సీఎం పర్యటనకు అన్ని శాఖలు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి
లోపాలు లేని పట్టాదారు పాస్ పుస్తకాలనే రైతులకు అందజేయాలి
రాష్ట్ర ముఖ్యమంత్రి జూన్ 8న పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి శనివారం గూగుల్ మీట్ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ సభలకు నర్సాపురం డివిజన్ పరిధిలోని 24 గ్రామాలకు చెందిన పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్న రైతులు హాజరుకావాలని సూచించారు. పాస్ పుస్తకాలలో ఎటువంటి పొరపాట్లు లేకుండా ముందస్తుగా పరిశీలించి రైతులకు అందించాలని వీఆర్వోలను ఆదేశించారు. గ్రామ సభకు వచ్చేందుకు రైతులను బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వృద్ధులు, వికలాంగులు, చంటి పిల్లల తల్లులు, ఆరోగ్య సమస్యలున్న వారు సభలకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఎవరినీ బలవంతంగా కాకుండా స్వచ్ఛందంగా వచ్చే వారినే కార్యక్రమానికి తీసుకురావాలని స్పష్టం చేశారు. వేసవి తీవ్రత దృష్ట్యా రైతులకు తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు, స్నాక్స్ వంటి సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ప్రతి బస్సుకు ఒక క్లస్టర్ అధికారిని నియమించి రైతులు సురక్షితంగా సభకు చేరుకుని తిరిగి ఇళ్లకు వెళ్లే వరకు పూర్తి బాధ్యత తీసుకోవాలని సూచించారు. సభకు సుమారు 3,500 మంది రైతులు హాజరుకానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని అధికారులను ఆదేశించారు.