స్వయం సహాయక సంఘాల మహిళలకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
శనివారం భీమవరం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పెన్షన్లు, ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్, బ్యాంకు లింకేజీ, ఉన్నతి, స్త్రీ నిధి, లైవ్లీ హుడ్స్, అక్షర ఆంధ్ర లెటరసీ కార్యక్రమం పై జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ గుర్రపు డెక్క నుండి వర్మి కంపోస్ట్ రూపొందించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. ప్రతి మండలంలో మూడు యూనిట్లు తప్పనిసరిగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వర్మీ కంపోస్ట్ సాగు పొలాలకు, ఉద్యానవన క్షేత్రాలకు ఎంతో మేలు చేకూరుస్తుందన్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో యూరియా ఇబ్బందులను రోజు చూస్తూనే ఉన్నామని, ఇటువంటి వర్మీ కంపోస్ట్ తయారీ వలన యూరియా వినియోగం కూడా తగ్గుతుందన్నారు. మన జిల్లాలో యూరియా కొరత లేదని స్పష్టం చేశారు. భీమవరం మండలం గొల్లవాని తిప్ప, పాలకోడేరు మండలం గొల్లలకోడేరు, ఆకువీడు మండలం సిద్దాపురం గ్రామాలలో గుర్రపు డెక్క ద్వారా కంపోస్ట్ ఎరువు తయారీ కేంద్రాలను ప్రారంభించి వినియోగంలోనికి తీసుకురావడం జరిగిందన్నారు. త్వరలో ఆకువీడు మండలం దుంపగడప, పాలకోడేరు మండలం పాలకోడేరు, కాళ్ల మండలం ఏలూరుపాడులో యూనిట్లు ప్రారంభానికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఎస్ హెచ్ జి లకు ఉపాధి అవకాశం ఏర్పాటుకు ఇది ఒక చక్కని అవకాశం అన్నారు. ఎంపీడీవోలు, వ్యవసాయ శాఖల కన్వర్జెన్సీతో డిఆర్డిఏ సమన్వయం చేసుకుంటూ పెద్ద ఎత్తున గుర్రపు డెక్క వర్మీ కంపోస్ట్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లాలో 2,26,513 సామాజిక పెన్షన్ దారులు ఉన్నారని, వీరిలో మరణించిన, శాశ్వతంగా వలస వెళ్ళిన 482 మంది పెన్షన్లను తొలగించడం జరిగిందన్నారు. హెల్త్ పెన్షన్లు 1,510 ఉండగా 658 మంది మాత్రమే అర్హత ఉన్నాయని, 603 దివ్యాంగుల పెన్షన్లగా, 84 వృద్ధాప్య పెన్షన్లుగా మార్పు చేయగా 165 తిరస్కరించి, అప్పీల్ కు అవకాశం కల్పించడం జరిగింది అన్నారు. దివ్యాంగుల పెన్షన్లు 27,582 ఉండగా ఇప్పటివరకు 15,576 వెరిఫికేషన్ పూర్తి చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 20 మండల సమైక్యలు సమైక్యలు ఉండగా, 853 వివోలు, 27,877 ఎస్.హెచ్.జిలు ఉన్నాయన్నారు. మొత్తం 2,78,910 గ్రూపు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. చివరి అల్పాదయ వర్గాలు, అట్టడుగు వర్గాల మహిళలను కూడా ప్రోత్సహించి ఎస్ హెచ్ గ్రూపు లలో చేరేలా చూడాలన్నారు. బ్యాంకు లింకేజీ 72 శాతం సాధించి రాష్ట్రంలో పదో స్థానంలో నిలిచామన్నారు. ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఉన్నతి పథకం కింద 2025 .26 సంవత్సరానికి 1,705 సభ్యులతో రూ.8.53 కోట్ల వ్యయంతో ఉపాధి యూనిట్ల మంజూరు లక్ష్యం కాగా, ఆగస్టు 25 నాటికి 187 మందికి రూ.1.27 కోట్లు మంజూరు చేయడం ద్వారా నూరు శాతం లక్ష్యాన్ని సాధించడం జరిగిందన్నారు. మంజూరు చేసిన యూనిట్లను విజయవంతంగా నిర్వహించేలా డిఆర్డిఏ అధికారులు పర్యవేక్షించాలన్నారు. స్త్రీ నిధి రుణాలు రూ.62.37 కోట్లు మంజూరు చేయడం ద్వారా 91.05 శాతం సాధించడం జరిగిందని, రాష్ట్రంలో తొమ్మిదవ స్థానంలో నిలిచామన్నారు. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే అక్షర ఆంధ్ర కార్యక్రమాన్ని జిల్లాలో బాగా ముందుకు తీసుకెళ్లాలన్నారు. లేసు అల్లికలను మంచి నాణ్యమైన మెటీరియల్ తో కొత్త కొత్త మోడల్స్ తయారుచేసి అందుబాటులో తీసుకురావాలని సూచించారు. ఏ వ్యాపారానికైనా ఆకర్షణీయమైన ప్రచారం అవసరం అని దీనికి అనుగుణంగా డిస్ప్లే బోర్డులు ప్రదర్శనను ఏర్పాటు చేసుకోవాలన్నారు. లోసరి నుండి చించినాడ బ్రిడ్జి వరకు ఉన్న జాతీయ రహదారిలో ఫిష్ అండ్ ఫ్రాన్స్ అవుట్లెట్స్ ను ఏర్పాటుచేసి రుచికరమైన ఆహారాన్ని అందజేయాలి అన్నారు. పేద వర్గాలకు దురదృష్టపు శాత్తు అనుకోని సంఘటన ఎదురైనప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా పీఎంజెజెబివై., పీఎంఎస్బివై బీమా పథకాలలో తప్పనిసరిగా నమోదు అయ్యేలా చూడాలన్నారు. ఇరిగేషన్ శాఖలోని లష్కర్లను కూడా బీమా పథకాల్లో చేర్చాలన్నారు. జిల్లాలో ప్రతి మహిళ ఏదో ఒక ఉపాధి మార్గంలో ఉండేలా ప్రోత్సహించి, అందుకు తగిన ఆర్థిక సహాయాన్ని అందజేయడానికి డిఆర్డిఏ అధికారుల కృషి చేయాలని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎం ఎస్ ఎస్ వేణుగోపాల్, డీపీఎమ్ లు కే.శ్రీనివాస్, కె.కుసుమ కుమారి, ఎం.శ్రీనివాస్ ప్రసాద్, డి.వెంకటేశ్వరరావు, బి.బాలాజీ, ఏపీఎం లు టి.మురళీకృష్ణ, ఏ.రవికుమార్, అన్ని మండలాల ఏపీఎంలు పాల్గొన్నారు.