ప్లాస్టిక్ నిషేధంపై భీమవరం అంబేద్కర్ చౌక్ నందు అవగాహన మానవహారం నిర్వహణ…

నేటి నుండి (ఫిబ్రవరి 1) సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధం ..
భీమవరం పట్టణంలో అమలకు కట్టుదిట్టమైన చర్యలు…
నేటి నుండి ” ప్లాస్టిక్ వద్దు బ్రో ” క్యాంపెయిన్ కి శ్రీకారం…
ప్రజలు ప్లాస్టిక్ బదులుగా ప్రత్యామ్నాయ వస్తువులను వినియోగించాలి…
ఫిబ్రవరి 1 నుండి భీమవరం పట్టణం నందు సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ను నిషేధించి, అమలకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు.
శనివారం భీమవరం పట్టణం అంబేద్కర్ చౌక్ నందు ప్లాస్టిక్ నిషేధంపై ఏర్పాటుచేసిన అవగాహన మానవహారంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. తొలుత భారతీయ విద్యా భవన్, డి.ఎన్.ఆర్ కళాశాల ఎన్సిసి క్యాడెట్లు, ఎస్.ఆర్.కె.ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థినిలు, వార్డు సచివాలయాలు, మెప్మా, మున్సిపల్ కార్యాలయాల సిబ్బంది, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున మానవ మానవహారంగా ఏర్పడి ప్లాస్టిక్ నిషేధంపై సందేశాన్ని అందజేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి అందరి చేత ప్లాస్టిక్ నిషేధం పై సందేశాన్ని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నేటి నుండి “ప్లాస్టిక్ వద్దు బ్రో” క్యాంపెయిన్ కు శ్రీకారం చుట్టడం జరిగింది అన్నారు. ఫిబ్రవరి 1 నుండి భీమవరం పట్టణంలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధం అమలు చేస్తున్నామని, ఇప్పటికే పలుమార్లు ప్రకటనల ద్వారా తెలియజేయడం జరిగిందన్నారు. వ్యాపారస్తులు స్వచ్ఛందంగా ప్లాస్టిక్ నిషేధం అమలకు సహకరించాలని, ఉల్లంఘనకు పాల్పడే వారికి జరిమానాతో పాటు, నిబంధనల మేరకు చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇప్పటికే జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అమలకు శ్రీకారం చుట్టి వాటర్ బాటిల్స్, ప్లేట్స్, టీ కప్స్ స్టీల్ వస్తువులను వినియోగించడం జరుగుతుందన్నారు. అలాగే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, వేడుకల్లో, హోటల్స్ లో స్టీల్ ఐటమ్స్ మాత్రమే వినియోగించాలని సూచించారు. ప్లాస్టిక్ వాడి రోడ్లు, కాలువలలో వేయడం వలన జంతువులకు, ప్రజలకు, వాతావరణానికి తీవ్ర హాని చేస్తున్నాయని, క్యాన్సర్ కు కారణం అవుతున్నాయని అన్నారు. ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లు, వాటర్ బాటిల్స్ బదులుగా ప్రత్యామ్నాయ వస్తువులను వినియోగించాలని గట్టిగా నొక్కి చెప్పారు. ప్రతి ఒక్కరూ ఒక్క నెలను అమలు చేస్తే మార్పు అనేది దానంతట అదే వస్తుందని, మార్పు అనేది మన వద్దనుండే ప్రారంభం అవ్వాలన్నారు. ఈరోజు మానవహారంలో పాల్గొన్న చిన్నారులు వారి ఇంటి వద్దకు వెళ్లి వారి తల్లిదండ్రులకు ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను తెలియజేయాలన్నారు.
అనంతరం అంబేద్కర్ సర్కిల్ చుట్టుపక్కల ఉన్న షాపులలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పిస్తూ చైతన్యవంతులను చేశారు.
మానవహారంలో భీమవరం మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్ర రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ టి.త్రినాధరావు, శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి, కంతేటి వెంకటరాజు, రెడ్ క్రాస్ ప్రతినిధులు, వివిధ కళాశాలల విద్యార్థిని విద్యార్థులు, మునిసిపల్ సిబ్బంది , తదితరులు పాల్గొన్నారు.