాయణ, భీమవరం మున్సిపల్ కమిషనర్ కే.రామచంద్రారెడ్డి, జిల్లా టూరిజం అధికారి అప్పారావు, కళాశాల ప్రిన్సిపాల్, భారీ సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.