చెత్త నియంత్రణ, నిర్మూలన ద్వారా మన ఆరోగ్యాలను మనమే కాపాడుకునే అంతగా ప్రజలు చైతన్యవంతులు కావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ నగరాలు, గ్రామాలుగా రూపుదిద్దేందుకు చేపట్టిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రతి మాసం మూడో శనివారం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ మూడో శనివారం ఇ- వెస్ట్ అనే థీమ్ తో నిర్వహిస్తోంది.
శనివారం తాడేపల్లిగూడెం నాలుగవ వార్డు అమ్మ కళ్యాణ వేదిక నందు ఇ – వేస్ట్ అవగాహన కార్యక్రమంలో, 14వ వార్డు బి.ఆర్ మార్కెట్ నందు తడి చెత్తను కంపోస్ట్ గా మార్చే పక్రియ పరిశీలన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ సంయుక్తంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాలుగవ వార్డు నందు ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ మహిళలు చాలా చైతన్యవంతులు, శక్తివంతులు అని ఏ కార్యక్రమాన్ని చేపట్టిన దిగ్విజయంగా పూర్తి చేయగలరన్నారు. అలాగే ప్రభుత్వం సంకల్పించిన స్వచ్ఛత కార్యక్రమంలో పూర్తిస్థాయిలో భాగస్వామ్యులు కావాలన్నారు. మహిళలు శ్రద్ధ తీసుకుని పొడి, తడి చెత్తలను ఇంటి వద్దనే వేరు చేసి ఇచ్చే బాధ్యతను సక్రమంగా నిర్వహించాలన్నారు. చిన్నప్పటినుండి పిల్లలకు కూడా చెత్త నిర్వాహణపై అవగాహన చేయాలన్నారు. ఇళ్లు, కార్యాలయాలు, వాణిజ్య, వ్యాపార సంస్థల్లో పాడైన ఎలక్ట్రానిక్ పరికరాలు, వస్తువులను శాస్త్రీయ పద్ధతుల్లో తొలగించడం ఎంతో ముఖ్యమన్నారు. ఇ – వ్యర్ధాలను సరైన రీతిలో తొలగించకపోతే వాటి నుంచి వెలువడే రసాయనాలు పిల్లలు, గర్భిణీలకు ఎంతో ప్రమాదకరంగా పరిణమిస్తాయని అన్నారు. ఇ-వ్యర్ధాలను శాస్త్రీయ విధానంలో తొలగించనట్లయితే వాటి నుంచి వెయ్యి రకాల ప్రమాదకర రసాయనాలు వెలువడతాయని, వాటిని పీల్చిన గర్భిణీలకు, వారి గర్భంలోని శిశువుకు ఇవి ఎంతో హానికలిగిస్తాయన్నారు. ప్రజల్లో ఇ-వ్యర్ధాల పై అవగాహన తక్కువగా వుందని, ఈ లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇ- వ్యర్ధాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం, వాటిని సేకరించి శాస్త్రీయ పద్ధతుల్లో తొలగించేందుకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రజలు తమ ఇళ్లలోని పాడైన ఎలక్ట్రానిక్ పరికరాలు, వ్యర్ధాలను మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇ-వ్యర్ధాల సేకరణ కేంద్రంలో అందజేస్తే ఇవ్వడంతో పాటు, వాటిని సరైన రీతిలో రీసైక్లింగ్ చేసి ముప్పు లేకుండా తొలగించడం జరుగుతుందన్నారు. ప్రజలు స్వచ్ఛ తాడేపల్లిగూడెంగా రూపుదిద్దుకునేందుకు అభివృద్ధిలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ కోరారు.
తాడేపల్లిగూడెం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ చెత్త నిర్మూలనకు దేశానికి మనమేదో చేస్తున్నామని భావించకుండా, మన బాధ్యతగా అనుకున్నప్పుడే లక్ష్యాన్ని సాధించగలుగుతామన్నారు. కాలువలు, చెరువులలో చెత్త వేయడం వాటిని తిన్న చేపలను మనం తినడం వలన అనారోగ్యం పాలవుతున్నామన్న విషయాన్ని గ్రహించాలన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ప్లాస్టిక్ నిర్మూలనకు చర్యలు చేపట్టిందని, క్యాన్సర్ తదితర అనారోగ్యాలకు గురికాకుండా ముందే జాగ్రత్త పడాలన్నారు. మహిళలు కుటుంబాన్ని నడిపినట్లే రాష్ట్రాన్ని దేశాన్ని సరైన మార్గంలో నడిపించడానికి సహకారం అందించాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 2022 నాటికి 8 కోట్ల టన్నుల ఇ-వ్యర్ధాలు వున్నట్టు ప్రపంచ ఆరోగ్యసంస్థ తన నివేదికలో వెల్లడించిందని, ఇందులో ఇరవై మిలియన్ టన్నులు మాత్రమే రీసైక్లింగ్ జరుగుతున్నట్టు పేర్కొందని తెలిపారు. మిగిలిన ఇ-వ్యర్ధాలన్నీ అశాస్త్రీయ విధానంలోనే తొలగించడం జరుగుతోందని, ఇది మానవాళి మనుగడకే ప్రమాదకరమన్నారు. ఇ-వ్యర్ధాలు, ప్లాస్టిక్ బాటిల్స్ కొనుగోలుకు మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, వాటి ద్వారా విక్రయించి కొంత నగదును కూడా పొందవచ్చు తెలిపారు. గృహాలలో చెత్త నిర్వహణ సక్రమంగా లేని కారణంగా కోట్లాది రూపాయలను చెత్తను తరలించడానికి, నిర్మూలించడానికి ఖర్చు చేయడం జరుగుతుందని, ఇది అంతా మీరు చెల్లించిన పన్నులేనన్న విషయం గ్రహించాలన్నారు. రాష్ట్ర సంపద, రాష్ట్ర ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉన్నాయని స్పష్టం చేశారు.