Close

స్వచ్చాంధ్ర లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి….ఎన్టీఆర్ పార్కులో మున్సిపల్ కార్మికులతో కలిసి చెత్తను ఊడ్చి పరిశుభ్రం చేసిన ముఖ్యమంత్రి

Publish Date : 15/03/2025

స్వచ్చాంధ్ర లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

అభివృద్ధి-సంక్షేమం-సుపరిపాలనతో ముందుకెళ్తున్నాం

గత పాలకులు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు, పరదాలు కట్టుకుని తిరిగారు

సుస్థిరమైన ప్రభుత్వంతోనే వేగవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుంది

కేంద్రం అందిస్తున్న ఆర్థిక సాయంతో రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి చేస్తాం

తణుకులో స్వర్ణాంధ్ర, స్వచ్చాంధ్ర కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు

ఎన్టీఆర్ పార్కులో మున్సిపల్ కార్మికులతో కలిసి చెత్తను ఊడ్చి పరిశుభ్రం చేసిన ముఖ్యమంత్రి

స్వచ్చాంధ్ర లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలి. ఇళ్లతో పాటు మన చుట్టూ ఉన్న పరిసరాలు, స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాలు, ప్రార్థనా మందిరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. గత పాలకులు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. రూ. 10 లక్షల కోట్ల అప్పుభారం ప్రజలపై మోపారు. రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని, ప్రజల సహకారంతో ఏపీని అభివృద్ధి పథంలో నడిపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.

ఇది ప్రజా ప్రభుత్వం :

1978, మార్చి 15వ తేదీ … 45 ఏళ్ల క్రితం ఇదే రోజు నేను మొదటి సారి అసెంబ్లీలో అడుగుపెట్టాను. ఈ రాష్ట్రంలో ఎవరికీ దక్కని అసాధారణ గౌరవం నాకు దక్కింది. తెలుగు ప్రజలకు సేవ చేయాలన్నదే నా లక్ష్యం. పాలనలో సంస్కరణలు తెస్తున్నాం. టీడీపీ, బీజేపీ, జనసేన కలయికను ప్రజలు ఆశీర్వదించారు. కేంద్ర సహకారంతో రాష్ట్రం అభివృద్ధి బాట పట్టింది. స్వర్ణాంధ్ర 2047 పేరుతో ఒక స్పష్టమైన విధానం తీసుకొచ్చాం. గత పాలకులు ఏనాడైనా ప్రజల్లో తిరిగారా ? పరదాలు కట్టుకుని తిరిగారు. గాల్లో వస్తుంటే నేలపై చెట్లు నరికించారు. ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితులు లేకుండా చేశారు. ఐదేళ్లు రాష్ట్రాన్ని లూటీ చేసి రూ. 10 కోట్ల అప్పులు ప్రజలపై మోపారు. అసలు , వడ్డీ కడుతున్నాం. గత పాలకులు చెత్తపైనా పన్ను వేశారు. మీ పట్టాదారు పుస్తకాలపై వారి బొమ్మలు వేశారు. రాజముద్రతో పట్టాదారు పుస్తకాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి లక్షల భూములు కబ్జా చేసేందుకు సిద్ధమయ్యారు. రికార్డులు తారుమారు చేశారు. ప్రైవేటు భూములు 22 ఏ కింద పెట్టేశారు. తప్పులు చేసి కప్పిపుచ్చుకునేందుకు రాజకీయ ముసుగులో ఎదురుదాడి చేస్తున్నారు. స్థిరమైన ప్రభుత్వంతోనే సుస్థిరమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. మన దేశంలో ఒక్క పెన్షన్ల కిందే ప్రతి నెలా 64 లక్షల మందికి ఏడాదికి రూ. 33 వేల కోట్లు వెచ్చిస్తోంది ఏపీ ప్రభుత్వమే. గత ప్రభుత్వంలో ముక్కుతూ మూలుగుతూ పింఛన్లు ఇచ్చారు. రూ. 200 పింఛన్ని రూ. 2 వేలు చేసింది నేనే. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు రూ. 3,000 పింఛను రూ.4000 వేలు చేశాను. డయాలసిస్ రోగులకు రూ. 10 వేలు ఇస్తున్నాం. మంచానికే పరిమితమైన వారికి రూ. 15 వేలు పింఛను ఇస్తూ మానవత్వాన్ని నిరూపించుకున్నాం. ఎన్నికల్లో చెప్పిన విధంగా సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తున్నాం. మే నెల నుంచి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికి తల్లికి వందనం అందిస్తున్నాం. ప్రజలు పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వాట్సాప్ గవర్నెన్స్ తెచ్చాం. దేశంలో ఎక్కడా లేని విధంగా మధ్యతరగతి కుటుంబాలకు బీమా కల్పిస్తున్నాం. రైతు భరోసా కింద రూ. 20 వేలు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్నాం. గత ఐదేళ్లలో ఎక్కడ చూసినా గుంతలే. నూటికి 85 శాతం రోడ్లలో గుంతలు లేకుండా చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిదే. గతంలో 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా నేను చేసిన పనుల వల్ల దేశంలో అత్యధిక తలసరి ఆదాయం తెలంగాణ నుంచి వస్తోంది. గత ఐదేళ్లూ అభివృద్ధి అన్న మాట లేకపోవడంతో దక్షణ భారతదేశంలో తక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రంగా ఏపీ నిలిచింది.

స్వచ్చాంధ్ర కోసం ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలి

గత పాలకుడు ఐదేళ్లలో కనీసం మట్టి కూడా తీయలేదు. 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను మనకు వారసత్వంగా ఇచ్చారు. స్వచ్చత, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమం చేయాలి. తణుకులో కూరగాయల మార్కెట్ చూశాను. మిగిలిన కూరగాయలు అక్కడే ఉంచడంతో కుళ్లి పోయి పరిసరాలు కలుషితం అవుతున్నాయి. వేస్ట్ టూ ఎనర్జీ కింద కంపోస్ట్ తయారు చేసే టెక్నాలజీ వచ్చింది. రోజుకు ఒక టన్ను చెత్త వేస్తే కంపోస్టు తయారవుతుంది. నేను ప్రతి నెలా మూడో శనివారం స్వచ్చాంధ్ర కార్యక్రమం పెట్టాను. సమాజం కోసం పనిచేయండి. మన ఆరోగ్యం కాపాడే మున్సిపల్ కార్మికులను నా పక్కన కూర్చోబెట్టుకున్నాను. వారిని ప్రతి ఒక్కరూ గౌరవించాలి. మన్సిపల్ కార్మికులను ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాము. ఇంట్లో చెత్త బయట వేసి పరిసరాలు కలుషితం చేయొద్దు. పొడి చెత్త, తడి చెత్త రెంటినీ వేరు చేస్తే ఎంతో ఉపయోగపడతాయి. గుర్రపు డెక్క నుంచి కూడా బ్యాగులు, ఎరువులు తయారు చేసే పరిస్థితికి వచ్చాం. బ్యాగులు కూడా తయారుచేస్తున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం నిషేధం కార్యక్రమంపై ప్రజల్లో మరింత చైతన్యం కలిగించేందుకు ముందుకొచ్చిన వారిని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. ప్లాస్టిక్ పెను భూతం. ప్రకృతిని నాశనం చేస్తోంది. ప్లాస్టిక్ తినడంతో శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్లు వస్తున్నాయి. ఒకప్పుడు పంజాబ్ రాష్ట్రం దేశానికి అన్నం పెట్టింది. కానీ వారు పండించే పంటకు రసాయన ఎరువులు కొట్టడంతో అవి తింటున్న ప్రజలు క్యాన్సర్ బారిన పడుతున్నారు. నేడు ప్రతి రోజూ పంజాబ్ నుంచి ఢిల్లీకి క్యాన్సర్ రోగులతో ఒక ట్రైన్ వస్తోందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. మా అత్తగారు క్యాన్సర్ తో చనిపోయారు. ఆవిడ పేరుతో బసవ తారకం క్యాన్సర్ ఆస్పత్రిని నెలకొల్పి వైద్య సేవలు అందిస్తున్నాము. క్యాన్సర్ నివారణపై ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేందుకు ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుడు నోరి దత్తాత్రేయుణ్ణి సలహాదారుగా నియమించాం.

అక్టోబర్ 2 తర్వాత ఆకస్మిక తనిఖీలు చేస్తా

మళ్లీ 95 నాటి ముఖ్యమంత్రిని చూస్తారు. అక్టోబర్ 2 తర్వాత రాష్ట్రమంతటా ఆకస్మిక తనిఖీలు చేస్తాను. మీ ఊరికి వచ్చే విషయం కేవలం రెండు, మూడు గంటల ముందే తెలుస్తుంది. ఎమ్మెల్యేలు పరుగెత్తాల్సి వస్తుంది. సమైక్యాంధ్రలో పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమం దేశంలోనే మొదటిసారిగా నేను ప్రారంభించాను. . ప్రధాని మోదీ ఆదేశాల ప్రకారం స్వచ్ఛ భారత్ నివేదిక ఇచ్చాను. నా ఆశయం ఒకటే స్వచ్ఛమైన ఏపీ తయారుచేయాలి. స్వర్ణాంధ్ర, స్వచ్చాంధ్ర మా లక్ష్యం. విశాఖ ,గుంటూరులో 30 మెగావాట్ల రెండు వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లు నెల్లూరు, రాజమండ్రిలో రూ.700 కోట్లతో 22 మెగావాట్ల విద్యుత్ తయారుచేసే ప్లాంట్లు పెడుతున్నాం. రాష్ట్రంలో 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త రోడ్లపై ఉంది. అందులో 51 లక్షల చెత్త తొలగింపు పూర్తయింది. అక్టోబర్ 2 నాటికి ఎక్కడా చెత్త లేకుండా చేసేందుకు మంత్రి నారాయణ పనిచేస్తున్నారు. 2027 నాటికి 100 శాతం మురుగునీటిని శుద్ధి చేసి వ్యవసాయానికి వాడుతాం. ఒకప్పుడు మరుగుదొడ్లు ఉండేవి కాదు. మహిళల ఆత్మ గౌరవం పేరుతో కొత్తవి నిర్మించాం. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 4 లక్షల 60 వేల మరుగుదొడ్లు మంజూరు చేశాం. అందులో 72 వేల మరుగుదొడ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. పట్టణాలు, మండల హెడ్ క్వార్టర్స్ లో కమ్యూనిటీ టాయిలెట్స్ నిర్మిస్తాం.

ఇండికేటర్స్ ఆధారంగా జిల్లాలకు ర్యాంకులు

స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి విభాగానికి పెర్మామెన్స్ ఇండికేటర్ ర్యాంకింగ్స్ తయారుచేశాం. మున్సిపల్ శాఖకు 20 పాయింట్లు , పంచాయతీ రాజ్ కు 28 పాయింట్లు, ఎడ్యుకేషన్ కు 14 పాయింట్లు, టూరిజంకు 11 పాయింట్లు, ఇండస్ట్రీస్కు 13 పాయింట్లు, హాస్టల్స్ కు 11 పాయింట్లు , ఎండోమెంట్ కు 11 పాయింట్లు , ఆస్పత్రులకు 9 పాయింట్లు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కు 5 పాయింట్లు, బస్టాండ్లు, ర్వైల్వే స్టేషన్లకు 7 పాయింట్లు, మార్కెట్స్ కు 9 పాయింట్లు, హైవేస్ కు 3 పాయింట్లు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు 7 పాయింట్లు చొప్పున ఇచ్చాం. మున్సిపల్ అడ్మినిష్ట్రేషన్ లో జిల్లాల ప్రోగ్రస్ గమనిస్తే…. ఎన్టీఆర్ జిల్లా 134 పాయింట్లు, అనాకపల్లి జిల్లా 131 పాయింట్లు , తిరుపతి 128 పాయింట్లు, విశాఖ 127 పాయింట్లు, అనంతపురం 123 పాయింట్లు, కాకినాడ 121 పాయింట్లు, గుంటూరు 119 పాయింట్లు, ఈస్ట్ గోదావరి 118 పాయింట్లు, పల్నాడు 117 పాయింట్లు, అన్నమయ్య 115 పాయింట్లు, అంబేద్కర్ కోనసీమ 115 పాయింట్లు, శ్రీకాకుళం 113 పాయింట్లు, వైఎస్సాఆర్ 113 పాయింట్లు, బాపట్ల 111 పాయింట్లు, ఏలూరు 108 పాయింట్లు, కర్నూలు 104 పాయింట్లు, నంద్యాల 102 పాయింట్లు, సత్యసాయి 102 పాయింట్లు, పార్వతీపురం 100 పాయింట్లు, పొట్టి శ్రీరాములు 100 పాయింట్లు, విజయనగరం 100 పాయింట్లు, కృష్ణా 99 పాయింట్లు, ప్రకాశం 99 పాయింట్లు, వెస్ట్ గోదావరి 97 పాయింట్లు , చిత్తూరు 91 పాయింట్లు, అల్లూరు సీతారామరాజు 68 పాయింట్లు వచ్చాయి. ఐవీఆర్ ఎస్ ద్వారా అందరి పనితనాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటాను. జపాన్ వంటి దేశాల్లో రోడ్డుపై చెత్త వేయరు. మనకూ అలాంటి అలవాట్లు రావాలి. మున్సిపల్ శాఖలో వివిధ పనుల నిమిత్తం…పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా రూ. 150 కోట్లు గ్రాంట్ గా అందబోతున్నాయి.

తణుకులో పలు అభివృద్ధి కార్యక్రమాలు

తణుకు ఎమ్యెల్యే రాధాకృష్ణ డైనమిక్ లీడర్. తణుకులో పలు అభివృద్ధి పనులకు నిధులు కావాలని అడిగారు. తప్పకుండా మంజూరు చేస్తాం. ఇక తణుకు అనగానే ప్రముళఖ పారిశ్రామికవేత్త ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్ గారిని మనం గుర్తుచేసుకోవాలి. ఆయన తణుకు మున్సిపాలిటీకి ఎన్నో సేవలు చేశారు. ఈ నియోజకవర్గ ప్రజలు టీడీపీకి ఎక్కువ సార్లు పట్టం కట్టారు. అయితే….తణుకు అనగానే టీడీఆర్ బ్రాండ్లు గుర్తొస్తాయని సీఎం చంద్రబాబు అన్నారు. అంతకుముందు తణుకు కూరగాయల హోల్ సేల్ మార్కెట్ ను సీఎం చంద్రబాబు పరిశీలించారు. వ్యాపారం జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఎన్టీఆర్ పార్కులో చెత్తను ఊడ్చారు.. స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు.

5.1 2.1 4.1