అభివృద్ధి అంటే ఉండి నియోజకవర్గం.. ఉండి అంటే అభివృద్ధి చెందుతున్న రైతు అనే విధంగా నియోజకవర్గం రాష్ట్రానికే ఆదర్శంగా ఉండాలని, ఆ విధంగానే ప్రతి ఒక్కరూ పని చేయాలని శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణంరాజు అన్నారు
ఆదివారం మండల కేంద్రమైన పాలకోడేరులో రైతులకు సబ్సిడీ కిసాన్ డ్రోన్స్ పంపిణీ కార్యక్రమాన్ని వ్యవసాయాధికారుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మఖ్యఅతిథిగా విచ్చేసిన కనుమూరు రఘురాకృష్ణం రాజు డ్రోన్ పరిశీలించి మాట్లాడారు. ప్రస్తుత రోజుల్లో పంట పొలాల్లో పనిచేయడానికే మనుషులు కరువవుతున్నారని, ఇటువంటి తరుణంలో ఈ యాంత్రీకరణ వస్తువులు రైతుతోపాటు ఆ యాంత్రాలను తయారు చేసే వారికి కూడా ఎంతో లాభసాటిగా ఉంటుందన్నారు. రైతులు కూడా పరిస్థితులకు అనుగుణంగా పంట సాగు చేయాలన్నారు. దీనిలో భాగంగా వచ్చే రబీ సాగులో దుడ్డు బియ్యం కాకుండా. సన్నబియ్యం పండించడానికి ప్రతి ఒక్కరూ సిద్ధపడాలన్నారు. సన్నబియ్యం పండించడం ద్వారా వ్యవసాయం లాభసాటిగా ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా మేలు చేసేందుకే 80 శాతం రాయితీతో ఈ డ్రోన్ లను అందించడం జరిగిందని, రైతులు దీనిని పూర్తి స్థాయిలో సద్విని యోగపరచుకుని వ్యవసాయాన్ని లాభసాటిగా చూసుకోవాలన్నారు. అదేవిధంగా రైతులకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఇష్టానుసారంగా అక్రమణలు చేసినా, కాలువలను కలుషితం చేసినా వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఆధునిక పనిముట్లను రైతులు పూర్తిస్థాయిలో సద్వినియోగపరచుకుని మరింత లాభసాటి వ్యవసాయాన్ని చేయాలని ఆమె రైతులకు సూచించారు.
జిల్లా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కునాథరాజు మురళీకృష్ణంరాజు, జిల్లా వ్యవసాయ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, సర్పంచ్ ఇంజేటి మరియమ్మ, కొత్తపల్లి నాగరాజు, వ్యవసాయాధికారి నారాయణరావు, వివిధ శాఖల అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.