Close

పిజిఆర్ఎస్ లో అందిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు.

Publish Date : 05/05/2025

సోమవారం జిల్లా కలెక్టరేట్ పి.జి.ఆర్.ఎస్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించి అర్జీదారుల నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ను కలిసి అర్జీని సమర్పించుకునేందుకు పూర్తి అంగవైకల్యం కలిగిన బిడ్డను ఎత్తుకొని వచ్చిన దంపతుల వద్దకు జిల్లా కలెక్టర్ స్వయంగా వెళ్లి పాప అంగవైకల్యంపై ఆరా తీస్తూ దివ్యాంగుల పెన్షన్ వస్తుందా, ప్రతి నెల ఎంత పెన్షన్ వస్తుంది, ఇప్పుడు ఏ విషయమై మీరు అర్జీని సమర్పించడానికి ఇక్కడికి వచ్చారు అనీ ప్రశ్నించగా మా బిడ్డ నూరు శాతం అంగవైకల్యంతో కదలలేని పరిస్థితుల్లో ఉన్నదని, దివ్యాంగుల పెన్షన్ రూ.6 వేలు ప్రస్తుతం వస్తున్నదని, వీల్ చైర్ కు, మంచానికే పరితమైన వారికి అందజేసే రూ.15 వేలు పెన్షన్ మంజూరుకు సిఫార్ చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ ను కోరడం జరిగింది. ఈ విషయమై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ అర్హతకు కావలసిన ధ్రువపత్రాలను, బిడ్డ యొక్క వాస్తవ పరిస్థితులను పరిశీలించి రూ.15 వేలు మంజూరుకు ఆన్లైన్లో పొందుపరచాలని డిసిహెచ్ఎస్ ను ఆదేశించారు. అలాగే గణపవరం మండలం జల్లి కాకినాడ గ్రామానికి చెందిన మంజుల, ప్రసన్నకుమార్ తమ ఆస్తి వివాదాన్ని జిల్లా కలెక్టర్ కు విన్నవించుకోవడానికి వరండాలో వేచి ఉన్న సందర్భంలో కూడా జిల్లా కలెక్టర్ స్వయంగా వెళ్ళి సమస్యపై మాట్లాడుతూ మంజుల చేతిలోని బిడ్డను చూసి చలించిపోయారు. బిడ్డ ఎదుగుదల లేకుండా భక్త చిక్కిపోయి ఇలా ఎందుకు అన్నాడు, బిడ్డ వయసు ఎంత, ఏమైనా అనారోగ్యం ఉన్నదా అని పలు ప్రశ్నలను అడగడం జరిగింది. బిడ్డ వయసు మూడు నెలలు అని, పుట్టిన దగ్గర నుండి సరైన పోషణ లేనట్లుగా ఉంటుందని బదులిచ్చారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ను, హాస్పిటల్ సర్వీసెస్ జిల్లా కోఆర్డినేటర్ ను పిలిచి ఈ బిడ్డ ఎందుకు ఇలా ఉన్నారు, పోషకలేమితో బక్క చిక్కిపోయి ఇంత ఆనారోగ్యంగా ఉండడానికి కారణాలు ఏంటి అని ప్రశ్నిస్తూ, వెంటనే పిల్ల వైద్య నిపుణులకు చూపించి, తల్లి బిడ్డకు అంగన్వాడి కేంద్రం ద్వారా పౌష్టికాహారం అందించటంతో పాటు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.

అధికారులు అర్జీల పరిష్కారంలో ఆలక్ష్యం వద్దు.. జిల్లా కలెక్టర్

పి జి ఆర్ ఎస్ ద్వారా అందిన ప్రతి అర్జీకి నిర్ణీత గడువులోపుగా నాణ్యమైన పరిష్కారాన్ని అందజేయాలని అధికారులను ఆదేశించారు. తక్షణ పరిష్కారానికి వీలు కానీ అర్జీలను క్షేత్రస్థాయిలో వాస్తవ, అవాస్తవాలను క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారులకు సంతృప్తికరమైన పరిష్కారాన్ని చూపించాలని తెలిపారు. తమ శాఖకు సంబంధం లేని అర్జీని వెంటనే సంబంధిత శాఖకు బదిలీ చేయాలని ఆదేశించారు. జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి 149 అర్జీలను సోమవారం నిర్వహించిన పి జి ఆర్ ఎస్ కార్యక్రమం ద్వారా స్వీకరించడం జరిగిందని అన్నారు.

అర్జీలలో కొన్ని ఇలా…*

@ పాలకోడేరు మండలం శృంగవృక్షం గ్రామానికి చెందిన గునుపూడి జోగిరాజు తన పేరు మీద ఉన్న ఇంటిని నా కుమారుడికి రిజిస్టర్ చేయించానని, నా భార్య చనిపోయిన తర్వాత నా కుమారుడు తనను చూడటం లేదని, కావున తన ఇంటిని తిరిగి నా పేరన రిజిస్ట్రేషన్ చేయించవలసినదిగా అర్జీని సమర్పించారు.

@ భీమవరం మండలం తుందుర్రు గ్రామానికి చెందిన చింతలపాటి సూర్యనారాయణ రాజు తనకు 3.5 ఎకరాల సాగుభూమి ఉందని, దానిని రొయ్యల చెరువుగా మార్చి రొయ్యలు సాగు చేసుకుంటున్నాని, నా చెరువు దగ్గరకు వెళ్లే దారికి అనుకుని పుంత రోడ్డు ఉందని, గ్రామానికి చెందిన పొత్తూరి వెంకటరాజు పుంత రోడ్డును అక్రమించుకుని తన భూమి కూడా కలుపుకున్నాడని ప్రస్తుతం రైతులకు నడక మార్గం లేదని, దయచేసి రైతులకు నడక మార్గం చూపించాలని కోరారు.

@ భీమవరానికి చెందిన కొంబోతుల కస్తూరిబాయి అర్జీ సమర్పిస్తూ, నా ఇంటి కరెంటు వినియోగం 300 యూనిట్లు వచ్చిన కారణంగా నా వితంతు పెన్షన్ నిలుపుదల చేశారని, నా యందు దయ ఉంచి నా వితంతు పింఛను పునరుద్ధరించాలని కోరారు.

@ వీరవాసరం మండలం రాయకుదురు గ్రామానికి చెందిన దుండి మంగమ్మ తనకు 52 సెంట్లు పొలం ఉందని సరిహద్దు రైతు పంటబోది పూడ్చడం వల్ల రెండు సెంట్లు భూమి కోల్పోయానని నాకు సంబంధించిన భూమికి సరిహద్దులు చూపించాలని కోరారు.

@ భీమవరం మండలం దిరుసుమర్రు గ్రామానికి చెందిన మందపల్లి వరలక్ష్మి అర్జీని సమర్పిస్తూ నా భర్త అబ్రహం 2023 సంవత్సరంలో చనిపోయారని, వారికి చర్మకారుల పింఛను వచ్చేదని నా భర్త చనిపోయిన నాటి నుండి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాని దయవుంచి నాకు వితంతు పెన్షన్ మంజూరు చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు, కె ఆర్ ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణ రెడ్డి, జిల్లా గ్రామ, వార్డు సచివాలయం అధికారి వై.దోసిరెడ్డి, డ్వామా పిడి డా.కె.సి.హెచ్ అప్పారావు, వయోవృద్ధుల సంక్షేమ ట్రిబ్యునల్ సభ్యులు మేళం దుర్గా ప్రసాద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

2.11 2.22