ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఫిబ్రవరి 3న నోటిఫికేషన్

• షెడ్యూల్ విడుదలైన నాటి నుండే అమలులోకి వచ్చిన మోడల్ కోడ్
• జిల్లాలో 69,884 మంది పట్టబుద్రుల ఓటర్లు
• ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి
… జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
తూర్పు – పశ్చిమ గోదావరి జిల్లాల పట్టబద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఈ నెల 29న షెడ్యూల్ వెలువడినందున ఆ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమలులోనికి వచ్చిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
ఈ ఎన్నిక కోసం ఏలూరు జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారని, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాల డిఆర్ఓలు సహాయ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 3న ఏలూరు జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ విడుదల చేస్తారని, నామినేషన్ల స్వీరణ ఏలూరు కలెక్టరేట్ నందు ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 3.00 గంటల వరకు ఉంటుందని, ఫిబ్రవరి 10వ తేదీ ఆఖరు తేదీయని (ప్రభుత్వ సెలవు దినాలు మినహా), 11న స్క్రూటినీ, 13న ఉపసంహరణకు అవకాశం ఉందని తెలిపారు. ఫిబ్రవరి 27న ఎన్నిక ఉదయం 8 గంటల నుండి మద్యాహ్నం 4 గంటల వరకు జరుగుతుందని, ఓట్ల లెక్కింపు మార్చి 3న ఉంటుందని, మార్చి 8 లోపల ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని స్పష్టం చేసారు. ఎన్నికల నిర్వహణపై గురువారం అధికారులతో కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి పలు ఆదేశాలను జారీ చేసారు. ఎన్నికల కోడ్ సాధారణ ఎన్నికలకు ఉన్నట్లే ఉంటుందని, పొలిటికల్ ప్రతినిధుల అధికారిక కార్యక్రమాలు ఉండకూడదని, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయకూడదని, పొలిటికల్ పోస్టర్లు, ఫ్లెక్సీలు తొలగించాలని తెలిపారు. మోడల్ కోడ్ అమలు బృందాలు, ఎఫ్.ఎస్.టి బృందాలు పని చేస్తాయని తెలిపారు. రూట్ అధికారులు, సూక్ష్మ పరిశీలకులను నియమించి, వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ లను ఆర్.డి.ఓ లు గుర్తించాలని తెలిపారు. తహసిల్దార్లు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు వెంటనే తమ పరిదిలోనున్న పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి, అన్నిరకాల వసతులు ఉన్నవి లేనిది తనిఖీ చేసుకోవాలని తెలిపారు. వాహనాల కోసం, బాలెట్ బాక్స్ ల కోసం ఇండెంట్ పెట్టాలని తెలిపారు. బాలెట్ పేపర్ ద్వారా ఓటింగ్ జరుగుతుంది కావునా బాలెట్ బాక్స్ లను తనిఖీ చేసి ఆయిలింగ్ చేసి సిద్ధంగా ఉంచాలని తెలిపారు. జిల్లాలో 93 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, జిల్లాలోని 20 మండలాల్లో మొత్తం 69,884 మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారని, వారిలో 39,780 మంది పురుషులు కాగా, 30,103 మంది మహిళా ఓటర్లు, ఒక ట్రాన్స్ జెండర్ ఉన్నారని తెలిపారు. ఫారం-18లో గ్రాడ్యుయేట్ల పేర్లను చేర్చడానికి దరఖాస్తులను ఫిబ్రవరి 10, 2025 వరకు, అంటే నామినేషన్లు స్వీకరించడానికి చివరి తేదీ వరకు స్వీకరించవచ్చునని తెలిపారు.