అకాల వర్షాలతో పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని, రేపు సాయంత్రం లోపుగా పరిహారం అందజేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

గత రెండు రోజుల పాటు రాష్ట్రంలో కురిసిన వర్షాలపై సీఎం చంద్రబాబు సోమవారం సచివాలయంలో వ్యవసాయ, విపత్తుల నిర్వహణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు జిల్లా కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు రేపు సాయంత్రంలోగా పరిహారం అందజేయాలని అధికారులను ఆదేశించారు. పంటనష్టాన్ని వెంటనే అంచనా వేసి నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూడాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా పిడుగుపాటుకు గురై చనిపోయిన 8 మంది బాధితుల కుటుంబాలకు పరిహారం కూడా తక్షణమే అందించాలని ఆదేశించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో జరిగిన పంట, ప్రాణ నష్టం గురించి అడిగి సీఎం వివరాలు తెలుసుకున్నారు. జిల్లాల్లో అకాల వర్షాలు, ప్రస్తుత పరిస్థితులను గురించి సీఎంకు కలెక్టర్లు వివరించారు. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఇంకా వర్ష సూచన ఉన్నందున కలెక్టర్లు, అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రాణనష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విపత్తుల సమయాల్లో అధికారులు మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు. పిడుగుల పడే సమయాల్లో ప్రజల సెల్ ఫోన్లకు సందేశం వెళ్లని సమయంలో దగ్గరగా ఉన్నట్లైతే నేరుగా వెళ్లి అప్రమత్తం చేయాలని సూచించారు. దీనికి అనుగుణంగా సచివాలయాల్లోని సిబ్బందిని సిద్ధం చేయాలన్నారు. పిడుగులు పడి చనిపోయిన పశువులకు కూడా నిబంధనల మేరకు పరిహారం వెంటనే విడుదల చేయాలన్నారు. జిల్లాల్లో పరిస్థితులను బట్టి కిందిస్థాయి అధికారులతో కలెక్టర్లు సమన్వయం చేసుకోవాలని సూచించారు.
2,224 హెక్టార్లలో వరిపంట నష్టం అకాల వర్షాలతో రాష్ట్రంలో 2,224 హెక్టార్లలో వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఈ మేరకు ప్రాథమిక అంచనాల నివేదికను సీఎంకు అందజేశారు. ప్రధానంగా పశ్చిమ గోదావరి, నంద్యాల, కాకినాడ, సత్యసాయి జిల్లాల్లో ఈ పంటలకు నష్టం వాటిల్లిందని అన్నారు. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 మండలాల్లో 1,033 హెక్టార్లలో వరిపంట నేలకు ఒరిగిందని వివరించారు.
138 హెక్టార్లలలో ఉద్యాన పంటలకు నష్టం. అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలో దెబ్బతిన్న హార్టికల్చర్ పంటల వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. అరటి, బొప్పాయి, మామిడి, తదితర ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో ఎక్కువగా అరటి, మామిడి పంటలకు నష్ట వాటిల్లింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 138 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. కృష్ణా, ఏలూరు, కాకినాడ, ఎన్టీఆర్, తిరుపతి, నంద్యాల, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉద్యానవన పంటలకు నష్టం కలిగిందని అధికారులు వివరించారు.
ధాన్యం కొనలేదనే మాట రాకూడదు రబీలో 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నామని పౌరసరఫరాల శాఖ ప్రత్యేక కార్యదర్శి సౌరబ్ గౌర్ సీఎంకు వివరించారు. ఇప్పటికే 13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. వర్షాలకు రంగు మారిన ధాన్యం కూడా కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రైతుల వద్దనున్న ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. రావాల్సిన పంటకంటే అదనంగా వస్తే అవసరమైతే కేంద్రంతో మాట్లాడి కొనుగోలుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఏ ఒక్క రైతు నుంచి కూడా తమవద్ద ధాన్యం కొనలేదనే మాట ఉత్పన్నం కాకూడదని అన్నారు.
అధికారులు మాణవీయ కోణంతో పనిచేయాలి విపత్తుల సమయంలో ప్రభుత్వ అధికారులు యంత్రాంగం మాణవీయ కోణంలో పనిచేయాలన్నారు. విపత్తులు వచ్చినప్పుడు కేవలం సహాయక చర్యలు చేపట్టడమే కాకుండా ఎలాంటి నష్టం వాటిల్లకండా ముందుస్తుగా యంత్రాంగం సన్నద్దమవ్వాలన్నారు. గతంలో హుద్ హుద్ తుఫాను సమయంలో ప్రాణనష్టం కలగకుండా సమర్థవంతంగా పనిచేసిన తీరును ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తు చేశారు. విపత్తుల సమయంలో ఇలాంటి ముందస్తు సన్నద్ధత ఎంతో అవసరమన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఆర్టీజీఎస్‌లోని అవేర్ విభాగం నుంచి విపత్తు నిర్వహణ సంస్థ నుంచి ఎప్పటికప్పుడు వాతావరణం గురించి ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తుంటామన్నారు. జిల్లా కలెక్టర్లందరూ దీనికనుగుణంగా ఆయా జిల్లాల్లో ఎట్టి పరిస్థితుల్లో మరణాలు సంభవించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద మంచి యంత్రాంగం, సాంకేతిక ఉందన్నారు. వీటిని సమర్థంగా వినియోగించుకోవాలన్నారు. సాంకేతికత కూడా వెళ్లలేని ప్రాంతాల్లో మానవ సాయంతో ప్రమాదాలు నివారించి మరణాలు సంభవించకుండా చూడాలన్నారు. యంత్రాంగం ఎంత అప్రమత్తంగా ఉంటే నష్ట నివారణ అంత సమర్థవంతంగా చేయగలమని చెప్పారు. ప్రతి మండలంలోని అధికారులతో కలెక్టర్లు టెలీకాన్షరెన్సులు పెట్టుకుని అక్కడ సన్నద్దత చర్యలను పర్యవేక్షించాలన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లాలో అకాల వర్షాల కారణంగా ఏర్పడిన పరిస్థితులను ముఖ్యమంత్రికి వివరిస్తూ ఎక్కువగా వరి పంట 2,791 ఎకరాలలో నేలకు ఒరిగిందన్నారు. అలాగే తొమ్మిది ఎకరాల్లో అరటి తోటలు దెబ్బతిన్నాయని తెలిపారు. ధాన్యం కొనుగోలులో ఎటువంటి ఇబ్బందులు లేవని, రంగు మారిన, తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని మిల్లర్లకు సూచించినట్లు తెలిపారు. అకాల వర్షాల కారణంగా ఏర్పడిన పరిస్థితులను చక్కదిద్దేందుకు, రానున్న రెండు రోజులు వర్ష సూచన మేరకు అప్రమత్తతపై అధికారులను సన్నద్ధం చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ వివరించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, జిల్లా విద్యుత్ శాఖ అధికారి రఘునాథ్ బాబు, తదితరులు పాల్గొన్నారు.