వర్షాకాలంలో జిల్లా ప్రజలకు ఎటువంటి ఇసుక కొరత లేకుండా స్టాక్ పాయింట్లకు తరలించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు.
శుక్రవారం జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో జిల్లా ఇసుక కమిటీ సమావేశంను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఇసుక రీచ్ లు అందుబాటులో లేనందున వర్షాకాలంలో ప్రజలకు ఎటువంటి కొరత లేకుండా ఇసుకను సరఫరా చేసేందుకు ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లా పెండ్యాల లో ఓపెన్ ఇసుక రీచ్ ను జిల్లాకు ప్రత్యేకంగా కేటాయించడం జరిగిందని అన్నారు. పెండ్యాల రీచ్ నుండి జిల్లాలోని భీమవరం, ఆచంట, నరసాపురం, పాలకొల్లు, తణుకు, ఉండి తాడేపల్లిగూడెంల లోని స్టాక్ పాయింట్లకు ఇసుక రవాణా చేయుటకు వాహనములకు కిలో మీటకు ఒక టన్నుకు రవాణా చార్జీ నిర్ణయం పై సంబంధిత అధికారులతో చర్చించారు. ఇసుక రవాణా కు సంబంధించి సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధను చూపాలన్నారు. పెనుగొండ మండల సిద్ధాంతం వద్ద కొత్త ఎం డి ఎల్ స్టాక్ పాయింట్ ఏర్పాటుపై సాధ్య సాద్యాల పరిశీలించాలని పెనుగొండ తాహసిల్దార్ ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమీక్ష సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీ వి.భీమారావు, జిల్లా గనులు భూగర్భ శాఖ అధికారి బి.రవికాంత్, ఆర్టీవో డి.ఉమా మహేశ్వరరావు, గ్రామ, వార్డు సచివాలయం అధికారి వై.దోసిరెడ్డి, పెనుగొండ తహసిల్దార్ జి.అనిత కుమారి, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.