దివ్యాంగుల పెన్షన్లు పొందుతున్న వారికి నిర్వహిస్తున్న సదరన్ క్యాంపులలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంబంధిత అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పెన్షన్ పొందుతున్న వారికి రీ వెరిఫికేషన్ సదరన్ క్యాంపుల నిర్వహణపై డి సి హెచ్ ఎస్, డి ఆర్ డి ఏ, దివ్యాంగులు శాఖ, డిఎంహెచ్ఓ, తణుకు జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ తో క్షుణ్ణంగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ 6 వేలు, 15 వేలు పింఛన్లు పొందుతున్న దివ్యాంగులు జిల్లాలో మొత్తం 27,500 మంది ఉన్నారని, వారిలో ఇప్పటివరకు 9 వేల మందికి రీ వెరిఫికేషన్ పూర్తి చేయడం జరిగిందన్నారు. వెరిఫికేషన్ ప్రక్రియ అక్టోబర్ వరకు కొనసాగుతుందని తెలిపారు. జిల్లాలో కొన్ని దివ్యాంగత్వ పరీక్షల నిర్వహణకు మిషనరీ అందుబాటులో లేనందున విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, విజయవాడ తదితర దూరం ప్రాంతాలకు రిఫర్ చేయడం జరుగుతుందని, దివ్యాంగులకు ఇది వ్యయ ప్రయాసలతో కూడుకున్నదిగా ఉండడం వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తన దృష్టికి వచ్చిందన్నారు. ఎంతమంది డాక్టర్లు రీవెరిఫికేషన్ సదరన్ క్యాంపుల్లో పాల్గొంటున్నారు, ఇప్పటివరకు ఎంతమందిని పరీక్షించారు, ఏ ఏ ప్రాంతాలకు సిఫారసు చేశారు, మన జిల్లాలో అందుబాటులో లేని పరికరాలు ఏంటి అనే విషయాలను చర్చించారు. తణుకులో బేరామిషన్ లేని కారణంగా వినికిడి దివ్యాంగత్వం కలిగిన వారికి పరీక్షలకు ఇబ్బంది ఎదుర్కొంటున్నామని, అలాగే పెరాలసిస్, మస్కులర్ డిస్ట్రోఫీ, మెంటల్ ఇల్నేస్, మెంటల్ రెట్రిడేషన్ సేవలు కూడా జిల్లాలో అందుబాటులో లేవని డిసిహెచ్ఎస్ జిల్లా కలెక్టర్ కు వివరించారు. వెంటనే జిల్లా కలెక్టర్ స్పందిస్తూ తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న బెరామిషన్ వినియోగించుకోవడానికి పర్మిషన్ మంజూరు చేయవలసిందిగా డిఎంహెచ్ ఓను ఆదేశించారు. అలాగే ఆడియోలజిస్ట్ సేవలను కూడా వినియోగించుకోవాలని సూచించారు. దివ్యాంగత్వంలో నూరాలజీ సమస్య ఎంతమంది ఉన్నారు, ఇప్పటివరకు ఏ ఏ ప్రాంతాలకు రిఫర్ చేశారు, మిగిలిన వారిని ఏ ఏ ప్రాంతాలకు పంపించాల్సి ఉంటుంది తదితర సమాచారాన్ని వెంటనే సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి ఆయా ప్రాంతాలకు సంబంధిత బాధితులను పంపటానికి ప్రత్యేక రవాణాతో పాటు ఒక డాక్టర్ను వారికి సహాయకంగా నియమించి పంపించడానికి చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. జిల్లాలో జరుగుతున్న సదరన్ క్యాంపులు నిర్ణీత సమయంలో ప్రారంభం కాకపోవడం, కొంతమంది డాక్టర్లు దివ్యాంగులను హేళనగా మాట్లాడుతున్నారని ఇప్పటికే ఫిర్యాదులు అందాయని, ఇటువంటి చర్యలు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, దివ్యాంగులతో అమర్యాదగా ప్రవర్తించినట్లు ఫిర్యాదు అందితే తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇటీవల జరిగిన డి డి ఆర్ సి సమావేశంలో తణుకు నియోజవర్గం శాసనసభ్యులు సదరన్ క్యాంపుల సేవలపై ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగిందన్నారు. కొన్ని కేసులను దూర ప్రాంతాలకు రిఫర్ చేయడం వలన వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమావేశం దృష్టికి తీసుకురావడం కూడా జరిగిందని ఈ సందర్భంలో కలెక్టర్ ప్రస్తావించారు.
ఈ సమావేశంలో డి సి హెచ్ ఎస్ డాక్టర్ పగడాల సూర్యనారాయణ, డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్ఎస్ఎస్ వేణుగోపాల్, జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారి రామ్ కుమార్, తణుకు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ, డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ జి.గీతా బాయి, తదితరులు పాల్గొన్నారు.