స్థానిక సంస్థల ఎన్నికల వ్యయ పర్యవేక్షణపై బృందాలకు శిక్షణ ఎన్నికల వ్యయ వివరాల నమోదు, పరిశీలనలో పారదర్శకత పాటించాలి

Publish Date : 19/10/2026
WhatsApp Image 2026-10-19 at 4.21.35 PM

స్థానిక సంస్థల ఎన్నికల వ్యయ పర్యవేక్షణపై బృందాలకు శిక్షణ

ఎన్నికల వ్యయ వివరాల నమోదు, పరిశీలనలో పారదర్శకత పాటించాలి…

భీమవరం జిల్లా కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎన్నికల వ్యయ పరిశీలకులు ఎం డి అబ్దుల్ రవూఫ్ షేక్, ఐ ఎఫ్ ఎస్ ఆదేశాల మేరకు స్థానిక సంస్థల రెండో సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల వ్యయ పర్యవేక్షణ బృందాలకు సోమవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జిల్లా ఆడిట్ అధికారి, ఎన్నికల వ్యయ నోడల్ అధికారి ఎస్ మధు బాబు అధ్యక్షత వహించారు. ఎన్నికల వ్యయ పర్యవేక్షణ బృందాలకు విధులు, బాధ్యతలు, వ్యయ వివరాల నమోదు, రికార్డుల నిర్వహణపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా అభ్యర్థులు ఎన్నికల సమయంలో నిర్వహించాల్సిన వ్యయ వివరాలు, ఎన్నికల వ్యయానికి సంబంధించి పాటించాల్సిన మార్గదర్శకాలు, వ్యయ వివరాలను నమోదు చేయడానికి నిర్వహించాల్సిన రిజిస్టర్లు, వాటిని క్రమపద్ధతిలో నమోదు చేసే విధానాలపై వివరించారు.

ముఖ్యంగా షాడో అబ్జర్వేషన్ రిజిస్టర్ నిర్వహణ, అభ్యర్థులు సమర్పించే ఎన్నికల వ్యయ వివరాల పరిశీలన, వాస్తవంగా జరిగిన ఖర్చులకు, అభ్యర్థులు చూపిన ఖర్చులకు మధ్య వ్యత్యాసాలను గుర్తించడం వంటి కీలక అంశాలపై శిక్షణ ఇచ్చారు.

ఎన్నికల వ్యయ పర్యవేక్షణ బృందాలు తమకు అప్పగించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని, ఎన్నికల వ్యయానికి సంబంధించిన ప్రతి అంశాన్ని నిబంధనల ప్రకారం నమోదు చేస్తూ పూర్తి పారదర్శకత పాటించాలని ఎన్నికల వ్యయ నోడల్ అధికారి ఎస్ మధు బాబు సూచించారు.

ఎన్నికల నిర్వహణలో వ్యయ నియంత్రణ, సమర్థవంతమైన పర్యవేక్షణ, ఎన్నికల నిబంధనల అమలు అత్యంత కీలకమని పేర్కొన్నారు.

ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా ఎన్నికల వ్యయ పర్యవేక్షణ బృందాలకు తమ విధులు, బాధ్యతలు, వ్యయ వివరాల పరిశీలన, రికార్డుల నిర్వహణపై స్పష్టమైన అవగాహన కల్పించారు.