జూన్ ఒకటో తేదీ నుండి జిల్లాలోని అన్ని రేషన్ దుకాణాల ద్వారా నిత్యవసర సరుకులు పంపిణీ చేయనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు
శుక్రవారం కలెక్టరేట్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నుండి టి.రాహుల్ కుమార్ రెడ్డి జూన్ 1 నుండి రేషన్ దుకాణం ద్వారా నిత్యవసర సరుకులు పంపిణీ పై పౌరసరఫరాల అధికారులు, ఆర్డీవోలు, తహసిల్దార్లు సిఎస్ డిటిలతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు జూన్ ఒకటో తేదీ నుండి అన్ని రేషన్ దుకాణాలు ద్వారా నిత్యవసర సరుకులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి జిల్లాలోని 1,052 రేషన్ దుకాణాల ద్వారా నిత్యవసర సరుకులు పంపిణీకి తీసుకోవలసిన చర్యలు పై సంబంధిత శాఖల అధికారులకు పలు సూచనలను జారీ చేశారు. కార్డుదారులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేయుటకు ప్రతి నెల ఒకటో తేదీ నుండి 15వ తేదీ వరకు రేషన్ దుకాణాలు తెరిచి ఉంచాలని అన్నారు. ప్రతిరోజు ఉదయం 8.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుంచి రా.8.00 గంటల వరకు రేషన్ దుకాణాలు తెరిచి ఉంచాలన్నారు. జూన్ 1వ తేదీన ప్రజాప్రతినిధులతో రేషన్ షాపులు వద్ద నిత్యవసర సరుకులు పంపిణీ ప్రారంభించాలని సూచించారు. దివ్యాంగులు, దీర్ఘకాలిక అస్వస్థత, 65 సంవత్సరాల పైబడి ఉన్న వృద్ధులకు రేషన్ సరుకులను వారి ఇంటి వద్దనే సంబంధిత డీలర్ ద్వారా ప్రతి నెల 1వ తేదీ నుండి 5వ తేదీ లోపు అందేలా పర్యవేక్షించాలన్నారు. 65 ఏళ్లు పైబడి ఉన్న వృద్ధుల లిస్టును రేషన్ షాపుల వారీగా సంబంధిత తహాసిల్దారులు ఈపిడిఎస్ లాగిన్ నందు ఉన్న వాటిని అందరూ రేషన్ డీలర్లకు పంపాలని ఆదేశించారు. రేషన్ దుకాణాల యొక్క పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. కార్డుదారులకు ఖచ్చితమైన తూకంతో సరుకులు పంపిణీ చేసి రసీదు ఇవ్వాలని అన్నారు. రేషన్ దుకాణం సంబంధించిన ఆధరైజేషన్ తెలియజేయు వివరాలను ప్రింటెడ్ డిస్ప్లే బోర్డుని తప్పనిసరిగా ఉంచాలన్నారు. నిత్యవసర సరుకులకు సంబంధించిన స్టాకు మరియు ధరల పట్టికను తప్పనిసరిగా ఉంచాలన్నారు. ఈపోస్ డివైజ్, వేయింగ్ మిషన్, ఐరిస్ డివైజ్ పనితీరు సక్రమంగా ఉండాలని తేడాలుంటే టెక్నీషియన్ తో రిపేరు చేయించుకోవాలని సూచించారు. నిత్యవసర సరుకులు పంపిణీ విషయంలో డీలర్లు అత్యంత పారదర్శంగా జవాబుదారితనంతో ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ విధానంపై నేరుగా రేషన్ కార్డుదారుల యొక్క అభిప్రాయాలు తీసుకోవటం జరుగుతుందని, కావున కార్డుదారులను సంతృప్తిపరిచే విధంగా సేవలు అందించాలని సంబంధిత అధికారులను డీలర్లను ఆదేశించారు. డీలర్లు కానీ, కార్డుదారులు కానీ వారి స్వలాభం కొరకు బహిరంగ మార్కెట్లో నిత్యవసర సరుకులు అమ్మరాదన్నారు. నిత్యవసర సరుకులు పంపిణీలో ఎటువంటి అవకతవకలు జరిగిన సంబంధిత వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.