Close

22, 23 తేదీలలో వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి–.జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 21/12/2025

పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయించేందుకు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

పెద్దఅమీరం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన పల్స్ పోలియో శిబిరంలో ఆదివారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నేడు జిల్లా వ్యాప్తంగా 5 సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు అందించే కార్యక్రమం ఉదయం 7.00 గంటల నుండి ప్రారంభమైందన్నారు. జిల్లాలో 0-5 సంవత్సరాల వయసు గల 1,87,204 పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు 1,315 పోలియో బూత్‌ల‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు 5,520 మంది ఉద్యోగులకు విధులు కేటాయించడం జరిగిందన్నారు. అదేవిధంగా బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్ల వద్ద కూడా పల్స్ పోలియో శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నేడు పల్స్ పోలియో రోజున ఏ కారణం చేత అయినా తల్లిదండ్రులు పిల్లలకు పోలియో చుక్కలు వేయించకపోతే 22, 23 తేదీల్లో వైద్య సిబ్బంది ఇంటింటికి వస్తారని ఆరోజు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలన్నారు. జిల్లాలో 2009 నుండి ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదు అన్నారు. భారతదేశంలో ఎక్కడ కూడా పోలియో కేసులు నమోదు కాలేదని, కానీ సమీప దేశాలైన బాంగ్లాదేశ్, పాకిస్తాన్ లలో కొన్ని కేసులు నమోదైన దృష్ట్యా ముందస్తు జాగ్రత్తలు, బాలల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. కావున తల్లిదండ్రులు తమ పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు.

ఈ కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్ వో డా.జి.గీతా బాయి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ దేవ సుధా లక్ష్మి, వైద్య ఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ విజయవాడ డాక్టర్ ఎన్.మల్లేశ్వరి, గ్రామ సర్పంచ్ డొక్కు సోమేశ్వరరావు, పీహెచ్ డాక్టర్లు సునీల్, సిహెచ్ రంగమనాయుడు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.