పశ్చిమగోదావరి జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా ప్రత్యేక అధికారి మరియు మహిళలు, పిల్లలు, వికలాంగులు & సీనియర్ సిటిజన్ల శాఖ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఎ.సూర్య కుమారి పిలుపునిచ్చారు.
ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర – స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా ప్రత్యేక అధికారి ఏ.సూర్యకుమారి, జిల్లా కలెక్టర్ శ్రీమతి చదలవాడ నాగరాణి తణుకు మాంటిసోరి హై స్కూల్, జూనియర్ కాలేజ్ ల నందు ఏర్పాటుచేసిన ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతమొందిద్దాం” అనే కార్యక్రమంలో పాల్గొని, సైన్స్ స్క్వేర్ ప్రదర్శనను తిలకించి, విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. తొలుత జిల్లా ప్రత్యేక అధికారి విద్యార్థులతో మాట్లాడుతూ మీరు లంచ్ బాక్స్, వాటర్ బాటిల్ ప్లాస్టిక్ వి వాడుతున్నారా లేదా ప్రత్యామ్నాయ వస్తువులు వాడుతున్నారా అని విద్యార్థులను ప్రశ్నించారు. రేపటినుండి ప్రతి ఒక్కరు స్టీల్ లంచ్ బాక్స్, స్టీల్ వాటర్ బాటిల్స్ ను తప్పక వినియోగించాలని పిల్లలచే ప్రమాణం చేయించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రత్యేక అధికారి ఏ.సూర్యకుమారి మాట్లాడుతూ మానవాళి మనుగడకు ప్లాస్టిక్ ను నిర్మూలించడం ఎంతో ముఖ్యం అన్నారు. ప్రధానంగా సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ను వాడడం ఆపి జూట్ బ్యాగులను వినియోగించాలన్నారు. ప్రతి ఒక్కరూ షాపింగ్ కు వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ కవర్ల బదులు జూట్ బ్యాగ్ లను వాడాలన్నారు.
జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్లాస్టిక్ కారణంగా పెద్ద ఎత్తున వాతావరణ కాలుష్యం జరుగుతుందన్నారు. తోపుడు బండ్ల వ్యాపారులు మొదలు పెద్ద పెద్ద షాపులు, సూపర్ మార్కెట్లు. మొదలైన వ్యాపారులు ప్లాస్టిక్ కు బదులు జూట్ బ్యాగులు, క్లోత్ బ్యాగులను వినియోగదారులకు ఇవ్వాలన్నారు. ప్లాస్టిక్ నిర్మూలన – జూట్ బ్యాగులు, స్టీల్ వాటర్ బాటిల్స్ వినియోగంపై ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో ప్రజల భాగస్వామ్యం అవసరం అన్నారు. అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు ప్లాస్టిక్ నిర్మూలన – జూట్ బ్యాగుల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అంతకు ముందు స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా “స్వచ్ఛత, ప్లాస్టిక్ నిర్మూలనపై నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞను విద్యార్థులతో చేయించారు. చివరిగా ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాలపై ప్రదర్శనలో విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టి.రామ్ కుమార్, తహసిల్దార్ డి.వి.ఎస్.ఎస్ అశోక్ వర్మ, ఐసిడిఎస్ పిడి డి.శ్రీలక్ష్మీ, ఎంపీడీవో లోహిత్ సాగర్, పాఠశాల హెచ్ఎం ఎస్.లక్ష్మి, ప్రిన్సిపాల్ ఏ.జ్ఞాన మంజరి, డైరెక్టర్ అనపర్తి ప్రకాశరావు, స్థానిక నాయకులు పరిమి వెంకన్న బాబు, బసవ రామకృష్ణ, మంతిరావు బాబు, విద్యార్థులు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.