Close

హెల్మెట్ ధరించడం వలన మనతో పాటు మరో ఇద్దరికి ప్రమాదం జరగకుండా నివారించవచ్చును.. జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి …

Publish Date : 06/02/2025

హెల్మెట్ ధరించడం తలకు భారంగా భావించవద్దు, మన కుటుంబానికి భద్రత.

ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ఆవశ్యకతను వివరించి, ప్రతి ఒక్కరూ తప్పక హెల్మెట్ ధరించి ప్రయాణాలు చేయాలని జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి సంయుక్తంగా కోరారు.

గురువారం స్థానిక కొత్త బస్టాండు యస్ జెజియం ఉన్నత పాఠశాల వద్ద 36వ జాతీయ రహదారి భధ్రతా మాసోత్సవాల్లో భాగంగా జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో జరిగిన హెల్మెట్ ర్యాలీని జిల్లా కలెక్టరు జెండా ఊపి ప్రారంభించి, హెల్మెట్లు ధరించి జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి ద్విచక్ర వాహనాలను స్వయంగా నడుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు. జువ్వలపాలెం రోడ్డు శ్రీ అల్లూరి సీతారామరాజు స్మృతి వనం వరకు ర్యాలీ సాగింది. పట్టణంలో పలువురు రెండు చక్రాల వాహన దారులకు హెల్మెట్ ర్యాలీతో మంచి ఆలోచన, స్ఫూర్తిని కలిగించాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ హెల్మెట్ ధరించి సురక్షితంగా గమ్యానికి చేరాలని, ఇంటి దగ్గర మీకోసం తల్లితండ్రులు, భార్య, పిల్లలు ఎదురు చూస్తారని జిల్లా కలెక్టరు హితవు పలికారు. రెండు చక్రాల వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వలన జరిగే మరణాలలో 70 శాతం కేసులు ఉంటున్నాయని అన్నారు.హెల్మెట్ ధరించడం తలకు భారంగా ఎంతమాత్రం భావించవద్దని, రోజూ జరుగుతున్న ప్రమాదాలను ఒకసారి పరిశీలించి తప్పక హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలన్నారు. మన జిల్లాలో మోటారు సైకిల్ మీద ముగ్గురు ప్రయాణాలు చేస్తున్నారని, ఇది చాలా బాధాకరం అన్నారు. మోటారు వాహనం చట్టం 129 సెక్షన్ ప్రకారం రెండు చక్రాల వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతున్న వాహనచోధకుల వివరాలను తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతున్న వారిని మొదట హెచ్చరికతో వదిలి, హెల్మెట్ యొక్క ఆవశ్యకతను వివరించాలని, రెండవసారి కూడ హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే ఖచ్చితంగా మోటారు వాహన చట్టం 177 సెక్షన్ ప్రకారం వెయ్యి రూపాయలకు పైగా అపరాధ రుసుం విధించబడుతుందని జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి హెచ్చరించారు.

జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి మాట్లాడుతూ 36వ జాతీయ రహదారి భధ్రతా మాసోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో జనవరి 16 వ తేదీ నుండి జిల్లాలో ప్రతి రోజూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించటం మంచి శుభ పరిణామం అన్నారు. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరిలో ఆలోచన కలగాలని, వాహనం కొనుగోలు చేసినప్పుడే హెల్మెట్ కూడా తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. రెండు చక్రాలు వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ఇద్దరు తోనే ప్రయాణాలు చేయాలని, నాలుగు చక్రాల వాహనదారులు తప్పనిసరిగా సీట్లు బెల్టులు, మద్యం సేవించకుండా నడిపి, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే మరణాల శాతం చాలావరకు తగ్గుముఖం పడతాయని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఏఎస్పి వి.భీమారావు, జిల్లా రవాణా శాఖ అధికారి టి.ఉమామహేశ్వర రావు, డీఎస్పీ ఆర్.జి.జయసూర్య, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు కె.యస్.యన్.ప్రసాదు,
సి.హెచ్.వి.రమణ, యం.రవికుమార్, యన్.యల్.యస్.లక్ష్మి,డి.సత్యనాణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి.ఇ.ఇ.దానం, విజ్ఞాన వేదిక కన్వీనరు చెరుకువాడ రంగసాయి, స్వచ్ఛంద సేవకులు అల్లు శ్రీనివాసు, ఆటో యూనియన్ ప్రెసిడెంటు ఇంటి సత్యనారాయణ, రవాణా శాఖ, పోలీసు, వివిధ శాఖల సిబ్బంది,పట్టణ విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

 

1.11