Close

స్వయం సహాయక సంఘాల మహిళలు స్వశక్తితో ఆర్థికంగా ఎదిగేందుకు వివిధ యూనిట్ల స్థాపనకు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

Publish Date : 02/05/2025

గురువారం అత్తిలి మండలం అత్తిలి, మంచిలి గ్రామాలలో మహిళా సమైక్య సభ్యుల ద్వారా నిర్వహిస్తున్న వివిధ స్వయం ఉపాధి యూనిట్లను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సందర్శించి నిర్వాహకులకు పలు సూచనలను చేశారు. తొలుత జిల్లా కలెక్టర్ మంచిలి గ్రామం సమైక్య భవనంలో ఎస్ హెచ్ జీ గ్రూపు సభ్యులు పూతరేకుల యూనిట్లను నిర్వహిస్తున్న మహిళలతో ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ మహిళలు ఆర్ధికంగా స్వశక్తితో నిలబడేందుకు బ్యాంకు లింకేజీ, సిఐఎఫ్, స్త్రీ నిధి, పి ఎం ఈ జి పి, తదితర ప్రభుత్వం అందించే బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకొని యూనిట్లను స్థాపించాలని, ఇప్పటికే యూనిట్లను స్థాపించి విజయవంతంగా నిర్వహిస్తున్న మీ అందరికీ ప్రత్యేక అభినందనలను తెలియజేస్తున్నానన్నారు. గాంధీజీ కలలుకన్న స్వరాజ్య స్థాపనకు పల్లెటూర్లే పట్టుకొమ్మలని మీరందరూ కుటీర పరిశ్రమలు స్థాపించి నిరూపిస్తున్నారన్నారు. మీరందరూ ఆర్థిక అభివృద్ధికి మూల స్తంభాలుగా నిలవడానికి దోహదపడటం ఎంతో సంతోషించదగిన విషయం అన్నారు. ఇప్పటివరకు ఆఫ్లైన్ ద్వారా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండేదని, అప్పుడు ఆన్లైన్ ఆర్డర్ ద్వారా కూడా అమ్ముకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయని తెలిపారు. తయారు చేయడం ఎంత ముఖ్యమో దాని బ్రాండింగ్ కూడా అంతే ముఖ్యమని అందమైన ఆకర్షణీయమైన ప్యాకింగ్ తో ఇవ్వగలిగితే అమ్మకాలు కూడా పెరిగి లాభపడతారన్నారు. ప్రస్తుతం అన్ని పండుగలకు స్వీట్స్ ను బహుమతిగా ఇచ్చిపుచ్చుకోవడం నడుస్తుందని, ఆకర్షణీయమైన ప్యాకింగ్ లో అందజేయడం ముఖ్యం అన్నారు. శ్రీ పద్మ పూతరేకులు యూనిట్ నిర్వాహకురాలు చల్ల పద్మ ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం నల్లమట్ల ఝాన్సీ దుర్గా ప్రశాంతి డిఆర్ డిఎ, సర్ఫ్ ద్వారా పొందిన రుణంతో ఏర్పాటు చేసిన శ్రీ శ్రావణి గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ ను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఆర్థికంగా ఎదగాలని, క్యాటరింగ్ ను కూడా ప్రారంభించాలని సూచించారు. అత్తిలి మసీదు రోడ్ లో పీఎంఈజీపి రుణం రూ.9.20 లక్షలతో ఏర్పాటుచేసిన పేపర్ ప్లేట్స్, స్వీట్ బాక్స్ తయారీ యూనిట్ ను జిల్లా కలెక్టర్ సందర్శించి తయారీ విధానాన్ని స్వయంగా పరిశీలించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎన్.వీర భాగ్యలక్ష్మి నిర్వహిస్తున్న కామధేను త్రెడ్స్ దారపు బంతులు తయారీ యూనిట్ ను సందర్శించి పరిశీలించారు. సరదాగా దారం తయారి యంత్రాన్ని కొంత సమయం తిప్పి నిర్వాహకులను ఉత్సాహపరిచారు. శ్రీనిధి, బ్యాంకు లింకేజీ రుణాలతో పేరాబత్తుల అనూష నిర్వహిస్తున్న అనూష బోటిక్ అండ్ మగ్గం వర్క్స్, టైలరింగ్ యూనిట్ ను జిల్లా కలెక్టర్ సందర్శించి నిర్వాహకురాలను వివరాలను అడిగి తెలుసుకున్నారు. మెటీరియల్ ఎక్కడినుంచి తీసుకొస్తారు, వ్యాపారం ఎలా ఉంది, గిట్టుబాటు అవుతుందా అని ప్రశ్నలు అడుగగా వ్యాపారం ఆర్థికంగా బాగుందని బదులిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రతి మహిళ స్వయంగా ఆర్థికంగా ఎదిగినప్పుడే కుటుంబంలో, సమాజంలో గుర్తింపు, ఆదరణ లభిస్తాయన్నారు. ప్రభుత్వం మంజూరు చేస్తున్న వివిధ రుణాలను దుబారాగా ఖర్చు చేయకుండా సద్వినియోగం చేసుకుంటే కుటుంబం కూడా ఆర్థికంగా ఎదుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు.

కిశోరి వికాసం – వేసవి శిక్షణ కార్యక్రమాలను యువతులు సద్వినియోగం చేసుకునేలా చూడాలి.. జిల్లా కలెక్టర్

కిశోరి వికాసం – వేసవి శిక్షణ కార్యక్రమాలు యువతులకు మే 2 నుండి జూన్ 10 వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. శిక్షణ తరగతుల్లో రుతుక్రమం పరిశుభ్రత మరియు లైంగిక విద్య, పునరుత్పత్తి ఆరోగ్యం, బాల్య వివాహాల వలన కలిగే దుష్ప్రభావాలు, బాలల హక్కుల రక్షణ ఫోక్సో చట్టం గురించి అవగాహన, కౌమార దశలో రక్తహీనత బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, ఆడపిల్లల పట్ల లింగ వివక్షత మరియు అసమానతలు, ఉన్నత విద్య నైపుణ్యాలు మరియు కెరీర్ మార్గదర్శకత్వం, సైబర్ నేరాలు ఆన్లైన్ భద్రత వివిధ సమస్యలను ఎదుర్కోవడం, ఆర్థిక అంశాల నిర్వహణ మరియు పొదుపు, కౌమార బాలికల నాయకత్వం మరియు సాధికారికత, శారీరక వ్యాయామం క్రీడలు మరియు ఆటల ప్రాముఖ్యత, బాల్య వివాహాలు వలన కలిగే దుష్ప్రభావాలు మరియు నివారణ అంశాలపై యువతులకు శిక్షణా తరగతుల ద్వారా అవగాహన కల్పించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని యువతులు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు.

యూనిట్ల పరిశీలన సందర్భంలో డి ఆర్ డి ఏ పిడి ఎంఎస్ఎస్ వేణుగోపాల్, లైవ్లీ హుడ్స్ డిపిఎం ఎస్ కుసుమ కుమారి, అత్తిలి మండల సమైక్య ప్రెసిడెంట్ పి.సుభద్ర, ఎంపీడీవో పీ.శామ్యూల్, ఏపిఎం, సిపి, వివోఎస్ లు, తదితరులు ఉన్నారు.