తల్లి మరణిస్తే ఆ కుటుంబం అంతా ఎంతో ఇబ్బందులకు గురవుతుందని, జిల్లాలో మాత, శిశు మరణాలు జరగకుండా వైద్యులు అత్యంత అప్రమత్తతతో చికిత్సను అందజేయవలసిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్పష్టం చేశారు.

బుధవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన మాతృ, శిశు మరణాలపై సంబంధిత కమిటీ సభ్యులు బాధిత కుటుంబాల సమక్షంలో వైద్య సిబ్బందితో సమీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ కుటుంబ వ్యవస్థలో స్త్రీ పాత్ర కీలకమైనదని, తల్లి చనిపోతే పిల్లలు, కుటుంబ సభ్యులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుచున్నదన్న విషయాన్ని ప్రసూతి వైద్యులు నిరంతరం గుర్తించుకోవాల్సిన విషయం అన్నారు. ఏ తల్లి కూడా బిడ్డకు జన్మనిచ్చి చనిపోకూడదని, జన్మించిన ప్రతిబిడ్డ ఆరోగ్యవంతంగా పెరిగేందుకు వైద్యుల కృషి ఎంతో అవసరం అన్నారు. ప్రభుత్వం తల్లి, పిల్లల ఆరోగ్యం కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నదని, తల్లి గర్భం దాల్చిన నాటి నుండి బిడ్డ పెరిగి ఐదు సంవత్సరాల వయసు వచ్చేవరకు పౌష్టిక ఆహారాన్ని, ఆనారోగ్యంగా ఉన్నవారికి ఖరీదైన మందులను ఉచితంగా అందజేస్తున్నదన్నారు. వీటన్నింటికీ తోడు నిర్ణీత కాలంలో పర్యవేక్షణతో కూడిన వైద్యాన్ని అందించాల్సిన బాధ్యత వైద్యులకు, సిబ్బందికి ఉందన్నారు. మన కుటుంబంలోనే ఏదైనా జరిగితే ఎంత ఆవేదనకు గురి అవుతామో ఆయా సందర్భాలను వైద్యం నిర్వహించేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నేను జిల్లా కలెక్టర్ గా చార్జి తీసుకున్ననాటి నుండి ప్రతినెల వైద్య, ఆరోగ్య మరియు స్త్రీ, శిశు సంక్షేమ శాఖలను సమీక్షిస్తున్న, క్షేత్రస్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేస్తూనే ఉన్నా మాతా, శిశు మరణాలు కేసులు ఎందుకు నమోదు అవుతున్నాయని గట్టిగా ప్రశ్నించారు. ప్రతి తల్లి, ప్రతి బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడానికే ప్రభుత్వం ఇంతమంది సిబ్బందిని నియమించడం జరిగిందని, గర్భం దాల్చిన నాటి నుండే అవసరమైన పరీక్షల నిర్వహించి, సూచనలు సలహాలను అందజేయడం, పౌష్టికాహారాన్ని తీసుకునేలా చూడడం మీ బాధ్యత కాదా అని గట్టిగా గద్దించారు. విద్య, వైద్యం, అవగాహనలో చైతన్యం కలిగిన జిల్లా మనదని, ఇక్కడే మాతృ, శిశు మరణాలు ఉంటే ఎలా అని ప్రశ్నించారు. 2024 – 25 సంవత్సరంలో జిల్లాలో మొత్తం ఎనిమిది మాతృమరణాలు, 88 శిశు మరణాలు సంభవించాయి. 2024 – 25 నాల్గవ క్వార్టర్ లో ఐదు మాతృ మరణాలు, రెండు శిశు మరణాలపై క్షుణ్ణంగా ఈరోజు సమీక్షించడం జరిగింది. ఒకటి, రెండు కేసుల్లో వైద్యం అందించే క్రమంలో కొంత నిర్లిప్తత కానవస్తుందన్నారు. మాతృ మరణాలను సమీక్షిస్తున్న సమయంలో జిల్లా కలెక్టర్ కొత్త ఉగ్వేదానికి గురయ్యారు. ఇటువంటి సంఘటనలు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లు వైద్యం అందించడంలో మరింత శ్రద్ధ వహించాలని ఆదేశించారు. గణపవరం మండలం వరదరాజపురం గ్రామం ఆచంట సుజాత (28), యలమంచిలి మండలం ఆర్య పేట గ్రామం సిర్ర షారోన్ డైసీ (27), తాడేపల్లిగూడెం మండలం కొమ్ముగూడెం గ్రామం గెడ్డం సువర్ణ మేరీ (18), తాడేపల్లిగూడెం శివాలయం వీధి మర్రిపూడి రాజేశ్వరి (26), పెంటపాడు మండలం ఆకు తీగపాడు గ్రామం సోమిశెట్టి పద్మ నాగ వెంకటలక్ష్మి (32) మాతృ మరణాలను, తాడేపల్లిగూడెం 16వ వార్డు షేక్ సోహైల్, తాడేపల్లిగూడెం వెంకటరామన్నగూడెం ఒకరోజు శిశువు మరణాలపై సమీక్షించారు. ఆచంట సుజాత మరణించిన కేసుకు సంబంధించి ప్రభుత్వ వైద్య సిబ్బందికి షోకాజ్ నోటీసులు, ప్రైవేట్ నర్సింగ్ హోమ్ కు నోటీసు జారీ చేయాలని డిఎంహెచ్ఓ ను ఆదేశించారు. షేక్ సోహైల్ బాలుడు మరణించిన కేసులో ఫిట్స్ వస్తున్నప్పుడు మరింత జాగ్రత్తగా వైద్యం చేయవలసిన పరిస్థితి కానవచ్చినదని, ఈ కేసులో వారి కుటుంబ సభ్యుల్ని కూడా పిలిపించాలని, బాలుని మరణానికి దారి తీసిన పరిణామాలపై తదుపరి సమీక్షించడం జరుగుతుందని తెలిపారు.
ఈ సమావేశంలో డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ జి.గీతా బాయి, కమిటీ సభ్యులు ఐసీడీఎస్ పిడి బి.సుజాత రాణి, డి సి హెచ్ ఎస్ డాక్టర్ ఎం.సూర్యనారాయణ, డి ఏ ఓ డాక్టర్ దేవ సుధాలక్ష్మి, గైనకాలజిస్ట్ డాక్టర్ మాధవి కళ్యాణి, ఫిజీషియన్ డాక్టర్ సి.పద్మ, ఫోగ్సి డాక్టర్ ఐ.లక్ష్మి, డిఎం అండ్ హెచ్ ఓ కార్యాలయం డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ ప్రసాదరావు, డి పి హెచ్ ఎన్ ఓ జి.వెంకటరత్నం, ఎస్ఓ ఎం.ఎస్ ప్రసాద్ రావు, ప్రైవేటు నర్సింగ్ హోమ్ కు సంబంధించిన ప్రసూతి వైద్యులు, బాధిత కుటుంబాలు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.