• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

జిల్లాలో ప్రాచుర్యం పొందిన చేనేత వస్త్రాలకు విస్తృత ప్రచారం కల్పించి, మార్కెటింగ్ ను పెంపొందించాలని ఇంచార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి చేనేత అధికారికి సూచించారు.

Publish Date : 07/08/2025

గురువారం “11వ జాతీయ చేనేత దినోత్సవం – 2025” పురస్కరించుకొని జిల్లా చేనేత మరియు జౌళి శాఖ ఆధ్వర్యంలో ప్రకాశం చౌక్ నుండి భీమవరం మున్సిపల్ కార్యాలయం వరకు ఏర్పాటుచేసిన చేనేత వాక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తొలుత భీమవరం శాసనసభ్యులు మరియు పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. అనంతరం మునిపల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన చేనేత వస్త్ర ప్రదర్శన మరియు అమ్మకం ప్రారంభం, నేత కార్మికులకు సత్కారం కార్యక్రమాల్లో ఇంచార్జి జిల్లా కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ పీతల సుజాత సంయుక్తంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచం అన్ని రంగాల్లో వేగంగా మారుతున్న నేపథ్యంలో చేనేత రంగం కూడా సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి అనేక కష్టాలు పడే వారని, నేడు ఆన్‌లైన్‌ మార్కెట్లు, డిజిటల్ పోర్టల్స్, ప్రభుత్వ వేదికలు వంటి అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ మార్పులను అంగీకరించి, తరం నుండి తరం వరకు నైపుణ్యాన్ని కొనసాగించడమే కాకుండా, ఆదాయాన్ని పెంపొందించే దిశగా చేనేత కుటుంబాలు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన “వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్” పథకం కింద పశ్చిమగోదావరి జిల్లా తరఫున నరసాపురం లేసుకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం గర్వకారణమని తెలిపారు. జిల్లాలోని చేనేత కుటుంబాలకు అవసరమైన మద్దతును అందించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందన్నారు. ఉత్పత్తుల నాణ్యత, మార్కెటింగ్ సామర్థ్యం, ఆధునికీకరణ, శిక్షణ వంటి అంశాల్లో అవసరమైన సహాయాన్ని అందించేందుకు సంబంధిత శాఖలను సమన్వయం చేస్తామని తెలిపారు. మన ఆంధ్రప్రదేశ్ లో చాలా ఉత్పత్తులకు జియోగ్రఫీకల్ గుర్తింపు (జి.ఐ) వచ్చాయన్నారు. కేంద్ర ప్రభుత్వం భారత దేశంలో ఏదో ఒక గ్రామంలో, ఎక్కడో ఒక చోట ఒక నైపుణ్యము ఉంటుందని, దాన్ని గుర్తించి ఆ ప్రాంతంలో తయారు చేయబడుతున్న ఆ ఉత్పత్తిని కాపాడడం కోసం జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే జిల్లాలో ప్రాచుర్యం పొందిన చేనేత ఉత్పత్తులకు జిఐ ట్యాగ్ కు దరఖాస్తు చేయాలని, జిఐ ట్యాగ్ వస్తె మార్కెటింగ్ అవకాశాలు మెరుగవుతాయన్నారు. మన జిల్లాలో నర్సాపురం లేస్ కు జిఐ ట్యాగ్ పొందడం జరిగిందన్నారు. కష్టానికి మెళుకువలు, నైపుణ్యం జోడిస్తే చేనేతకు మంచి వైభవం వస్తుందన్నారు. అప్పుడు మార్కెటింగ్, బ్రాండింగ్ ఏర్పడతాయన్నారు. చేనేత ఉత్పత్తుల ప్రచారానికి సోషల్ మీడియాను వినియోగించుకోవాలని అన్నారు. అలాగే ఓఎన్డిసి ప్రాచుర్యం పొందుతుందని, ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై దృష్టి సారించాయన్నారు. అన్ని వర్గాలు ఆదరించే వస్త్రాలు తయారు చేయడం ద్వారా ఒక ట్రెండ్ సెట్ చేస్తే ఆటోమేటిక్ గా దానికి మార్కెటింగ్ వస్తుందన్నారు.

రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ పీతల సుజాత మాట్లాడుతూ చేనేత కేవలం జీవనోపాధి మాత్రమే కాకుండా మన సంస్కృతికి, మన ప్రత్యేకతకు నిదర్శనమన్నారు. ఇటువంటి గొప్ప రంగాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని ప్రభుత్వం సంకల్పించిందని చెప్పారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా చేనేత రంగాన్ని కేంద్ర స్థాయిలో గుర్తించి, 2015, ఆగష్టు 7వ తేదీన చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం జాతీయ చేనేత దినోత్సవంగా పాటించాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో, ఈ రోజు 11వ జాతీయ చేనేత దినోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించుకుంటున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమాభివృద్ది పథకాలను ప్రజలకు అందిస్తోందన్నారు. పెన్షన్లు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్న క్యాంటీన్లు వంటి పథకాలు ప్రజలకు నేరుగా లాభం చేకూర్చుతున్నాయని వివరించారు. చేనేత మగ్గాల కోసం 200 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా అందించేందుకు నిన్ననే (బుధవారం) కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అలాగే జీఎస్టీ భారం నుంచి చేనేతలను విముక్తం చేయాలని నిర్ణయించి, 5% జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందన్నారు. చేనేత వస్త్రం తయారు చేయడం అంటే అంత సులువైనది కాదని, మీరు మగ్గాలతో ఎంత ఇబ్బంది పడతారో నాకు తెలుసు అన్నారు. ఇంటిల్లపాది ఎంతో కష్టపడితే తప్ప ఒక చీర బయటకు రాదన్నారు. మీకు ఏదైతే హామీ ఇచ్చామో నేడు కూటమి ప్రభుత్వం అవన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు వెళుతున్నామన్నారు.

ఈ సందర్భంగా ఉత్తమ చేనేత కార్మికులను ఘనంగా సన్మానించారు.

తొలుత చేనేత వస్త్రాల తయారీ వివరాలను అడిగి తెలుసుకుని ఇన్చార్జి కలెక్టర్ ఒక చేనేత షర్టును డబ్బులు చెల్లించి కొనుక్కోవడం జరిగింది.

ఈ కార్యక్రమంలో భీమవరం ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా చేనేత, జౌళి శాఖ అధికారి కె.అప్పారావు, భీమవరం మున్సిపల్ కమిషనర్ కే.రామచంద్రారెడ్డి, నేత కార్మికులు, వివిధ శాఖల జిల్లా అధికారులు స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.