Close

పి జి ఆర్ ఎస్ లో అందిన అర్జీల పరిష్కారంపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి

Publish Date : 21/07/2025

ఫిర్యాదుదారులతో మాట్లాడి నిర్గీత గడువలోపున నాణ్యమైన పరిష్కారం చూపాలి.

పెంచి పోషించిన ప్రయోజకులను చేసిన తల్లిదండ్రులు పట్ల ప్రేమ, అనురాగాలు కలిగి ఉండాలి

వృద్ధులైన తల్లిదండ్రులు నిరాధారణకు గురి చేస్తే చర్యలు తప్పవు..

.. జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి

సోమవారం జిల్లా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో పాటు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, కె.ఆర్.ఆర్.సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణ రెడ్డి, డ్వామా పిడి డా.కెసిహెచ్ అప్పారావు,జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్. వెంకటేశ్వరరావు జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు.

జిల్లా కలెక్టర్ అర్జీలను స్వీకరిస్తున్న సందర్భంలో వృద్ధ మహిళ బండి వెంకట నరసమ్మ సుమారు 90 సంవత్సరాలు.. జిల్లా కలెక్టర్ ను కలిసి నాకు ముగ్గురు కుమారులని ఒక కుమారుడు నా స్థలములో ఇంటి నిర్మించుకొని నన్ను చూడడం లేదని నా ఇల్లు తిరిగి ఇప్పించాలని కోరడం జరిగింది. ఆ వయసులో ఆమె ఎవరు సహాయం లేకుండా జిల్లా కలెక్టర్ కలవడానికి రావడంతో చలించిపోయిన జిల్లా కలెక్టర్ వెంటనే స్టేజ్ దిగి లక్ష్మమ్మ దగ్గరకు వచ్చి ఆప్యాయంగా పలకరించి నీ సమస్యను నేను పరిష్కరిస్తాను ధైర్యంగా ఉండండి, ఎలా వచ్చారు ఏమైనా తిన్నారా ఇలా ప్రశ్నలు వేస్తూ ఆమె చెయ్యి పట్టుకుని బయటకు తీసుకువచ్చి అల్పాహారాన్ని అందించడం అక్కడ ఉన్న అర్జీదారులలో ఒకింత ఆశ్చర్యం మరింత భరోసా కనిపించాయి. బండి వెంకట నరసమ్మ నరసాపురం ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఆమె స్థలంలో వారి కుమారుడు బండి సత్యనారాయణ ఇంటిని నిర్మించుకొని ఈమెని బయటకు పంపించేయడం జరిగిందని వాపోయారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఈ రోజు జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి 260 ఫిర్యాదులను స్వీకరించడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నందున జిల్లా అధికారులు వారి శాఖలకు సంబంధించిన అర్జీలను క్షుణంగా పరిశీలించి తమ సిబ్బందితో నిర్ణీత గడువులోగా త్వరితగతిన, నాణ్యమైన పరిష్కార చర్యలు తీసుకోవాలన్నారు. ఒక్కొక్క సందర్భంలో ఫిర్యాదులు పరిష్కారానికి కొంత సమయం అవసరం ఉన్నప్పుడు సంబంధిత విషయాన్ని ఫిర్యాదుదారులతో అధికారులు మాట్లాడాలన్నారు. ఫిర్యాదులు తమ పరిధిలోనివి కానప్పుడు వెంటనే సంబందిత శాఖకు ఎండార్స్ చేసి పంపాలని ఆదేశించారు. వృద్ధులైన తల్లిదండ్రులను ఎవరైనా ఇబ్బంది పడితే నిబంధనల ప్రకారం తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆస్తులు రాయించుకుని బయటికి పంపించిన రాసిన ఆస్తులు చెల్లవని, తిరిగి వాళ్లు పొందే హక్కును న్యాయస్థానం ఇటీవల ఉత్తరం ద్వారా కల్పించడం జరిగిందన్నారు. మిమ్మల్ని ప్రయోజకులను చేసిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ప్రేమ, అనురాగంతో చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందన్నారు. ఈరోజు మీరు ఒకనాటికి వృద్ధ తల్లిదండ్రులే అవుతారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. జిల్లా అధికారులు మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించి ఫిర్యాదుల పరిష్కారంపై సమీక్షించాలన్నారు.

ఈరోజు పీజీఆర్ఎస్ కి అందని దరఖాస్తులలో కొన్ని ఈ విధంగా ఉన్నాయి.

@ . కాళ్ళ మండలం, సీసలి గ్రామానికి చెందిన చిలువూరి సూర్యనారాయణ రాజు అర్జీ సమర్పిస్తూ, తనకు 11.07 సెంట్లు, నా భార్య పేరున 2.50 సెంట్ల భూమి ఉందని 20 సంవత్సరాల క్రితం ఆ భూమి కొనుగోలు సాగు చేసుకుంటున్నాం అన్నారు. ఆ భూమి 22ఎ జాబితాలో ఉన్నట్టు చూపిస్తున్నదని దయచేసి ఆ భూమిని 22 ఎ జాబితా నుండి తొలగించాలని కోరారు.

@. గణపవరం మండలం అర్థవరం గ్రామానికి చెందిన సకలాబత్తుల వెంకటేష్ అర్జీని సమర్పిస్తూ, నా కుమారుడు కేశవరంలో 1వ తరగతి చదువుతున్నాడని ఇటీవల విడుదల చేసిన తల్లికి వందనం సొమ్ము బ్యాంక్ అకౌంట్లో జమ కాలేదని, దయచేసి తల్లికి వందనం సొమ్మును ఇప్పించాలని కోరారు.

@. తాడేరు గ్రామానికి చెందిన గంధం పద్మావతి అర్జీని సమర్పిస్తూ, బేతపూడి గ్రామ రెవెన్యూ రికార్డులో నా ఆధార్ నెంబరు తప్పుగా నమోదయిందని, అందువల్ల రైస్ కార్డులో నన్ను సభ్యునిగా చేర్చలేదని దయచేసి బేతపూడి గ్రామ రెవెన్యూ రికార్డులో ఆధార్ నెంబరు సవరణ చేసి రైస్ కార్డులో సభ్యత్వం అంగీకరించాలని కోరారు.

@. అత్తిలి మండలం, ఆరవల్లి గ్రామానికి చెందిన పి.తులసీ రత్నం అర్జీ సమర్పిస్తూ, నా పేరున మూడు ఎలక్ట్రికల్ మీటర్లు చూపిస్తున్న కారణంగా ఏ ప్రభుత్వ పథకానికి అర్హత లేదని అధికారులు అంటున్నారన్నారు. తన ఇద్దరు పిల్లలకు తల్లికి వందనం సొమ్ము జమ కాలేదు అన్నారు. దయచేసి నా పేరును ఉన్న ఎలక్ట్రికల్ మీటర్లను తొలగించాల్సిందిగా కోరారు.

@. వీరవాసరం మండలం, కొణితవాడ గ్రామానికి చెందిన చల్లబోయిన రాముడు తాను వికలాంగుడనని, ఇంత వరకు తనకు రేషన్ కార్డు మంజూరు కాలేదని, రేషన్ కార్డు మంజూరు చేస్తే, వికలాంగ పింఛనకు కొరకు దరఖాస్తు చేసుకుంటానని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, వయోవృద్ధుల ట్రిపునల్ సభ్యులు మేళం దుర్గాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

2.11    2.22