భారతీయ వారసత్వ సంపద యోగాభ్యాసంతో మానసిక వికాసం, ఆరోగ్య జీవన విధానం సొంతమవుతుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
యోగాంధ్ర – 2025లో భాగంగా పర్యాటక ప్రాంతంలో యోగా పేరిట సోమవారం భీమవరం అల్లూరి సీతారామరాజు స్మృతి వనం నందు ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, పట్టణ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ క్రీడాకారిణి మరియు యోగ మాస్టర్ ట్రైనర్ బి.శిరీష యోగా విశిష్టతను వివరిస్తూ చెప్పిన యోగాసనాలు అభ్యసన కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య ఆంధ్ర సాకారం దిశగా వడివడిగా అడుగులేస్తూ ఆరోగ్య భద్రతకు చర్యలు తీసుకుంటోందన్నారు. భారతీయ వారసత్వ సంపద అయిన యోగ విశిష్టత ను గుర్తించి ఐక్యరాజ్య సమితి 2014 జూన్ 21న అంతర్జాతీయ యోగ దినోత్సవంగా ప్రకటించగా అప్పటి నుండి అంతర్జాతీయ యోగ దినోత్సవాలను జరుపుకున్నామన్నారు. జూన్ 21 న జరిగే అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని వైజాగ్ లో జరిగే యోగ కార్యక్రమంలో ప్రధాన మంత్రి పాల్గొననున్న నేపథ్యంలో ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది ప్రజలు భాగస్వాములు కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు నివ్వడం జరిగిందన్నారు. దీనిలో భాగంగానే గత నెల 21వ తేదీ నుంచి నెల రోజుల పాటు యోగాంధ్ర క్యాంపెయిన్ ను రాష్ట వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములు చేసేందుకు పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు యోగ శిక్షణ కార్యక్రమాలు, కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో కూడా యోగ రోడ్డు ను ఏర్పాటు చేసి ప్రతి రోజూ యోగ సాధన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి వర్గాన్ని యోగాంధ్రలో భాగంచేసే లక్ష్యంతోనే థీమ్ యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి గ్రామం, పట్టణాల్లో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇదే విధంగా పర్యాటక ప్రాంతాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు, యోగా ఔన్నత్యాన్ని చాటిచెప్పేందుకు జిల్లాలో ఇప్పటికే వశిష్ట గోదావరి వలందలరేవు, పెనుగొండ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ప్రాంగణం పర్యాటక ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించామని, ఈ రోజున సుమారు రెండు వేల మందితో అల్లూరి సీతారామరాజు స్మృతి వనం వద్ద యోగ కార్యక్రమాన్ని జరుపుకోవడం . ఈ నెల 16వ తేదీన పేరుపాలెం బీచ్ లో ప్రత్యేక యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వివరించారు. 19వ తేదీన భీమవరం పట్టణం నందు సుమారు ఐదు వేల మంది స్పోర్ట్స్ పర్సన్స్, అథ్లెటిక్స్ తో ప్రత్యేక యోగ కార్యక్రమాన్ని జరుపుకోనున్నట్లు తెలిపారు. జిల్లాలో కనీసం పది లక్షల మందిని యోగాసనాల కార్యక్రమంలో భాగస్వాములు చేసే లక్ష్యంతో గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ప్రత్యేక యోగా ట్రైనర్లతో పెద్దఎత్తున యోగాసనాల శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ తన దైనందిన జీవితంలో యోగ ను భాగంగా చేసుకుని 45 నిమిషాల పాటు యోగాను రోజూ ఆచరించినట్లైతే జీవితాంతం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండొచ్చన్నారు.
యోగ అభ్యసనాలు అనంతరం అల్లూరి సీతారామరాజు విగ్రహం నుండి అడ్డ వంతెన వరకు యోగ అవగాహన ర్యాలీని నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, ఆర్డిఓ కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి మునిసిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, ఏఎస్ఆర్ సాంస్కృతిక కేంద్రం అధ్యక్షులు గాదిరాజు సుబ్బరాజు, ఆయుష్ శాఖ అధికారి డాక్టర్ హరి శ్రీనివాస్, యోగ సాధకులు యు.వెంకటేశ్వరరాజు, పి.భవాని, పి.రోహిణి, ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
