Close

జిల్లాలో 263 రైతు సేవ కేంద్రాల ద్వారా ఒక కోటి 14 లక్షలు గోనె సంచులు రైతులకు పంపిణీ చేయడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ అన్నారు

Publish Date : 29/04/2025

సోమవారం జిల్లా కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరంలోని రబీ పంట ధాన్యం కొనుగోలుపై జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి జిల్లాలోని డివిజన్, మండల స్థాయి కొనుగోలు కమిటీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో నేటికి 263 రైతు సేవ కేంద్రాల ద్వారా 3,01,000 మెట్రిక్ టన్నుల ధాన్యమును కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయడం జరిగిందని, దీనికి సంబంధించిన నగదును రైతుల ఖాతాలలో 48 గంటల లోపుగా జమ చేయడం జరుగుతుందన్నారు. రబీ సీజన్ ధాన్యం కొనుగోలు కొరకు కావలసినటువంటి హమాలీలు, రవాణా వాహనములను సిద్ధంగా ఉంచడం జరిగిందని, అలానే రైతు సేవ కేంద్రాల ద్వారా నేటికీ 1 కోటి 14 లక్షల గోనెసంచులను రైతులకు పంపిణీ చేయుట జరిగిందన్నారు. వీటిలో నేటికి 75 లక్షలు సంచులు వినియోగించుకోగా, ఇంకా 39 లక్షలు అందుబాటులో ఉన్నాయన్నారు. అంతేకాకుండా ప్రతి రైతు సేవ కేంద్రంలో కూడా వచ్చే ఏడు రోజులకు గాను అవసరమైనటువంటి గోనెసంచులను ముందుగానే సంబంధిత రైస్ మిల్లుల దగ్గర నుండి తీసుకొని రైతుల కొరకు అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని, తద్వారా రైతులకు కొనుగోలు ప్రక్రియలో ఎక్కడా కూడా ఎటువంటి అసౌకర్యము కలుగకుండా చూసుకొనవలెనని జిల్లా డివిజన్, మండల స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో మీకు ఎటువంటి సమస్య ఉన్న మీరు నేరుగా మీ రైతు సేవ కేంద్రమును సంప్రదించవచ్చునన్నారు. ఒకవేళ సమస్య పరిష్కరించని యెడల సంబంధిత మండల, డివిజనల్, జిల్లాస్థాయి అధికారులకు తెలియజేసి మీ సమస్యను పరిష్కరించుకోవచ్చునన్నారు. దీనిలో భాగంగా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన జిల్లా కంట్రోల్ రూమ్ 81216 76653 ను సంప్రదించి మీ సమస్యను పరిష్కరించుకోవచ్చును అని తెలియజేశారు. .రైతు సేవ కేంద్రాల్లో గోనె సంచులు నిల్వ ఉండేలా చూసుకోవాలని ఒకవేళ లేకపోతే వేరే ఆర్ఎస్కేలు ద్వారా సర్దుబాటు చేసుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో నర్సాపురం ఆర్డీవో దాసిరాజు, భీమవరం ఆర్డీవో కె. ప్రవీణ్ కుమార్ రెడ్డి, తాడేపల్లిగూడెం ఆర్డిఓ కతీబ్ కౌసర్ భానో, జిల్లా పౌరసరఫరాల మేనేజర్ టి.శివరామ ప్రసాద్, జిల్లా వ్యవసాయాధికారి జెడ్.వెంకటేశ్వరులు, జిల్లా కోపరేటివ్ అధికారి నాగరాజు, జిల్లా పౌరసరఫరాల అధికారి ఎన్.సరోజ, ఆర్టీవో, వ్యవసాయ సహాయ సంచాలకులు, తహసిల్దారులు, మండల వ్యవసాయ అధికారులు, మండల కోపరేటివ్ అధికారులు, పౌరసరఫరాల డిప్యూటీ తహాసిల్దారులు, తదితరులు పాల్గొన్నారు.