Close

దయచేసి డబ్బులు కోసం వైద్యం చేయవద్దు, జబ్బును తగ్గించడానికి మాత్రమే వైద్యం చేయాలని విజ్ఞప్తి..

Publish Date : 13/06/2025

జిల్లాలో ఎన్టీఆర్ వైద్య సేవ చికిత్సలకు డబ్బులు వసూలు చేసిన హాస్పిటల్స్ యాజమాన్యాలపై జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం..

పేదల వైద్యానికి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయి..

లేని జబ్బును ఉన్నట్టుగా చూపించి వైద్యం చేయడంతో ఎన్నో ప్రాణాలు పోతున్నాయని, కొంతమంది జీవచ్ఛవంలా బతుకుతున్నారని ఆ కుటుంబాల బాధను ఎవరు తీర్చగలరని గట్టిగా ప్రశ్నించారు?

ప్రభుత్వ ఉచిత సేవలకు నగదును వసూలు చేసిన ఎంతటి ఆసుపత్రి నైనా ఉపేక్షించేది లేదు…

చికిత్స పేరుతో వసూలు చేసిన మొత్తానికి రెట్టింపు అపరాధ రుసుం వసూలుకు ఆదేశాలు..

మూడవ హెచ్చరికతో ఎన్టీఆర్ వైద్య సేవ గుర్తింపు రద్దుకు సిఫార్సు..

ఎన్టీఆర్ వైద్య సేవ ఉచిత చికిత్సలకు ఏ హాస్పిటల్ అయినా డబ్బులు వసూలు చేస్తే పెద్ద మొత్తంలో అపరాధ రుసుముతో పాటు, తీవ్రమైన కఠిన చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గట్టిగా హెచ్చరించారు.

శుక్రవారం భీమవరం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరము నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన నిర్వహించిన డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సేవలకు డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై 17 హాస్పిటల్స్ కు సంబంధించి వచ్చిన ఫిర్యాదులను విచారించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదల కోసం చేస్తున్న వైద్య సహాయాన్ని తూట్లు పొడిచే విధంగా కొన్ని హాస్పిటల్స్ డబ్బులు వసూలు చేయడంపై సంబంధిత హాస్పిటల్స్ యాజమాన్యాలపై కలెక్టర్ తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఇటువంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని తీవ్ర హెచ్చరికలను చేశారు. లేని జబ్బులను ఉన్నట్టుగా చూపించి వైద్యం చేయడమేనా మీ పని తీవ్ర స్వరంతో గర్హించారు. పేదల ప్రాణాలతో చెలగాటమాడుతారా అని ప్రశ్నించారు. ఏ చిన్న పొరపాటు జరిగిన ఎంతటి హాస్పటల్ నైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. పుట్టిన పిల్లలకు కామెర్లు లేకుండానే, కామెర్ల పేరిట ఫోటో థెరపీ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని, ప్రైవేట్ హాస్పిటల్స్ లో పుట్టిన ప్రతిబిడ్డ రక్త నమూనాలను సేకరించి పరీక్షించడం జరుగుతుందని, ఫోటో థెరపీ అవసరం లేకుండానే చికిత్స చేసినట్లు తెలిస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయన్నారు. ప్రజలు కూడా అవగాహన కలిగి ఉండాలని, ఆలోచన ధోరణిలో మార్పు రావాలని ప్రభుత్వ ఆసుపత్రిలలో మెరుగైన వసతులతో కూడిన ప్రసూతి సేవలను ఉచితంగా అందిస్తున్నారని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఒక ఆసుపత్రి డెంగ్యూ లేకుండానే డెంగ్యూ పేరిట వైద్యంచేసి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో డి ఎం & హెచ్ ఓ ఆదేశాల మేరకు సంబంధిత రోగుల నుండి శాంపిల్స్ కలెక్షన్ చేయడం, డెంగ్యూ అనేది వాస్తవం కాదని స్పష్టం కావడంతో ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందనీ సంబంధిత హాస్పిటల్ డాక్టర్ ని గట్టిగా నిలదీశారు. ఒకవేళ డెంగ్యూ పాజిటివ్ వస్తే మీరు ప్రభుత్వ ఆసుపత్రికి తెలియజేయాలి కదా, ఇది ఎంత ప్రమాదకరమైన విషయమో మీకు తెలియదా, తెలియజేయకపోవడంతోనే మీ ఉద్దేశ్యం ఏమిటో స్పష్టంగా అర్థమవుతుందని తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. డెంగ్యూ అనేది ఎంత ప్రమాదకరమో మీకు డాక్టర్ గా తెలియదా? దీని ప్రభావం ప్రజల మీద ఉంటుందా లేదా ఇటువంటి ప్రశ్నలతో తీవ్రంగా మందలించారు. డెంగ్యూ పేరిట వసూలు చేసిన మొత్తానికి మూడు రెట్లు కలిపి అపరాధ రుసుముగా వసూలు చేయాలని ఆదేశించారు. అదే ఆసుపత్రి ఇంకొక కేసు కేసు విషయంలో రూ.80 వేలు వసూలు చేసినందుకు దానికి రెట్టింపు కలిపి అపరాధ రుసుముగా వసూలు చేయాలని ఆదేశించారు. స్మైల్ డెంటల్ హాస్పిటల్ అండ్ ఫేషియల్ సర్జరీ సెంటర్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద చికిత్స చేయకుండానే చికిత్స చేసినట్లు బిల్లు క్లైమ్ చేశారు అనే అభియోగంలో వాస్తవం లేదని ధ్రువీకరించారు. తప్పుడు పిర్యాదులు చేసిన కూడా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పిర్యాదుదారుని ఆరోపణలో వాస్తఅవాస్తవాలను పూర్తిగా తెలుసుకుని, ఆధారాలతో వార్తలు వ్రాయాలని సున్నితంగా తెలియజేశారు. ఏ విధమైన ఆరోపణలు మీ దృష్టికి వచ్చిన ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు జిల్లా కోఆర్డినేటర్ తో ధృవీకరించుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. ప్రైవేట్ హాస్పిటల్స్ కు పేదవారు ఎంతో నమ్మకంతో అప్పు చేసి ఆర్థికంగా చితుకుపోతూ వైద్యానికి వస్తున్నారని, వారి బలహీనతను ఆసరాగా చేసుకుని వైద్యం పేరిటి అప్పులు పాలు చేయవద్దని, వారికి ఉన్న జబ్బుకు మాత్రమే వైద్యం చేసి పంపాలని అన్నారు.

ఈ సమావేశంలో డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ జి గీతా బాయి, డి సి హెచ్ ఎస్ డాక్టర్ పి సూర్యనారాయణ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ కీర్తి శ్రవణ్, వర్మ హాస్పిటల్, తణుకు యాపిల్ హాస్పిటల్, రాజర్షి హాస్పిటల్, ఆర్కే గాయత్రి హాస్పిటల్, సూరి తేజ ఆర్థోపెడిక్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, యూనియన్ హాస్పిటల్స్ ఆఫ్ రామలక్ష్మి హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ సూర్య నర్సింగ్ హోమ్, స్టార్ హాస్పిటల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్, తేజ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కు సంబంధించిన డాక్టర్లు, వారి ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.