స్వచ్ఛ పశ్చిమగోదావరి జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రజలభాగస్వామ్యం ఎంతో ముఖ్యమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
నేడు మూడోవ శనివారం “స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివాస్” కార్యక్రమం తెలుగు మాసంలో మొదటిగా భీమవరం ఆదర్శనగర్ పార్క్ నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, స్థానిక శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయలతో కలిసి సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలుత జిల్లా కలెక్టర్, శాసనసభ్యులు పార్కు నందు స్వయంగా చెత్తను తొలగించి శుభ్రపరిచారు. స్థానిక ప్రజలతో పరిశుభ్రతపై, ప్లాస్టిక్ ను నిరోధించడంపై పలు సూచనలు చేసి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ముందుగా మన గృహము, మన పరిసరాలు బాగుంటేనే ఆరోగ్యంగా ఉండగలమని, మన గృహాన్ని పరిశుభ్రంగా ఉంచుకున్నట్లే పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచినప్పుడే సమాజ ఆరోగ్యానికి దోహదపడుతుందన్నారు. పెళ్లిళ్లు, తదితర కార్యక్రమాలకు పెద్ద ఎత్తున డిస్పోజబుల్ వస్తువులను వినియోగించడం జరుగుతుందన్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా అరటి ఆకులు, చేతితో కుట్టిన ఇస్తర్లు, తదితర పర్యావరణానికి ముప్పు వాటిల్లని వస్తువులను వినియోగించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. భీమవరం పట్టణం ప్రపంచవ్యాప్తంగా పేరు గాంచిందని, ఇటువంటి పట్టణాన్ని ఆహ్లాదకరమైన వాతావరణంలో, ఆరోగ్యవంతంగా ఉంచేందుకు మీ వంతు బాధ్యతను నెరవేర్చాలన్నారు. అన్ని పనులు పారిశుద్ధ కార్మికులే చేయాలంటే సాధ్యమైన పని కాదని, సామాజిక బాధ్యతగా మన వంతు కృషి చేయాలని స్పష్టం చేశారు.
భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని గ్రామాలు, పట్టణాలను ప్రజల భాగస్వామ్యంతో పరిశుభ్రంగా ఉంచేందుకు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పరిశుభ్రత, ఆరోగ్యం ఓకే మాటగా, బాటగా ఉంటాయని, పరిశుభ్రతను వేరు చేస్తే అనారోగ్యం వెంటాడుతుందన్నారు. ప్రజలు పూర్తి అవగాహనతో పరిశుభ్రతను కలిసికట్టుగా చేపట్టి విజయవంతం చేయాలన్నారు.
కార్యక్రమం అనంతరం స్థానిక ప్రజలు, నాయకులు, ప్రభుత్వ శాఖల సిబ్బంది అందరితో శాసనసభ్యులు వనపర్తి రామాంజనేయులు స్వచ్ఛతపై ప్రతిజ్ఞను చేయించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కే.రామచంద్రారెడ్డి, స్థానిక నాయకులు కొప్పునీడి బాబి, రామ సత్యనారాయణ, స్థానిక పెద్దలు బి. వెంకటేశ్వరరావు, సిహెచ్ వెంకటరామరాజు, ఎం.కృష్ణంరాజు, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.