• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యులు రోగులకు నమ్మకంతో కూడిన నాణ్యమైన వైద్య సేవలు అందించాలి-జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి .

Publish Date : 22/07/2025

నిర్దేశించిన లక్ష్యాలు సాధించని పీహెచ్సీ వైద్యాధికారులపై కలెక్టర్ ఆగ్రహం.

రోగులకు వైద్య సేవలు అందించడంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు.

ప్రతినెల 3 వేల ఓపి, పది డెలివరీలు ఉండాల్సిందే…

రోగుల నుండి ఎవరైనా సిబ్బంది సొమ్ము డిమాండ్ చేస్తే సస్పెన్షన్ తప్పదు.

జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి మంగళవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖల పని తీరుపై జిల్లాలోని వైద్యాధికారులు, ఏరియా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, పి హెచ్ సి డాక్టర్లు, సూపర్వైజర్లు, సిడిపిఓలు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లతో రోగులకు ప్రభుత్వ ఆసుపత్రులలో అందుతున్న వైద్య సేవలు, ఆసుపత్రుల్లో ప్రసవాలు, మాత -శిశు ఆరోగ్యం, గర్భిణీ స్త్రీలకు అందిస్తున్న పౌష్టికాహారం, మౌలిక సదుపాయాలు, ఆపరేషన్లు, ల్యాబ్ పరీక్షలు తదితర అంశాలపై సమీక్షించారు. సమీక్ష సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.జి.గీతాబాయి, డి సి హెచ్ ఎస్ డా.పి.సూర్యనారాయణ, ఐసిడిఎస్ పిడి డి.లక్ష్మి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ తోలుత పిహెచ్సి ల వారీగా ఎక్కడ లక్ష్యలు, సాధన పై సుదీర్ఘంగా సమీక్షించారు. ప్రతినెల సమీక్షిస్తున్న లక్ష్యసాధనలో కొన్ని పీహెచ్సీలు వెనుకబడటంపై తీవ్ర అసహనాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఇది పేద ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశం అని మీరు అందించే సేవల ద్వారా పేద ప్రజల నమ్మకాన్ని పొందాలని, అప్పుడే వారు మీ వద్దకు వచ్చి వైద్యం చేయించుకుంటారన్నారు. డాక్టర్లు, సిబ్బంది సమయానికి విధులకు హాజరై రోగులకు వైద్య సేవలు అందిస్తే ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలుగుతుందన్నారు. గర్భిణీ స్త్రీలకు కాన్పు జరిగే వరకు అవసరమయ్యే వైద్య పరీక్షలు, పౌష్టికాహారంపై వారికి పూర్తి అవగాహన కల్పించి ప్రత్యేక పర్యవేక్షణ చేయాలన్నారు. ఆస్పత్రులలో ప్రసవాలు పెరిగే విధంగా వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. పీహెచ్సీలో ప్రతినెల పది డెలివరీల లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. గర్భిణీ స్త్రీలు కాన్పులకు ప్రైవేటు ఆసుపత్రుల వెళ్తున్నారని, ఇందుకు గల కారణాలు తెలుసుకోవాలని ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం కలిగేలా వారికి అవగాహన కల్పించాలని అన్నారు. జీరో డెలివరీలు వున్న పీహెచ్సీ లపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎక్కువ డెలివరీలు చేసే ప్రభుత్వ ఆసుపత్రులకు అవార్డులను ప్రకటిస్తామన్నారు. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు డెలివరీ లపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఆసుపత్రిలో కాన్పు జరిగిన తర్వాత తల్లి, బిడ్డ పూర్తి ఆరోగ్యవంతంగా ఉండే విధంగా వైద్య సేవలు, పౌష్టికా అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. నెలలు పూర్తవకుండానే కాన్పు జరిగితే తల్లి, బిడ్డ ఆరోగ్యం పై మరింత దృష్టి పెట్టాలన్నారు. ఏ ఆసుపత్రిలో కూడా వైద్య పరంగా డెత్ జరగకూడదు అన్నారు. జిల్లాలో ఎక్కడ ఒక మలేరియా కేసు కూడా నమోదు కాకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. ఈ వర్షాకాలం సీజన్లో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వైద్య సిబ్బంది ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను సందర్శించి విద్యార్థినీ, విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో అందిస్తున్న సేవలపై ఆసుపత్రి సూపరింటెండెంట్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ఆసుపత్రుల్లో రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఆసుపత్రిలో పారిశుధ్య నిర్వహణ గమనించాలన్నారు. చిన్న, చిన్న సర్జరీలు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగేలా చూడాలన్నారు. రోగులు ప్రైవేట్ ఆసుపత్రులకు కాకుండా ప్రభుత్వ ఆసుపత్రులకు చికిత్స నిమిత్తం వచ్చే విధంగా వారిలో నమ్మకం కలిగేలా వైద్యం అందించాలన్నారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యులు రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించి అన్ని అంశాలలో జిల్లాకు ” ఏ ” గ్రేడ్ వచ్చే విధంగా వైద్యాధికారులు, సిబ్బంది కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లాలోని మెడికల్ ఆఫీసర్లు, వైద్యులు, ఆసుపత్రి సూపరింటెండెంట్లు, సిడిపిఓలు, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు తదితర్లు పాల్గొన్నారు.