భూ సమస్యలపై దృష్టి సారించి, వీలైనంతవరకు తక్షణ పరిష్కారానికి దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు.
ఉండి మండలం పాందువ్వ గ్రామంలో గురువారం నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజల నుంచి వచ్చిన వినతులను కలెక్టర్ పరిశీలించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కోటిపల్లి వెంకటనారాయణ దరఖాస్తు అందజేస్తూ నాకు 50 సెంట్లు భూమి వాస్తవంగా ఉండాలని ప్రస్తుతం 44 సెంట్లు మాత్రమే లెక్కలోకి వస్తుందని నాకు సంబంధించిన ఆరు సెంట్లు భూమి బొడ్డుపల్లి చెన్నయ్య కు కలిసిందని, తగిన న్యాయం చేయాలని కోరారు. వేగ్నేశన లక్ష్మీ కుమారి, గండు లక్ష్మీ శారద, ఎస్.సుబ్బలక్ష్మి, కునాదరాజు రామకృష్ణరాజు, మాదాసు వెంకన్న తదితరులు అర్జీలను సమర్పిస్తూ మ్యూటేషన్ చేయాలని కోరారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సమస్యల శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, దీనిలో భాగంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు. వచ్చిన వినతుల్లో అవకాశం ఉన్నవాటిని తక్షణ పరిష్కారానికి ఆదేశించినట్లు తెలిపారు. గతంలో చేసిన రీ-సర్వే ప్రక్రియలో తప్పిదాలను దృష్టిలో ఉంచుకొని, ఈ సారి అలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్త వహిస్తామని పేర్కొన్నారు. వాటిని సరి చేసేందుకు వీలుగా రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నామని చెప్పారు. వీటిలో అధిక శాతం రిజిస్ట్రేషన్, రెవెన్యూ అంశాలకు సంబంధించే ఉన్నాయని తెలిపారు.
ఈ సదస్సులో భీమవరం ఆర్డీవో ప్రవీణ్ కుమార్ రెడ్డి, తహసిల్దార్ కె.నాగార్జున, ఎంపీడీవో ఎస్.రవీంద్ర, సెక్రటరీ బాడీ లక్ష్మి, ఎంపీటీసీ సాగిరాజు సుజాత, మండల సర్వేయర్ జి ఎం ఎస్ రత్నవల్లి, గ్రామ సర్వేయర్ కె.ఝాన్సీ రాణి, వ్యవసాయ అధికారి బి.సంధ్య, ఇతర మండల అధికారులు, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.