Close

ట్రాన్స్ జెండర్స్ సామాజిక పింఛన్లను సద్వినియోగం చేసుకొని, ప్రభుత్వం కల్పిస్తున అవకాశాలతో మెరుగైన జీవనాన్ని కొనసాగించాలని మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖల ప్రభుత్వ కార్యదర్శి మరియు పశ్చిమ గోదావరి జిల్లా ప్రత్యేక అధికారి ఎ.సూర్య కుమారి అన్నారు.

Publish Date : 01/04/2025

మంగళవారం భీమవరం పట్టణం దుర్గాపురం, పాలకోడేరు మండలం గొల్లల కోడేరు గ్రామాల్లో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా ప్రత్యేక అధికారి ఏ.సూర్యకుమారి, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి ఏ.సూర్యకుమారి పెన్షనర్లతో పేరుపేరునా మాట్లాడుతూ వారి యోగక్షేమాలను, కుటుంబ వివరాలు, చదువుకుంటున్నవారి వివరాలు, ఏమేమి పనులు చేస్తున్నారు, స్వయం సహాయక సంఘాల గ్రూపులలో సభ్యులుగా ఉన్నారా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. తొలుత భీమవరం పట్టణం దుర్గాపురంలో ట్రాన్స్ జెండర్ కు పెన్షన్ అందజేస్తున్న సందర్భంలో ట్రాన్స్ జెండర్ సర్టిఫికెట్ ఉందా, మీరు ఏం పని చేస్తున్నారు అడుగుతూ, ప్రభుత్వం అందజేస్తున్న సామాజిక పింఛను సద్వినియోగం చేసుకొని, అదనపు ఆదాయంగా సంఘంలో గౌరవప్రదమైన పనులను చేస్తూ జీవనాన్ని గడపాలని సూచించారు. యాచక వృత్తిని ఇక మీదట కొనసాగించవద్దని సున్నితంగా మందలించారు. మానసిక వికలాంగత్వంతో బాధపడుతున్న యువకుడును ఆప్యాయంగా పలకరిస్తూ ఆహ్లాదపరిచారు. కిడ్నీ వ్యాధితో డయాలసిస్ చేయించుకున్న మహిళతో ఆరోగ్య విషయమై ఆరా తీశారు. అనంతరం పాలకోడేరు మండలం గొల్లల కోడేరు గ్రామంలో పింఛన్లు పంపిణీ చేస్తున్న సందర్భంలో మహిళలతో మాట్లాడుతూ ఏం పనులు చేస్తున్నారు, పింఛన్ల మొత్తాన్ని ఎలా సద్విని చేసుకుంటున్నారు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం పింఛన్లను పెద్ద మొత్తంలో పెంచి వారికి అండగా నిలిచిందన్నారు. అవసరమైన మేరకు వినియోగించుకొని కొంతైనా అవసరాల కోసం దాచుకోవాలని సూచించారు.

జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో ఏప్రిల్ 1న ఎన్టీఆర్ భద్రతా పింఛన్ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.96.87 కోట్లు విడుదల చేయడం జరిగిందని, వీటిని 2,25,718 మంది లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందన్నారు. పెన్షన్ల పంపిణీ ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు ఆత్మీయ పలకరింపు వాయిస్ వినిపించిన తర్వాతనే లబ్దిదారులకు పెన్షన్లు అందించాలన్నారు. జిల్లాలో పది సచివాలయాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం జరిగిందని, దీనిలో ఐదు పట్టణాల్లోని వార్డు సచివాలయాలు, మరో ఐదు గ్రామ సచివాలయాలు ఉన్నాయన్నారు. చంద్రబాబు వాయిస్ తో పెన్షన్ దారిని వివరాలు, ఎంతపెన్షన్ ఇస్తున్నారు, తదితర సమాచారం లబ్దిదారునికి వినిపించి అనంతరం పెన్షన్ అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. పెన్షన్ల పంపిణీలో ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా సకాలంలో పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ సందర్భంలో డి ఆర్ డి ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం ఎస్ ఎస్ వేణుగోపాల్, భీమవరం మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, డి ఆర్ డీ ఏ ఏపీవో పెన్షన్స్ మురళీకృష్ణ, సచివాలయ సిబ్బంది, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.