Close

భీమవరం రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సెంటర్ నందు అందుబాటులోకి వచ్చిన తల సేమియా సేవలను జిల్లాలోని బాధితులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ మరియు ఐ ఆర్ సి ఎస్ అధ్యక్షులు చదలవాడ నాగరాణి తెలిపారు

Publish Date : 09/05/2025

గురువారం మే 8 ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం మరియు ప్రపంచ తల సేమియా దినోత్సవం సందర్భంగా ఐ.ఆర్.సి.ఎస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాయలం బ్లడ్ బ్యాంక్ కేంద్రం నందు ఏర్పాటుచేసిన ఆరు పడకల తలసేమియా డే కేర్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. తొలుత ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ వ్యవస్థాపకులు జీన్ హెన్రీ డ్యూనంట్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం రక్తదానం చేసిన యుఎన్ఓ ఫీడ్స్ కంపెనీ సిబ్బందికి సర్టిఫికెట్లను అందజేశారు. తల సేమియా సెంటర్ సేవలకు ఒక్కొక్క లక్ష చొప్పున విరాళం అందించిన దాతలు తిరుపతి రాజు, కె.రాధాకృష్ణ మూర్తి లను జిల్లా కలెక్టర్ సన్మానించి మెమెంటోలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో తల సేమియా సేవలను విస్తృతం చేయాలని అన్నారు. జిల్లాలో సుమారు 35 నుండి 40 మంది వరకు తల సేమియా పిల్లలు ఉన్నారని, వారికి వారానికి రెండు రోజులు చొప్పున మంగళ, శుక్రవారాలలో ఉచిత సేవలను అందజేయడానికి చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఎం.మౌనిక ముందుకు రావడం ఎంతో సంతోషించదగిన విషయం అన్నారు. వీరు ఇంతకుముందు ఢిల్లీలోని గంగారం హాస్పిటల్లో కూడా వైద్య సేవలు అందించడం జరిగిందని తెలిపారు. రెడ్ క్రాస్ యూత్, రెడ్ క్రాస్ జూనియర్ లను ప్రారంభించి జిల్లాలో రెడ్ క్రాస్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలను చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో రెడ్ క్రాస్ సేవలు బాగా కొనసాగుతున్నాయని, ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని రెడ్ క్రాస్ ప్రతినిధులను, సిబ్బందిని అభినందించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ చైర్మన్ ఎం ఎస్ వి శివ రామభద్రిరాజు, వైస్ చైర్మన్ కె.కనకరాజు, డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ గీతా బాయి, యు ఎన్ ఓ ఫీడ్స్ అధినేత కే.రాధాకృష్ణ మూర్తి, ఐ ఆర్ సి ఎస్ సెక్రటరీ జిఎంకే కృష్ణారావు, సీనియర్ కోఆర్డినేటర్ ఎస్ మల్లేశ్వరరావు, మెడికల్ అధికారులు డాక్టర్ ఎన్ రామరాజు, డాక్టర్ శివ, డాక్టర్ కాంతేటి రాధాకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

1.11