అంగన్వాడి కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ప్రత్యేక అధికారి ఎ.సూర్యకుమారి

గురువారం భీమవరం మండలం చిన్నఅమీరo సెంటర్ -3 అంగన్వాడి కేంద్రాన్ని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ సెక్రెటరీ మరియు పశ్చిమగోదావరి జిల్లా ప్రత్యేక అధికారి ఎ. సూర్య కుమారి ఆకస్మికంగా సందర్శించారు. అంగన్వాడి కేంద్రంలోని పిల్లలతో ముచ్చటించారు. వారి పేర్లును అడిగి తెలుసుకొని పాటలు పాడించి సరదాగా గడిపారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా పిల్లలకు నేర్పిస్తున్న విద్యా బోధనలు పరిశీలించారు. పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహార వివరాలను అడిగి తెలుసుకున్నారు. చిన్నారుల హాజరు పట్టి పరిశీలించారు.15 మంది పిల్లలకు 9 మంది ఉండటం గమనించి పిల్లలందరినీ తప్పనిసరిగా అంగన్వాడి కేంద్రంకు పంపేలా తల్లులను ప్రోత్సహించాలన్నారు. వారికి అందిస్తున్న ఆహారం మెనూ, ఆరోగ్య వివరాలను రిజిస్టర్ పరిశీలించి పిల్లలు బరువు, ఎత్తును స్వయంగా పరిశీలించారు. చిన్నారుల పోషణ యాప్ లో నమోదు చేస్తున్న వివరాలను పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రంలో అందుబాటులో ఉన్న సదుపాయాలను, పరిసరాలను పరిశీలించి ఖాళీగా ఉన్న స్థలంలో ఆకుకూరలు పండించి ఆకుకూరలను వండి పిల్లలకు పెట్టాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఆమె అంగన్వాడి కేంద్రాల్లో కార్యకర్తలు ఆయాలను ఉద్దేశించి మాట్లాడుతు పిల్లలకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టిక ఆహారాన్ని అందిస్తూ మీ సొంత బిడ్డల్లా ఆదరించాలని అన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను తూచ తప్పకుండా పాటించాలన్నారు. చిన్నారులను మంచిగా చూసుకోవాలని జిల్లా ప్రత్యేక అధికారి ఎ.సూర్య కుమారి అంగన్వాడి సిబ్బందిని ఆదేశించారు.
ఈ సందర్శనలో సిడిపిఓ టి.కె.వి సూర్యకాంతం, సూపర్వైజర్ డి.అనిల్ కుమార్, అంగన్వాడి హెల్పర్లు, ఆయాలు, తదితరులు ఉన్నారు.