స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సిద్ధం కావాలి-జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
ఆగస్టు 15న నిర్వహించబోయే జిల్లా స్థాయి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు.
‘హర్ ఘర్ తిరంగా’ ప్రచారంలో భాగంగా జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన సెల్ఫీ పాయింట్ వద్ద బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సెల్ఫీ దిగారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రజలు త్రివర్ణ పతాకంతో దిగిన సెల్ఫలను ‘హర్ ఘర్ తిరంగా వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని మన ప్రధాని మోదీ ప్రారంభించిన హర్ ఘర్ తిరంగా ప్రచారం రెండేళ్లలో జాతీయ ఉద్యమంగా మారిందని పేర్కొన్నారు. అలాగే ఈ నెల 15వ తేదీ వరకు ప్రతీ ఒక్కరూ తమ ఇళ్ల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు వీలుగా పోలీసు కవాతు మైదానంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలన్నారు. పోలీసు గౌరవ వందనం, కవాతు, బందోబస్తు, ట్రాఫిక్ సమస్యలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో పాల్గొనే ప్రముఖులు, ప్రజా ప్రతినిధులకు సీటింగ్ ఏర్పాట్లు, ఆహ్వానం, అదేవిధంగా స్వాతంత్ర్య సమరయోధులను గుర్తించి వివరాలను సిద్ధం చేయాలన్నారు. జిల్లా సంక్షేమం, అభివృద్ధిని ప్రతిబింబించేలా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలతో శకటాలు, స్టాళ్ల ప్రదర్శన ఉండాలన్నారు. అదేవిధంగా జిల్లా సాధించిన ప్రగతిని వివరించేలా కూడా స్టాల్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. దేశభక్తిని చాటే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. కార్యక్రమానికి ఎలాంటి అవరోధం కలగకుండా రెయిన్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేయాలని, కార్యక్రమంలో పాల్గొన్న వారికి స్నాక్స్, తాగునీరు అందించే విధంగా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఆయా శాఖల అధికారులకు కేటాయించిన విధులను సమన్వయం చేసుకుంటూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా సూచించారు.


