Close

బాలలతో బిక్షాటన చేయించిన, ఇతర పనులకు వినియోగించిన కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి హెచ్చరించారు.

Publish Date : 09/04/2025

మంగళవారం జిల్లా కలెక్టరేట్ క్యాంపు కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లా బాలల సంరక్షణ అధికారి, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ లతో సమావేశమై బాలల సంరక్షణ పై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడైనా బాలలను భిక్షాటనకు వినియోగిస్తే తీవ్రమైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం బాలల సంక్షేమానికి కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నదని, ఇటువంటి చర్యలు ఉపేక్షించేది లేదన్నారు. అలాగే ప్రతి ఒక్క బాల బాలికలను విధిగా పాఠశాలలో చదివించాలని, ప్రభుత్వం బాలలకు మంచి విద్యను అందించడంతోపాటు, పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం కూడా అందించడం జరుగుతుందని తెలిపారు. తల్లిదండ్రులపై పిల్లల ఆర్థిక భారం పడకూడదని ఆలోచన చేసిన ప్రభుత్వం ఉచిత విద్య, పుస్తకాలు, యూనిఫామ్, మధ్యాహ్న భోజనం, పాఠశాలల్లో మంచి మౌలిక వసతులను కూడా కల్పించడం జరిగిందని, ఇన్ని సౌకర్యాలు, సహాయం ప్రభుత్వం నుండి అందుచున్న విషయాన్ని ప్రతి ఒక్క తల్లిదండ్రులు గ్రహించి పిల్లలను పాఠశాలలకు పంపి బాగా చదివించాలని, వేరే పనులలో పిల్లలను పెట్టకూడదని సూచించారు. వేరే పనులకు పిల్లలను వినియోగిస్తే చట్టపరంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జిల్లాలో 18 సంవత్సరాల లోపు బాలలతో భిక్షాటన చేయించినట్లుగా కనిపిస్తే వెంటనే 1098 చైల్డ్ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ కు గాని, నాన్ ఇన్స్టిట్యూషనల్ కేర్ డి.సి.పి.యు ప్రొటెక్షన్ ఆఫీసర్ బి.నెహెమ్యా సెల్ నెంబర్ 9391975617 కు సమాచారాన్ని అందించాలని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా ఎవరైనా బాలలతో భిక్షాటన చేస్తున్నట్లుగా కనిపిస్తే వెంటనే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

జిల్లా స్త్రీ,శిశు సంక్షేమ శాఖ అధికారి సుజాత రాణి మాట్లాడుతూ ఇటీవల జిల్లా బాలల సంరక్షణ కార్యాలయము, పోలీసు సిబ్బంది కలిసి ప్రత్యేక రెస్క్యూ డ్రైవ్ ద్వారా 14 మంది భిక్షాటన చేస్తున్న బాలలను గుర్తించి బాలల సంక్షేమ సమితి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వారి మౌఖిక ఆదేశాల మేరకు లైసెన్సు పొందిన ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర సంస్థలలో తాత్కాలిక వసతి కల్పించడం జరిగిందని వివరించారు.

జిల్లా బాలల సంరక్షణ అధికారి ఆర్ రాజేష్ జిల్లాలో భిక్షాటన చేస్తున్న, ర్యాప్పీకింగ్ చేస్తున్న 14 మంది బాలల యొక్క వివరాలను తెలియజేస్తూ బాలల సంక్షేమ సమితి వారు ఇచ్చిన సోషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టు ఆర్డర్ ఆధారంగా జిల్లా బాలల సంరక్షణ కార్యాలయము సిబ్బంది ద్వారా హోమ్ ఎంక్వయిరీ నిర్వహించి నివేదికను బాలల సంక్షేమ సమితికి సమర్పించడం జరుగుతుందని, సోషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టు ఆధారంగా బాలల సంక్షేమ సమితి బాలల భవిష్యత్తు దృష్ట్యా తదుపరి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

ఈ సమావేశంలో బాలల సంక్షేమ సమితి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సభ్యులు పి.వెంకటేశ్వరరావు, సి.హెచ్. రాజేశ్వర రావు ఈ సమావేశంలో పాల్గొన్నారు.