జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు.
జిల్లాలో గత నెల రోజుల నుండి ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ఎటువంటి అంటూ వ్యాధులు ప్రబలకుండా మెరుగైన పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లాలోని అన్ని తాగునీటి వనరులను క్లోరినేషన్ చేయడంతో పాటు, సూపర్ క్లోరినేషన్ కాన్సెప్ట్‌ను అవలంబించాలన్నారు. అన్ని కార్యకలాపాలు పిఆర్-వన్ యాప్‌లో అప్లోడ్ చేయాలన్నారు. అంటు వ్యాధులు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలన్నారు. లోతట్టు ప్రాంతాలలో నిలిచిపోయిన నీటిని తొలగించాలన్నారు. ఎక్కడ చెత్త పేరుకుపోకుండా చెత్త కుప్పలను వెంటనే తొలగించాలన్నారు. డ్రెయిన్లు యుద్ధ ప్రాతిపదికన శుభ్రపరిచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. దోమల నివారణకు అన్ని ప్రాంతాల్లో ఫాగింగ్ చేయడంతో పాటు ఆయిల్ బాల్స్ కూడా వినియోగించాలన్నారు. అన్ని ఎస్.డబ్ల్యూ.పి.సి షెడ్లను అక్టోబర్ 2 నాటికి అందుబాటులో తీసుకోవాలని సూచించారు. నీటి వనరులను కలుషితం కాకుండా చూడాలన్నారు. అన్ని నీటి ట్యాంకులు వెంటనే నూరు శాతం క్లోరినేషన్ చేయాలన్నారు. పైప్‌లైన్ లీకేజీలను వెంటనే అరికట్టాలన్నారు. నీటి పరీక్షలను ఖచ్చితంగా చేయాలన్నారు. బ్లీచింగ్, సున్నం, ఫినాయిల్ తగినంత పరిమాణంలో నిల్వలు ఉండేలా చూసుకోవాలన్నారు. అవసరమైతే ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా చేయాలన్నారు. ఆర్వో ప్లాంట్లను వెంటనే తనిఖీ చేయాలని ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శులందరూ ఆదేశాలను తప్పక పాటించాలన్నారు. ఈవో పిఆర్ఆర్డిలు, డివిజనల్ లెవెల్ పంచాయతి అధికారులు పంచాయతీల్లో చేపట్టే పారిశుద్ధ్య కార్యక్రమాలను పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలి జిల్లా కలెక్టర్ ఆదేశించారు.