Close

ప్రభుత్వ పాఠశాలల్లో సుశిక్షితులైన ఉపాధ్యాయులచే విద్యను నేర్చుకుని మంచి ప్రయోజకుల కావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు

Publish Date : 22/04/2025

సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధనపై శిక్షణ పొందిన ఉపాధ్యాయులు మాత్రమే ఉంటారని, నిర్ణీత విద్యా అర్హతలతో పాటు పోటీ పరీక్షలు నందు అర్హత సాధిస్తేనే ఉపాధ్యాయులుగా పాఠశాలలో నియమించడం జరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే అన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో విద్యా అర్హతలు, పోటీ పరీక్షలు ప్రామాణికంగా ఉపాధ్యాయుల ఎంపిక ఉండదనే విషయాన్ని గ్రహించాలన్నారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయుల ద్వారా నేర్చుకున్న విద్య ఎంత ఫలితాలను ఇస్తుందో ఏళ్ల తరబడి చాలామందికి తెలిసిందే అనన్నారు. ప్రభుత్వ పాఠశాలలు మౌలిక వసతుల లేమితో ఉంటాయనే అపోహను విడనాడాలని, అన్ని ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన మౌలిక వసతులను ఏర్పాటు చేయడంతో పాటు, సుశిక్షితులైన ఉపాధ్యాయులను కూడా అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలోనే విద్యను ఎందుకు నేర్చుకోవాలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలన్నారు. మీ పిల్లల భవిష్యత్తుకు మానసిక శారీరక వికాసానికి, సర్వతో ముఖాభివృద్ధికి ఎంతో దోహదపడే ప్రభుత్వ పాఠశాలల్లో మీ పిల్లలను చేర్పించలన్నారు. ఒత్తిడి లేని నాణ్యమైన విద్యను అందించి మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేది ప్రభుత్వ పాఠశాలల్లోనే అన్నారు. ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్ ద్వారా డిజిటల్ విద్యాభోదన, స్మార్ట్ టీ.వి.ల ద్వారా డిజిటల్ కంటెంట్ అందించడంతోపాటు అత్యాధునిక ఆట స్థలాలు మరియు ఇండోర్ కోర్టులు కూడా సమకూర్చడం జరిగిందన్నారు. మ్యాథ్స్ ల్యాబ్లు ద్వారా ఉత్తమ శిక్షణ, సైన్స్ ప్రయోగాలు, ఎన్సిసి, స్కౌట్స్ & గైడ్స్లో శిక్షణ, విద్యార్థినులకు ఆత్మపరిరక్షణ (కరాటే) శిక్షణ వీటి ద్వారా విద్యార్థులకు ఆత్మస్థైర్యం, మంచి ఆరోగ్యం, దేహదారిడ్యo సమకూరతాన్నారు. అలాగే ప్రత్యేక అవసరములు కలిగిన పిల్లలకు సహిత విద్య మరియు అవసరమగు ఉపకరణములు పంపిణి, తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమావేశాల ద్వారా విద్యార్ధుల ప్రగతిని నివేదించుట ఇంకా మరెన్నో ప్రత్యేకతలు నేడు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాయన్నారు.

ఉచిత విద్య, రానున్న మాసాలలో తల్లికి వందనం ద్వారా ప్రతీ విద్యార్థికి రూ.15,000/-, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పధకం ద్వారా పోషక విలువలుతో కూడిన ఆహారం, డా॥ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్ర ద్వారా 3 జతల యూనిఫాం, స్కూల్ బ్యాగ్లు, షూస్, సాక్స్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, బెల్టు, స్వచ్ఛమైన ఆర్.ఓ నీటి సదుపాయం, ఆధునిక మరుగుదొడ్లు, రక్తహీనత నివారణకు రాగిజావ, చిక్కీలు, నెలకు ఒకసారి వైద్య పరీక్షలు, ఐరన్, పోలిక్ మాత్రలు మరియు నులి పురుగుల నివారణ కొరకు మాత్రలు, తదితర సౌకర్యాలను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుందన్నారు. తల్లిదండ్రులకు ఆర్థిక ఒత్తిడి లేని నాణ్యమైన విద్యను అందించే ధ్యేయంతో ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నాయని, జిల్లా యంత్రాంగం పర్యవేక్షణ కూడా దీనికి నిరంతరం తోడు ఉంటుందని జిల్లా కలెక్టర్ తెలిపారు.

గోడ పత్రికను ఆవిష్కరణలో జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ పాల్గొన్నారు.