మాదకద్రవ్యాల నియంత్రణకు అధికారులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు

శుక్రవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి సంయుక్తంగా ఎన్ కార్డ్ (జిల్లా స్థాయి కమిటీ ఫర్ బెటర్ కోఆర్డినేషన్ ఇన్ కంట్రోలింగ్ గంజాయి & ఇతర మాదకద్రవ్యాల నియంత్రణ) పై సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో గంజాయి సాగు నియంత్రణ, రవాణా, అమ్మకం, వినియోగం, అవగాహన, గంజాయికి బానిసలు అయిన వారికి వైద్య సహాయం, పునరావాసం అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ మాదకద్రవ్యాలు వినియోగంపై అనర్ధాలను ప్రజలకు తెలియచెప్పేందుకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నారు. వీటిని సేవించడం వలన కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమవుతుందని, తీవ్ర అనారోగ్యానికి గురవుతారని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయి వంటి మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు గుర్తిస్తే ఎక్కడ నుండి రవాణా అవుతున్నాయో వాటి మూలాలను గుర్తించేందుకు తగు చర్యలను తీసుకోవాలన్నారు. మెడికల్ షాపులను డి ఎం అండ్ హెచ్ ఓ, డ్రగ్ ఇన్స్పెక్టర్ లు సంయుక్తంగా తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. నిషేధిత మందులను అమ్మిన, మత్తుకు కారకమైన మందులను ప్రీస్క్రిప్షన్ లేకుండా అమ్మిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ 2025 జనవరి నుండి నేటి వరకు ఎన్ డి పి ఎస్ యాక్ట్ కింద మూడు కేసులు నమోదయాయని, 17 మందిని అరెస్టు చేయడం జరిగిందని, 15.638 కిలోల గంజాయిని సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. దీనికి సంబంధించి ఒక వాహనాన్ని కూడా సీజ్ చేయడం జరిగిందన్నారు. మాదకద్రవ్యాలు వినియోగిస్తే కలిగే అనద్దాలపై 257 పాఠశాల సమీపంలో, 225 కళాశాలల సమీపంలో గోడ పత్రికలను అంటించడం జరిగిందని, జిల్లాలోని 154 ప్రముఖ కుడళ్ళల్లో కూడా హోర్డింగ్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే 102 కాలేజీలు వద్ద, 389 బహిరంగ ప్రదేశాల్లో, 82 గ్రామాల్లో అవగాహన కొరకు సమావేశాలను కూడా నిర్వహించడం జరిగిందని వివరించారు. జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు గట్టి చర్యలు చేపట్టడం జరిగిందని, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ సమయంలో కూడా మాదకద్రవ్యాల వినియోగం వలన అనర్ధాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, తద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించడానికి వీలు పడుతుంది అన్నారు.
చివరిగా డ్రగ్స్ తీసుకుంటే కలిగే అనర్ధాలపై అవగాహన గోడపత్రికలను ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా అడిషనల్ ఎస్పీ వి. భీమారావు, జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారి డాక్టర్ ఆర్.ఎస్ కుమారేశ్వరన్, జిల్లా రవాణా అధికారి పి.ఉమామహేశ్వరరావు, ఆర్డీవోలు దాసిరాజు, కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఖతీబ్ కౌసర్ భానో, డీఎస్పీ లు జై సూర్య, శ్రీ వేద, డి.విశ్వనాథ్, ఔషధ తనిఖీ, నియంత్రణ అధికారి, డిఎంహెచ్వో డాక్టర్ జి గీతాబాయి, ఐసీడీఎస్ పీడీ బి.సుజాత రాణి, తదితరులు పాల్గొన్నారు.