Close

పిజిఆర్ యస్ అర్జీలకు నిర్ణీత సమయంలో నాణ్యమైన పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు …

Publish Date : 26/05/2025

సోమవారం జిల్లా కలెక్టరేటు పిజిఆర్ యస్ సమావేశం మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమంలో జిల్లాలోని వివిధ మండలాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింటు కలెక్టరు మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలు పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. వివిధ శాఖల అధికారులు వారి శాఖలకు సంబంధించిన అర్జీలు పరిశీలించి నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.కొన్ని ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో ఫిర్యాదుదారునికి ఇంటికి వెళ్ళి స్వయంగా పరిశీలించి పరిష్కారం చూపించినట్లు పిజిఆర్ యస్ కార్యక్రమంపై ప్రజలకు నమ్మకం, అధికారులపై గౌరవం కలుగుతుందని అన్నారు. పిజిఆర్ యస్ ద్వారా వచ్చిన అర్జీలను సమర్థవంతంగా పరిష్కరించి నట్లయితే అదే ఫిర్యాదు మరల పిజిఆర్ యస్ కార్యక్రమంలో రాదని సంబంధిత అధికారులు ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు.

ఈ రోజు పిజిఆర్ యస్ కార్యక్రమం ద్వారా 192 అర్జీలు అందాయి, వాటిలో కొన్ని ఇలా ఉన్నాయి.

@ గణపవరం మండలం కొమర్రు గ్రామ నివాసి. సత్తి సత్యనారాయణ రెడ్డి.ఇంటి ప్రక్కన చర్చి నుండి లౌడు స్పీకర్లు వలన చాలా ఇబ్బందులు కలుగు తున్నాయి. నా భార్యకు గుండె జబ్బు, నాకు షుగరు, బిపిలు ఉన్నాయి విచారించి సమస్యను పరిష్కారం చూపాలని కోరారు.

@ తాడేపల్లిగూడెం మండలం బంగారుగూడెం గ్రామ నివాసి. సి.హెచ్. వెంకటేశ్వర రావు. నాకు నాలుగు వేలు పెన్షన్ వస్తుంది. నాకు పక్షవాతం వచ్చి మంచాన పడ్డాను. సదరన్ ద్వారా సర్టిఫికెటు జారీచేసి పెన్షన్ సొమ్ము పెంచాలని కోరారు.

@ పోడూరు మండలం గుమ్ములూరు గ్రామ నివాసి. పెరిచర్ల రామకృష్ణం రాజు. మా స్థలంలో వ్యవసాయ మార్కెట్టు కమిటీ వారు రహదారి వేసినారు.నాకు నష్టపరిహారం ఇప్పించగలరని కోరాపత్రికా ప్రకటన.

@ అత్తిలి మండలం కంచుమర్రు గ్రామ నివాసి. మల్లిడి తులసీదాసు రెడ్డి. ఆన్లైన్లో నా భూమి 15 సెంట్లు భూమి తక్కువ చూపెడుతుంది.సర్వే చేసి సరిహద్దు నిర్ణయించి 15 సెంట్లు భూమి తిరిగి వచ్చేలా చూడగలరు.

@ పాలకోడేరు మండలం శృంగవృక్షం గ్రామ నివాసి. హోతా శ్రీరామచంద్ర మూర్తి. మా గ్రామ రామాలయంలో అర్చకులుగా 25 ఏళ్ళుగా పనిచేస్తున్నాను.దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా జీతం వచ్చేలా సిఫార్సు చెయ్యగలరని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి యం.వెంకటేశ్వర్లు, పి జి ఆర్ ఎస్ నోడల్ అధికారి వై.దోసిరెడ్డి, డ్వామా పిడి డా.కె.సి.హెచ్. అప్పారావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వర రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, వయోవృద్ధుల సంక్షేమ అప్పిలేటు ట్రిబ్యునల్ సభ్యులు మేళం దుర్గాప్రసాదు, తదితరులు పాల్గొన్నారు.