Close

ప్రతి రెండు మూడు కుటుంబాల్లో క్యాన్సర్ కు ప్లాస్టిక్ ఒక కారణంగా ఉందని, ప్రజలు స్వచ్ఛందంగా ప్లాస్టిక్ నిర్మూలనకు ముందడుగు వేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

Publish Date : 15/02/2025

ప్లాస్టిక్ నిర్మూలనతో క్యాన్సర్ ను జయిద్దాం..

ప్రతి రెండు, మూడు కుటుంబాల్లో క్యాన్సర్ కి ప్లాస్టిక్ ఒక్క కారణంగా ఉంది…

ప్లాస్టిక్ వినియోగాన్ని రోజురోజుకు తగ్గించేందుకు ప్రజల సహకారం ఎంతో ముఖ్యం…

ప్లాస్టిక్ బదులుగా ప్రత్యామ్నాయ వస్తువులను అందుబాటులో ఉంచడం జరిగింది…

మీకోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం నేటి నుండే ప్లాస్టిక్ కి స్వస్తి చెప్పండి ..

శనివారం భీమవరం కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న ఎస్ జె జి ఎం హై స్కూల్ (కేశవరావు హై స్కూల్) ఆవరణలో “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా ఈ మూడో శనివారం “సోర్స్ – రిసోర్స్ అనే అంశంపై ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీమతి చదలవాడ నాగరాణి, భీమవరం మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంయుక్తంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఈరోజు క్లాత్ బ్యానర్ పై పెయింట్ చేసి ప్రదర్శించడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. ప్లాస్టిక్ మన ఆరోగ్యాన్ని ఎలా కబళిస్తుందో తెలిసికూడా దాని వైపే ముగ్గు చూపటం అవసరమా అని ప్రశ్నించారు? మన జిల్లాలో ముఖ్యంగా భీమవరం పరిసర ప్రాంత గ్రామాలలో ప్రతి రెండు, మూడు కుటుంబాల్లో ఒకరు క్యాన్సర్ పేషెంట్ కావడానికి ప్లాస్టిక్ కారణంగా ఉంది అనడంలో ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు మనం వెనక్కి తీసుకోలేనంతగా ఊరు, వాడ నిండిపోయాయన్నారు. దీని కారణంగా గాలి, నీరు, భూమి అన్ని కలుషితమై ప్రజలు, జంతువులు అనారోగ్యాల పాలు కావడం తెలుస్తూనే ఉందన్నారు. నాగరిక జీవనాన్ని అలవర్చుకున్న ప్లాస్టిక్ వినియోగంలో మాత్రం అనాగరికంగా వ్యవహరించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. సింగపూర్ లాంటి దేశాల ప్రజలు పరిశుభ్రతకు పాటిస్తున్న విధానాన్ని అలవర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇది మన కోసం చేస్తున్న కార్యక్రమమని, మన ఆరోగ్యాన్ని, మన పిల్లల భవిష్యత్తును నిర్దేశించే కార్యక్రమంగా ఆలోచన చేసి ఉద్యమ రూపంలో ముందడుగు వేయాలన్నారు. స్వచ్ఛంద సంస్థలు ప్లాస్టిక్ ను నిరోధించే అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేసి ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నారు. ఈ విషయమై ముందుకు వచ్చే ఎన్జీవోలు జిల్లా యంత్రాంగాన్ని సంప్రదించాలన్నారు. హోటల్స్, కర్రీ పాయింట్ లు, టీ షాపులు, ఫంక్షన్ హాల్స్ ప్లాస్టిక్ బదులుగా బయో వస్తువులను వినియోగించాలని, వాటిని నగరంలో అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. గత మూడు మాసాలుగా భీమవరం పట్టణంలో ప్లాస్టిక్ నిషేధించి పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని, వ్యాపారస్తులు ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలన్నారు. దీనిలో భాగంగా గత నెల రోజులుగా జిల్లా కలెక్టరేట్లో ప్లాస్టిక్ వస్తువులు స్థానంలో స్టీల్ వాటర్ బాటిల్స్, స్టీల్ ప్లేట్స్, స్టీల్ టీ కప్స్ వినియోగిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.

జిల్లా జాయింట్ కలెక్టర్ టిరాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 2014లో రెడ్ పోర్ట్ నుండి భారత ప్రధానమంత్రి స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ప్రకటించడం జరిగిందన్నారు. నాటి నుండి నేటి వరకు దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను చేపట్టి అమలు చేయడం జరుగుచున్నదన్నారు. ప్లాస్టిక్ కవర్లలో ఎవరైనా ఇచ్చిన తిరస్కరించాలని, అలాగే వినియోగదారులు సంచులు తీసుకురాకపోతే వస్తువులు అమ్మ వద్దని సూచించారు. ఏ అలవాటైనా మనసు మనిషి అలవర్చుకోవాలంటే 21 రోజులు పడుతుందని ఒక అధ్యయనంలో తేలిందన్నారు. ప్రతిరోజు మనం తెలిసో తెలియకో 5 గ్రాముల ప్లాస్టిక్ ను వివిధ మార్గాల ద్వారా తింటున్నామని, సంవత్సరానికి సుమారు 260 గ్రాములు మన కడుపులోకి వెళుతుందన్నారు. ప్లాస్టిక్ ని హరించుకునే శక్తి మానవులకు లేదన్నారు. అది మన కడుపులో ఒక వస్తువుగా మిగిలిపోతుందన్నారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టిన ప్రజల కోసం చేపడుతుందని, దీనిలో ఏ వ్యాపారుల ప్రయోజనాలు ఉండవు అనేది గ్రహించాలన్నారు.

కార్యక్రమానికి హాజరైన వారితో జిల్లా కలెక్టర్ స్వచ్ఛఆంధ్ర ప్రతిజ్ఞను చేయించారు. చివరగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా మహిళలకు గుడ్డ సంచులను, ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ వస్తువులను వ్యాపారస్తులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో భీమవరం మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, డిఆర్డిఏ పిడి ఎమ్ ఎస్ ఎస్ వేణుగోపాల్, శ్రీవిజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి, సంఘ సేవకులు కంతేటి రామరాజు, మున్సిపల్ సహాయ కమిషనర్ వెంకటేశ్వరరావు, ఏసిపి ఎం శ్రీలక్ష్మి,, మున్సిపల్, మెప్మా, డిఆర్డిఏ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

1.11    1.22