40 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరూ తరచుగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలి.
క్యాన్సర్‌ను మొదటి దశలోనే గుర్తిస్తే పూర్తిగా నివారించవచ్చు.
క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని, ఇది దేశవ్యాప్తంగా అత్యంత వేగంగా పెరుగుతున్న జబ్బుగా మారిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని పురస్కరిం చుకొని బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాన్సర్ అవగాహన ర్యాలీకి జండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ అంబేద్కర్ విగ్రహం వద్దనుండి తహసిల్దార్ కార్యాలయం వరకు కొనసాగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో యన్ సి డి 4.0 క్యాన్సర్ స్క్రీనింగ్ లో ఇప్పటి వరకు 6,90,561 మందికి పరీక్షలు నిర్వహించగా, 13,450 మంది ఓరల్ క్యాన్సర్ సస్పెక్ట్స్ ని గుర్తించామని, 8,134 మందికి బ్రెస్ట్ క్యాన్సర్ సస్పెక్ట్స్ గుర్తించామని, 10,018 సరివికల్ క్యాన్సర్ సస్పెక్ట్స్ ని గుర్తించామని తెలిపారు. క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా క్యాన్సర్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రతి సంవత్సరం క్యాన్సర్ బారిన పడి వందలాదిమంది ప్రజలు మరణిస్తున్నారని, ప్రస్తుత శాస్త్ర, సాంకేతికత అభివృద్ధి వల్ల వివిధ రకాల క్యాన్సర్ వ్యాధులకు వైద్యం సాధ్యమవుతుందని కలెక్టర్ తెలిపారు. రోగిలో క్యాన్సర్ వ్యాధిని ముందుగానే కనుగొన్నట్లయితే సకాలంలో చికిత్స చేసి వారి విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చు అన్నారు. ప్రజలు అప్రమత్తతతో ఉండాలని, 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు తరచూ క్యాన్సర్ నిర్ధారీత పరీక్షలు చేయించుకోవాలన్నారు. క్యాన్సర్ నిర్ధారణ అయిన రోగి ఆందోళన చెందకుండా వైద్య సిబ్బందిని సంప్రదించి చికిత్స పొందాలని కలెక్టర్ సూచించారు. క్యాన్సర్ రోగికి తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు ధైర్యం చెప్పి ఆత్మస్థైర్యాన్ని పెంచాలన్నారు. ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఎన్సీడీ సర్వేలు చేస్తుందని, క్యాన్సర్ రోగులను గుర్తించి వారికి సకాలంలో వైద్యం చేసేందుకు కృషి చేస్తోందని కలెక్టర్ తెలిపారు.
ఈ అవగాహన ర్యాలీలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.గీత బాయి, యన్ సి డి ప్రోగ్రాం ఆఫీసర్ డా.కె.ఎం.ఆర్ .కిషోర్, డి.ఎం.ఓ డా.క్రాంతి, ఎ.ఓ డా.భావన, జిల్లా ఎపిడెమోలోజిస్ట్ జి.సుభాష్ , డెమో సెక్షన్ సిబ్బంది, పట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్య అధికారులు, ఆరోగ్య సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.