Close

జాతీయ పశువ్యాధి నియంత్రణ పధకమును పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు.

Publish Date : 01/03/2025

శనివారం తాడేపల్లిగూడెం మండలం నవాబుపాలెంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన జాతీయ పశువ్యాధి నియంత్రణ పధకమును జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి లాంఛనంగా ప్రారంభించారు. పశువులకు వేస్తున్న టీకాలను జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో 1,86,800 ఆవులు, గేదలు ఉన్నాయని, వీటికి మార్చి ఒకటి నుండి మార్చి 30 వరకు గాలి కుంటు వ్యాధి నిరోధక టీకాలు, 3వ విడతగా 9,300 పెయ్య దూడలకు బ్రుసెల్లోసిస్ వ్యాధి నిరోధక టీకాలను అందజేయడం జరుగుతుందన్నారు. జిల్లలోని పశుపోషకులందరు పశువులకు టీకాలు తప్పక వేయించాలన్నారు. మనదేశములో పశువులకు 2030వ సంవత్సరము నాటికీ గాలి కుంటు వ్యాధిని సమూలంగా నిర్మూలించాలని లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ పశువ్యాధి నియంత్రణ పధకమును ప్రవేశపెట్టి పశువులకు టీకాలను అందజేయడం జరుగుతుందన్నారు.

గాలి కుంటు వ్యాధి నిరోధక టీకాల వలన కలిగే లాభాలు:

వ్యాధి సోకిన పశువుల్లో తగ్గే పాల ఉత్పత్తిని శాశ్వతంగా నివారించవచ్చు, వ్యాధి సోకిన మగ పశువుల్లో తగ్గే పని సామర్ధ్యాన్ని పూర్తిగా అరికట్టవచ్చు, దూడల్లో మరణాలు తగ్గించి, ఆరోగ్యంగా ఎదగడనికి ఉపయోగపడుతుందన్నారు. తీవ్రమైన జ్వరం మరియు నీరసం, నోటినుండి తీగల మాదిరి చొంగ, నోరు మరియు కలి గిట్టల మద్య పుండ్లు, కొద్దిపాటి ఎండకు కూడా రోప్పటం, చూడి పశువులు ఈసుకు పోవడం వ్యాధి లక్షణాలు అన్నారు. ఈ వ్యాధి కారణంగా పాల ఉత్పత్తి మరియు పని సామర్ధ్యం గణ నీయంగా తగ్గిపోవడం వలన రైతుకు ఆర్ధిక నష్టం, పాలు త్రాగే దూడల్లో మరణాలు సంభవించడం, వైద్యం నిర్లక్ష్యం చేస్తే పశువులు చనిపోయి నష్టపోవడం జరుగుతుందన్నారు.

బ్రుసెల్లోసిస్ వ్యాధి నియంత్రణ పధకము

ఈవ్యాధి లక్షణాలు సోకిన పశువుల గర్భస్రావాలు, మాయ మరియు పాల ద్వారా ఇతర జంతువులకు వ్యాపిస్తుందని, వ్యాధి సోకిన పశువుల నుండి మనుషులకు సోకుతుందన్నారు. నివారణ, నియంత్రణలకు జిల్లా పశుసంవర్ధక శాఖ వారు జిల్లాలోని అన్ని పశువులకు పశువైద్య శాలలో మరియు పశుపోషకుని ఇంటి వద్దనే సంవత్సరానికి మూడు విడతలుగా ఉచితంగా బ్రుసెల్లోసిస్ వ్యాధి నిరోధక టీకాలు వేయటం జరుగుతుందన్నారు. 4-8 నెలల వయస్సు గల పెయ్య దూడలకు తప్పనిసరిగా టీకా వేయించాలన్నారు. పాలను ఎల్లపుడూ బాగా మరిగించి వినియోగించుకోవాలన్నారు. వ్యాధి గ్రస్థ పశువు మిగిల్చిన మేత, గర్భస్రావ మట్టు, మాయ, పిండాలను గొయ్యి తీసి పూడ్చి పెట్టాలన్నారు. బ్రుసెల్లోసిస్ వ్యాధికి చికిత్స లేదని, నివారణకు టీకా ఒక్కటే మార్గం అన్నారు.

ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఆర్డిఓ కతీబ్ కౌసర్ బానో, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి కె.మురళీకృష్ణ, తాడేపల్లిగూడెం డిడి డాక్టర్ సుధాకర్, ఏడి డాక్టర్ అనిల్, మాధవరం వి ఏ ఎస్ డాక్టర్ సునీల్, పట్టేంపాలెం వి ఏ ఎస్ డాక్టర్ విజయ్ కుమార్, తహసిల్దార్ సునీల్ కుమార్, సర్పంచ్ మద్దుకూరి గంగాభవాని, పశుపోషకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

 

1.11