Close

విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులు, సిబ్బంది అవగాహనతో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Publish Date : 09/05/2025

శుక్రవారం భీమవరం కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి విపత్తుల నిర్వహణపై అవగాహన శిక్షణా తరగతులను గూగుల్ మీట్ ద్వారా జిల్లా, డివిజన్, మండల, స్థాయి అధికారులు, సిబ్బందికి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ విపత్తుల కారణంగా జిల్లాలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలను ఈరోజు శిక్షణా తరగతుల ద్వారా తెలియజేయడం జరుగుచున్నదన్నారు. ప్రతి ఒక్కరు ప్రతి అంశాన్ని కూలంకషంగా అర్థం చేసుకొని క్షేత్రస్థాయిలో అమలు చేసేలా అవగాహన పొందాలన్నారు. మన జిల్లాలో వరదలు, తుఫానులు, ఉరుములు, మెరుపులు కారణంగా ఏ ఒక్క ప్రాణిని కోల్పోకూడదని, విపత్తుల సమాచారం మారుమూల ప్రాంతాలకు సైతం చేరే అంతగా వ్యవస్థను సిద్ధం చేసుకోవాలన్నారు. ఉరుములు, మెరుపులకు సంబంధించిన సందేశాలు రాష్ట్ర విపత్తుల శాఖ నుండి ఎప్పటికప్పుడు అందుకోవడం జరుగుచున్నదని, ఇటువంటి సమాచారాన్ని వ్యవసాయ భూముల్లో పనిచేస్తున్న కూలీలు, రైతులు, గొర్రెలు, పశువుల కాపరులు, అలాగే ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలకు వెంటనే చేరే విధంగా సిబ్బందిని కేటాయించాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మే 4న అకస్మిక వర్షాలు కారణంగా నష్టాన్ని సమీక్షిస్తూ ఈ విషయమై స్పష్టమైన ఆదేశాలను జారీ చేయడం జరిగిందన్నారు. ఎవరైనా పిడుగు వలన చనిపోతే ఆ కేసును ఆడిట్ చేయాలని ఆదేశించారన్నారు. ఆడిట్ అంటే అక్కడ పనిచేస్తున్న వారికి పిడుగుల సమాచారం అందిందా లేదా, ఏమైనా ముందస్తు హెచ్చరికలు ఉన్నాయా ఇటువంటి సమాచారాన్ని క్రోడీకరించి నివేదికను అందజేయాల్సి ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రజలను అప్రమత్తం చేయడంలో జాగర్తగా వ్యవహరించాలని, అలసత్వంగా ఉంటే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈరోజు నిర్వహించిన అవగాహన తరగతులను గ్రామస్థాయిలో కూడా ఏర్పాటు చేసి తెలియజేయాలన్నారు. ఉరుములు లేదా పిడుగులతో కూడిన వర్షం సాధారణంగా 30 నిమిషాల నుండి గంట వరకు ఉంటాయని, ఎక్కడైనా కొద్దిసేపు భారీ వర్షం కురిపిస్తుందన్నారు. ఉరుములు/ పిడుగులతో కూడిన వర్షం పడటానికి వెచ్చని, తేమతో కూడిన పరిస్థితులు అత్యంత అనుకూలమైనవన్నారు. ఉరుములు/ పిడుగులలో దాదాపు 10 శాతం తీవ్రమైనవిగా వర్గీకరించబడి, కనీసం మూడు వంతుల అంగుళం వ్యాసం కలిగిన వడగళ్లను ఉత్పత్తి చేస్తుందని, గంటకు 58 మైళ్లు లేదా అంతకంటే ఎక్కువ వేగంతో గాలులు వీస్తాయన్నారు. బహిరంగ ప్రదేశంలో ఎత్తైన, విడిగా ఉన్న చెట్టు వంటివి మెరుపుకు సహజ వాహకాలుగా ఉంటాయన్నారు. బహిరంగ పొలాలు, బీచ్, నీటి మీద పడవలో ప్రయాణిస్తున్నప్పుడు, విడిగా, దూరంగా ఉన్న షెడ్లు లేదా బహిరంగ ప్రదేశాలలోని ఇతర చిన్న నిర్మాణాలు, ఏదైనా మెటల్-ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు, మోటార్ సైకిళ్ళు, సైకిళ్లు పడే అవకాశం ఎక్కువ ఉందన్నారు. పిడుగు లేదా మెరుపు పడుతున్న సందర్భంలో యంత్రాలు వాడడం, ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళటం, గాలిపటం లాంటివి ఎగరవేయడం, నీటిలో ఈదడం, పొడవైన స్తంభాలు, చెట్లు వాటి కింద నిలబడడం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదన్నారు. ఉరుములు, మెరుపులు సమయంలో సురక్షిత భవనాలు, తదితర ప్రాంతాలకు చేరుకోవాలని, కారు లోపల ఉండడం, కిందకి వంగి కూర్చుని చెవులను మూసుకోవడం తదితరు జాగ్రత్తలను పాటించాలన్నారు.

జూమ్ కాన్ఫరెన్స్ లో డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, జిల్లా గ్రామ వార్డు సచివాలయాల అధికారి వై.దోసిరెడ్డి, డ్వామా పి.డి డాక్టర్ కెసిహెచ్ అప్పారావు, డిపిఓ బి.అరుణశ్రీ, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి బి.శ్రీనివాసరావు, జిల్లాలోని అన్ని మున్సిపల్ కమిషనర్లు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, వైద్య శాఖ సిబ్బంది, డ్వామా శాఖ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

2.1