62 ఏళ్ల వయసులో యువతలో చైతన్యం నింపేందుకు ఇందుకూరి విజయలక్ష్మి సైకిల్ యాత్ర అభినందనీయం… జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి,.

Publish Date : 23/10/2026
WhatsApp Image 2026-10-23 at 6.23.23 PM

62 ఏళ్ల వయసులో యువతలో చైతన్యం నింపేందుకు ఇందుకూరి విజయలక్ష్మి సైకిల్ యాత్ర అభినందనీయం… జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి,…

మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై విద్యార్థులు, యువతలో అవగాహన కల్పించేందుకు ఇందుకూరి విజయలక్ష్మి చేపట్టిన సైకిల్ యాత్రను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అభినందించారు. మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణం కోసం 62 ఏళ్ల వయసులో ఆమె చేపట్టిన ఈ యాత్ర స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

నషా ముక్త్ భారత్ ప్రచారంలో భాగంగా ఇందుకూరి విజయలక్ష్మి అక్టోబర్ 22న భీమవరంలోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద నుంచి తన సైకిల్ యాత్రను ప్రారంభించారు. భీమవరం నుంచి న్యూఢిల్లీ వరకు సుమారు 3,000 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణిస్తూ, మార్గమధ్యంలో కళాశాలలను సందర్శించి విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, ఆరోగ్యంపై దాని ప్రభావం, యువత భవిష్యత్తుపై పడే దుష్పరిణామాల గురించి అవగాహన కల్పించనున్నారు. ఈ యాత్రను డిసెంబర్ 10న న్యూఢిల్లీలో ముగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

యాత్ర ప్రారంభించిన మొదటి రోజే జిల్లాలోని సుమారు ఆరు కళాశాలలను సందర్శించి విద్యార్థులకు మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, తమ కుటుంబాలు మరియు సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని విద్యార్థులకు సందేశం అందించారు. ఈ యాత్ర ద్వారా సుమారు లక్ష మందిని కలిసి అవగాహన కల్పించాలని టార్గెట్ పెట్టుకున్నట్లుగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఇందుకూరి విజయలక్ష్మి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణిని కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆమెను అభినందిస్తూ, యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడేందుకు అవగాహన కార్యక్రమాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. సమాజ శ్రేయస్సు కోసం ఆమె చేపట్టిన సైకిల్ యాత్ర మరింత మందికి స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించారు.

మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత అని, విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఇతరులకు కూడా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.