పి జి ఆర్ ఎస్ లో అందిన అర్జీల పరిష్కారంపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి.
అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఫిర్యాదుదారులతో మాట్లాడి నాణ్యమైన పరిష్కారం చూపాలి.
.. జిల్లా జాయింట్ కలెక్టర్ టీ. రాహుల్ కుమార్ రెడ్డి
సోమవారం జిల్లా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి తోపాటు డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, పిజిఆర్ఎస్ నోడల్ అధికారి వై.దోసి రెడ్డి, కె.ఆర్.ఆర్.సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణ రెడ్డి, డ్వామా పిడి డా.కెసిహెచ్ అప్పారావు, జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి 235 ఫిర్యాదులను స్వీకరించడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నందున జిల్లా అధికారులు వారి శాఖలకు సంబంధించిన అర్జీలను క్షుణంగా పరిశీలించి తమ సిబ్బందితో నిర్ణీత గడువులోగా త్వరితగతిన, నాణ్యమైన పరిష్కార చర్యలు తీసుకోవాలన్నారు. ఫిర్యాదులు తమ పరిధిలోనివి కానప్పుడు వెంటనే సంబందిత శాఖకు ఎండార్స్ చేసి పంపాలని ఆదేశించారు. జిల్లా అధికారులు మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించి ఫిర్యాదుల పరిష్కారంపై సమీక్షించాలన్నారు.
@ . నర్సాపురం మండలం యర్రంశెట్టి పాలెం గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ కూనపురెడ్డి రెడ్డివీర వెంకట విజయ రంగారావు అర్జీని సమర్పిస్తూ, మొగల్తూరు మండలం రామన్నపాలెం పంచాయతీలో 2.20 సెంట్లు ఉందని నరసాపురం సబ్ కలెక్టర్ గారు ప్రొసీడింగ్ ఆర్డర్ ఇచ్చారని, ఆ స్థలం ల్యాండ్ కన్వర్షన్ నందు చూపించడం లేదని, పలు పర్యాయాలు అధికారులకు విన్నవించిన సమస్య పరిష్కారం కాలేదన్నారు. దయచేసి ల్యాండ్ కన్వర్షన్ అడంగల్ లో చేర్చి న్యాయం చేయాలని కోరారు.
@. పాలకోడేరు మండలం పాలకోడేరుకు చెందిన తొంట రాజమణి అర్జీ సమర్పిస్తూ, తాను తల్లికి వందనం పథకానికి అర్హురాలునని, ఇప్పటివరకు బ్యాంకు ఖాతాలో సొమ్ము జమ కాలేదన్నారు. పాఠశాలలో అడిగితే ఉచిత సీటులో ఉందని అంటున్నారు. మా పాప భాష్యం లిటిల్ ఛాంప్స్ ఛాన్స్ పాఠశాలలో చదువుకుంటున్నదని ఉచిత సీటులో లేదని, దయచేసి సమస్యను పరిష్కరించాలని కోరారు.
@. పెనుగొండ మండలం పితానివారిపాలెం గ్రామానికి చెందిన యాండ్ర మోహన్ రావు అర్జీని సమర్పిస్తూ, అనారోగ్య కారణంగా నాకు ఒక కాలు తొలగించారని, సదరం స్లాట్ తీసుకొని సర్టిఫికెట్ తీసుకున్నానన్నారు. తదుపరి తన రెండో కాలు కూడా తొలగించారన్నారు. ప్రస్తుతం ఆరువేల రూపాయల పెన్షన్ తీసుకుంటున్నానని, సదరు వైకల్యమును సదరం సర్టిఫికెట్ తీసుకొనుటకు తిరిగి మరలా స్లాట్ అడగట్లేదని దయచేసి సదరం స్లాట్ రిజిస్టర్ చేయవలసిందిగా కోరుచున్నారు.
@. ఆచంట మండలం ఆచంట గ్రామానికి చెందిన కె.సాల్మన్ రాజు అర్జీ సమర్పిస్తూ తనకు 27 సెంట్లు భూమి ఉందని, సదరు భూమికి సంబంధించిన పాస్ బుక్ కూడా ఉందన్నారు. ఇటీవల సర్వేలో 25 సెంట్లు భూమి మాత్రమే వస్తున్నదని, మిగిలిన రెండు సెంట్లు భూమి కనిపించడం లేదని, దయచేసి సర్వే చేసి తగ్గిన రెండు సెంట్లు భూమిని అప్పగించవలసిందిగా కోరుతున్నారు.
@. ఆచంట గ్రామానికి చెందిన సాధే కిషోర్ అర్జీని సమర్పిస్తూ తన కుమారుడు ఉదయ్ తేజ్ 6వ తరగతి చదవవలసి ఉందని, తాము కూలి పని చేసుకుంటూ జీవనోపాధి జరుపుకుంటున్నామని, కావున తన కుమారుడను డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల. ఎల్ బి చర్ల నర్సాపురం నందు చదువుకొనుటకు అనుమతి మంజూరు చేయాలని కోరారు.
@. పాలకొల్లు మండలం పాలకొల్లు 13వ వార్డుకు చెందిన వానపల్లి జె.జి రామ్ సిద్ధార్థ మానసిక వికలాంగ పింఛను మంజూరు చేయాలని దరఖాస్తు సమర్పించారు.
. ఈ సమావేశంలో డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, కె.ఆర్.ఆర్.సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణ రెడ్డి, పిజిఆర్ఎస్ నోడల్ అధికారి వై.దోసి రెడ్డి, డ్వామా పిడి డా.కెసిహెచ్ అప్పారావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, వయోవృద్ధుల ట్రిపునల్ సభ్యులు మేళం దుర్గాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.