ఘనంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి మహోత్సవం

అల్లూరి స్ఫూర్తిదాయక జీవితం అందరికీ ఆదర్శం
వారి స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలి
అల్లూరి స్ఫూర్తితో యువత దేశాభివృద్ధికి పాటుపడాలి..
* రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ
* శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజ్
* జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
* భీమవరం శాసనసభ్యులు, పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు.
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిదాయక జీవితం అందరికి ఆదర్శమని, వారి త్యాగాలను తప్పక స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ అన్నారు.
శుక్రవారం భీమవరం అల్లూరి స్మృతి వనం 30 అడుగుల కాంస్య విగ్రహం వద్ద, అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం వద్ద మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు 128వ జయంతి మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. శ్రీ అల్లూరి సీతారామరాజు సేవాసమితి అధ్యక్షులు గాదిరాజు సుబ్బరాజు, ఇతర సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజ్, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, భీమవరం శాసనసభ్యులు, పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు. మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ మాట్లాడుతూ
స్వాతంత్రోద్యమ సమయంలో జరిగినటువంటి అనేక పోరాటాలకు సంబంధించి స్మరించుకునే వారిలో అల్లూరి మొదటి వరుసలో ఉంటారన్నారు. ఒక మహనీయుడు అది మన ప్రాంతానికి చెందిన ప్రపంచ ఖ్యాతిని గడిచినటువంటి అల్లూరి సీతారామరాజు యొక్క ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుకునే సభలో మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటునన్నారు. అమృత కాల్ అనేటటువంటి భారత ప్రభుత్వ నిర్ణయంలో అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందే దేశంగా పరిణామ ప్రక్రియలో భాగంగా భారతదేశము యొక్క చరిత్రను కూడా ప్రపంచానికి పరిచయం చేసేటటువంటి సందర్భంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఒక నిర్ణయం సమాజానికి తెలియనటువంటి అనేకమంది స్వాతంత్ర సమరయోధుల యొక్క చరిత్రను సమాజంతో పాటు ప్రపంచానికి పరిచయం చేసేటటువంటి సందర్భంలో అల్లూరి సీతారామరాజు యొక్క విగ్రహ ఆవిష్కరణ ప్రధాని నరేంద్ర మోడీ చేతులమీదుగా ఇటీవల మన భీమవరంలో ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. దీనికి ప్రధాన కారణం చరిత్రలో అనేకమంది స్వాతంత్ర సమరయోధుల యొక్క వాస్తవ చరిత్ర చాలా మందికి తెలియనటువంటి పరిస్థితి అన్నారు. సంవత్సరాల క్రితమే సమాజానికి దూరంగా ఉన్నటువంటి భౌగోళిక వివక్షతకు గురైనటువంటి కోయ, చెంచు, బిల్లు వంటి జాతులుయొక్క సంస్కరణతో పాటు, వారిని సమాజం వైపు మళ్లించేటటువంటి యోచన చేశాడంటే అతను యొక్క ఆలోచన ఎంత గొప్పదో అని కొనియాడారు. చాలా కాలం తర్వాత 1999 అటల్ బిహారి వాజ్ పేయి ప్రధానమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం షెడ్యూల్ ట్రైబ్స్ కి ఒక మినిస్ట్రీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భీమవరంలో ప్రధాని నరేంద్ర మోడీ విగ్రహావిష్కరణ ద్వారా ప్రపంచ స్థాయిలో ఆరోజు భారతదేశంలో మరొక గొప్ప నాయకుడుని పరిచయం చేసిన పరిస్థితిని కలిగిందన్నారు.
శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజ్ మాట్లాడుతూ అల్లూరి మనందరికి ఒక ఆదర్శంగా ఉండటం, అలాగే ఆయన యొక్క భావాన్ని మన ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది క్షత్రియులు కలిగి ఉండడంతో ఈ సమాజానికి సేవ చేయాలనే ఆలోచన అందరికీ ఉందన్నారు. ముఖ్యంగా భీమవరం అభివృద్ధిలో, ఈ జిల్లా అభివృద్ధిలో క్షత్రియుల యొక్క పాత్ర మరి చాలా ముఖ్యమైనదన్నారు. కొంతమంది మనుషులు ఈ సమాజంలో పుట్టి మరణించినప్పటికీ కూడా బతికి ఉంటారని దానికి అల్లూరి సీతారామరాజు నిదర్శనం అన్నారు. ఇటువంటి మహానుభావుల ఆదర్శాలను మన సమాజం, మరి ముఖ్యంగా యువత స్ఫూర్తి పొందాలన్నారు. అల్లూరి ట్రైబల్స్ కోసం పనిచేశారని, ఆయా వర్గాల కోసం సమితి ఆ యొక్క పిల్లల చదువు కోసం ప్రత్యేకంగా కృషి చేయాలన్నారు.
జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జీవితం ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు. 1897 జూలై 4న జన్మించిన అల్లూరి, కేవలం 27 ఏళ్ళ వయసులోనే చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొని వీర మరణం పొందిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. మన్యం ప్రాంతంలోని గిరిజనుల బాధలను దగ్గరగా గమనించి, తెల్లదొరల దమన రాజకీయానికి వ్యతిరేకంగా గళమెత్తిన అల్లూరి సీతారామ రాజు, ప్రజల్లో చైతన్యం నింపి, వారికి ధైర్యసాహసాలను కలిగించి పోరాట మార్గాలు నేర్పించారన్నారు. భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి అన్నారు. వీరు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయమన్నారు. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు అని తెలిపారు. ఆయన త్యాగం భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో ఒక చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోయిందన్నారు. ధ్యానం, దైవభక్తి, ధైర్యసాహసాల సమ్మేళనమైన అల్లూరి జీవితచరిత్ర యువతకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని, ఆయన ఆశయాలు, చూపిన మార్గం నేటి తరాలందరికీ మార్గదర్శకంగా ఉండాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
భీమవరం శాసనసభ్యులు మరియు పిఎసి చైర్మన్ పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ విప్లవ జ్యోతి అల్లూరి పోరాటపటిమ ఎన్నటికీ మరువలేనిదన్నారు. పిన్న వయసులోనే ప్రాణత్యాగం చేసిన గొప్ప వ్యక్తి అని, వారి పోరాట పటిమతో బ్రిటిష్ వారిని గడగడలాడించారన్నారు. ధైర్య సాహసాలు, దేశభక్తితో వారి ప్రాణాలను తృణప్రాయంగా ఇచ్చారన్నారు.
కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, తదితరులు అల్లూరి స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని కొనియాడారు.
అంతకుముందు శ్రీ అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి రాజ్యసభ సభ్యులు, శాసనమండలి చైర్మన్, కలెక్టర్, భీమవరం శాసనసభ్యులు, ఎస్పీ, కాపు కార్పొరేషన్ చైర్మన్, జాయింట్ కలెక్టర్, సమితి అధ్యక్షులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది.
అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కె.రాహుల్ కుమార్ రెడ్డి ,డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, అడిషనల్ ఎస్పీ వి.భీమారావు, భీమవరం ఆర్టీవో కే ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కే రామచంద్రారెడ్డి, తహసిల్దార్ రవి రాంబాబు, ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, అల్లూరి సీతారామరాజు సేవాసమితి అధ్యక్షులు గాదిరాజు సుబ్బరాజు, ఉపాధ్యక్షులు ఉద్దరాజు వేణుగోపాల్ రాజు, ఝాన్సీ, కార్యదర్శి సిహెచ్ సుబ్రహ్మణ్యం రాజు, సభ్యులు వేగేశ్న రమణ రాజు, చిక్కూరి భీమరాజు, ఎమ్ ఎస్ ఎన్ రాజు, సంఘ సేవకులు చెరుకూరి రంగసాయి, కంతేటి వెంకటరాజు, వివిధ శాఖల జిల్లా అధికారులు, పాఠశాలల విద్యార్థులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.