ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ – రాష్ట్ర వార్షిక సర్వసభ్య సమావేశంలో పశ్చిమ గోదావరి జిల్లాకు “ఉత్తమ జిల్లా అవార్డు”
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ వార్షిక సర్వసభ్య సమావేశం 2025 జూలై 9న తుమ్మలపల్లి కళాక్షేత్రం, విజయవాడలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మరియు రాష్ట్ర రెడ్ క్రాస్ అధ్యక్షులు శ్రీ ఎస్.అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై 2022–2023 సంవత్సరానికి ఉత్తమ సేవలందించిన జిల్లాలకు మరియు అధికారులకు అవార్డులు అందజేశారు.
ఈ సందర్భంలో పశ్చిమ గోదావరి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ 2022–2023 సంవత్సరానికి “ఉత్తమ జిల్లా అవార్డు” అందుకోవడం జరిగింది. జిల్లా పునర్వ్యవస్థీకరణ తరువాత మొదటి సంవత్సరంలోనే ఈ గౌరవాన్ని అందుకోవడం విశేషం. ఈ అవార్డును జిల్లా చైర్మన్ డా.భద్రిరాజు ఎం.ఎస్.వి.ఎస్ రాష్ట్ర గవర్నర్ చేతులు మీదుగా ఈ రోజు అందుకోవడం జరిగింది.
అదనంగా, రెడ్ క్రాస్ నిధుల సేకరణలో విశేష కృషి చేసిన ముగ్గురు జిల్లా అధికారులను రాష్ట్ర గవర్నర్ ప్రత్యేకంగా మెడల్స్‌తో సత్కరించారు.
వీరిలో జిల్లా వ్యవసాయ అధికారి జెడ్. వెంకటేశ్వరరావు, డిఆర్‌డిఎ, ప్రాజెక్టు డైరెక్టర్ ఎం.ఎస్.ఎస్. వేణుగోపాల్, రిటైర్డ్ జిల్లా విద్యా అధికారి ఆర్.వి. రమణ వున్నారు. ఈ ముగ్గురు అధికారులు ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే రూ.5 లక్షలకుపైగా నిధులను రెడ్ క్రాస్ సేవల కోసం సమకూర్చారు.
పశ్చిమ గోదావరి రెడ్ క్రాస్ ఈ ఏడాది పలు ప్రతిష్టాత్మక అవార్డులు అందుకుంది.
2025 మే లో ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా, మానవతా సేవల్లో విశిష్ట పాత్ర పోషించినందుకు జిల్లా కలెక్టర్ శ్రీమతి సి. నాగరాణి గవర్నర్ గోల్డ్ మెడల్ లభించింది.
2025 జూన్‌లో తణుకు బ్లడ్ సెంటర్‌కు “ఉత్తమ బ్లడ్ సెంటర్ అవార్డు” లభించింది.
తాజాగా *“ఉత్తమ జిల్లా అవార్డు” ను కూడా అందుకోవడం జిల్లాకు మరో గర్వకారణం.
ఈ అవార్డులు పశ్చిమ గోదావరి జిల్లాలో రెడ్ క్రాస్ మానవతా కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు స్ఫూర్తినిస్తాయి మరియు సంస్థ లక్ష్యాలకు అనుగుణంగా సేవలను కొనసాగించేందుకు మరింత బాధ్యతను కల్పిస్తున్నాయి.
జిల్లా కలెక్టర్ మరియు రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షురాలు సి. నాగరాణి జిల్లా రెడ్ క్రాస్ టీంను అభినందించి, అవార్డు పొందిన అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. జాయింట్ కలెక్టర్ మరియు రెడ్ క్రాస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ టి.రాహుల్ కుమార్ రెడ్డి కూడా అభినందనలు తెలియజేస్తూ, జిల్లాలో జూనియర్ మరియు యువ రెడ్ క్రాస్ కార్యకలాపాలను మరింత విస్తరించాలని పిలుపునిచ్చారు.