18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటును నమోదు చేసుకోండి-జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
జనవరి 1, 2026 నాటికి 18 సంవత్సరాలు నిండే ప్రతి ఒక్కరూ తమ పేర్లను ఓటర్ జాబితాలో నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు.
సోమవారం స్థానిక కలెక్టరేట్ వశిష్ట కాన్ఫరెన్స్ హాల్ నందు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ 2026 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు పూర్తయ్యే ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవచ్చునన్నారు. అదే సమయంలో, మృతి చెందిన వ్యక్తులు, గ్రామం వదిలి శాశ్వతంగా వలస వెళ్లిన వారు, ఒకే వ్యక్తి పేరు రెండు సార్లు నమోదు అయిన వారి పేర్లు ఓటర్ జాబితా నుండి తొలగించబడతాయన్నారు. అలాగే ఓటర్ల పేర్లు, వయస్సు లేదా ఇతర వివరాల్లో పొరపాట్లు జరిగి ఉన్న ఉన్నవారికి ఓటరు సవరణ అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పిస్తుందన్నారు. ఈ పనుల నిర్వహణ కోసం బూత్ లెవెల్ అధికారులను నియమించామన్నారు. ఒక్కో నియోజక వర్గం వారిగా ఒకరిని ఎంపిక చేసి మొత్తం ఏడు నియోజకవర్గాలకు బిఎల్వోలను ఎంపిక చేసి ఢిల్లీలో వారికి తగిన శిక్షణ ఇచ్చారన్నారు. అలాగే జిల్లా స్థాయిలో కూడా శిక్షణను పూర్తి చేయడం జరిగింది అన్నారు. ఓటరు జాబితా, 1200 మంది ఓటర్లు దాటిన పోలింగ్ స్టేషన్ల మార్పులు వంటి అంశాలపై నియోజకవర్గాల వారీగా చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఓటర్ల జాబితాలో ఏవైనా మార్పులు, సవరణలు అవసరమైతే సంబంధిత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారిని సంప్రదించి దరఖాస్తు చేయవచ్చునన్నారు. త్వరలో ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు మేరకు ప్రకటించిన ప్రకటించిన షెడ్యూల్ అనుసరించి ఇంటింటికి వెళ్లి ప్రతి ఓటరు పూర్తి వివరాలు కలిగిన ఎన్యుమరేషన్ ఫారం అందజేసి సమాచారాన్ని పొందడం జరుగుతుందని తెలిపారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ ఎలక్షన్ సెక్షన్ ఇంచార్జి సూపరింటెండెంట్ మర్రాపు సన్యాసిరావు, తెలుగుదేశం పార్టీ తరఫున మరపట్ల శ్యాంబాబు, జనసేన పార్టీ తరఫున జై శివ, బీఎస్పీ పార్టీ తరఫున ఎం.రత్నరాజు, సిపిఎం పార్టీ తరఫున మల్లిపూడి ఆంజనేయులు, ఎం.రామాంజనేయులు పాల్గొన్నారు.