ప్రతి ఒక్క ముస్లిం భక్తి, శ్రద్ధలతో ఆత్మను, శరీరాన్ని శుద్ధి చేసుకుంటూ, పేద ప్రజలకు దానధర్మాలను అవలంబించడం పవిత్ర రంజాన్ మాసం ప్రతీక అని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

గురువారం జిల్లా మైనారిటీస్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రంజాన్ పరిష్కరించుకుని భీమవరం యల్.హెచ్.టౌన్ హాల్ నందు నిర్వహించిన “ఇఫ్తార్ విందు” కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, స్థానిక శాసనసభ్యులు మరియు రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ముస్లింలకు అత్యంత పవిత్రమైనది రంజాన్ మాసం అని, కఠినమైన ఉపవాస దీక్షతో శరీరాన్ని, ఆత్మని శుద్ధి చేసుకోవడంతో పాటు, పేదలకు సహాయంగా దానధర్మాలను చేయడం రంజాన్ మాసం విశిష్టత అన్నారు. ప్రతి ఒక్క ముస్లింకు మంచి జరగాలని, విద్యా, వ్యాపారం, ఉపాధిలో రాణించాలని ఆకాంక్షించారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడానికి ప్రతి ఒక్క ముస్లిం తోడ్పాటునందించాలని ఈ సందర్భంగా కోరారు. జిల్లాలోని ముస్లింలు అందరికీ రంజాన్ పర్వదినాల సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలను జిల్లా కలెక్టర్ తెలిపారు.
భీమవరం శాసనసభ్యులు మరియు రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ నెలరోజులు దీక్షలో పవిత్ర రంజాన్ మాసాన్ని ఆచరించడం జరుగుతుందని, అల్లా ఆశీస్సులతో ముస్లింలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నానన్నారు. అలాగే ముస్లింలకు అల్లా ఆశీస్సులు మెండుగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో హిందూ, ముస్లిం సత్సంబంధాలతో మెలుగుతున్నారని, ఎల్లప్పుడు ఇలాగే కలిసి ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు. రంజాన్ మాసంలో ముస్లింలు స్వీయనియంత్రణతో అత్యంత భక్తిశ్రద్ధల మధ్య ఉపవాస దీక్షను కొనసాగిస్తారన్నారు. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉండాలని, వ్యాపారాలు మంచిగా అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.
ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, జిల్లా మైనార్టీ కార్పొరేషన్ అధికారి ఎన్.ఎస్ కృపా వర్మ, సూపరింటెండెంట్ శేషుమూర్తి, రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు నౌషర్ , కార్యదర్శి జాకీర్ ,జిల్లా మైనార్టీ అధ్యక్షులు మహబూబ్ ఆలీ జానీ, సెక్రటరీ షాబు, నియోజకవర్గం అధ్యక్షులు ఖాలీలు, ఎస్.నసీమా బేగం, ఎండి షబీనా, నసీమా షబీనా ఫిరోజ్, షేక్ రబ్బాని ఆజాహాద్,ఏ పి ఎస్ ఆర్ టి సి మాజీ చైర్మన్ మెంటే పార్థసారథి, మాజీ ఏఎంసీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.
…………………………………………….